ఆ విధంగా..! ముందుకు..!!

 పాపం.. తెలుగుదేశం

మూడేళ్ళుగా తెలుగుదేశం పోరాడుతూనే ఉంది. ఓటర్ల మదిలో స్థానానికి పాకులాడుతూనే ముందుకు పోతోంది. బీసీలకు వంద సీట్లిస్తామని చంద్రబాబు ఘనంగా ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ అంశానికి అనుకూలంగా ఉన్నట్లూ సంకేతాలిచ్చారు. వ్యవసాయాన్ని అలక్ష్యం చేశాననీ అంగీకరించారు. తనను నమ్మాలని ఓటర్లకు మొరపెట్టుకున్నారు. ఫలితం చూసి బేరుమనక తప్పలేదు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే... ఫలితాలెలా ఉండబోతున్నాయో తెలుసుకోవడానికి ఆంగ్ల ఛానల్ ఎన్డీటీవీ ఓ సర్వే నిర్వహించింది. సర్వే ఫలితాలు చూసి తెలుగుదేశం పార్టీ తెల్లబోయింది. తమ నేతను ముఖ్యమంత్రిగా కావాలనుకుంటున్న వారి సంఖ్య కేవలం 18శాతమని తేలడం వారికి మింగుడుపడలేదు. 42 లోక్ సభ స్థానాలలో ఆచూకీ కనిపించకపోవడం వారికి శరాఘాతమే. 21స్థానాలను వైయస్ఆర్ కాంగ్రెస్, 10 స్థానాలను టీఆర్ఎస్, 9 స్థానాలను కాంగ్రెస్, ఒక స్థానాన్ని మజ్లీస్ గెలుచుకుంటాయని తేలగా, ఆ ఒక్క స్థానాన్ని దక్కించుకోవడానికి బీజేపీ, వామపక్షాలతో పాటు పోటీపడాల్సిన పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ పడిపోయిందని సర్వేలో వెల్లడికావడం వారికి ఊహకందనిదే. గతంలో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలోనూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23నుంచి 27 లోక్ సభ స్థానాలు వస్తాయని వెల్లడవడం తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నానంటూ పదేపదే చెప్పుకుంటున్న చంద్రబాబుకు గుక్కతిప్పుకోలేని పరిణామమే. ఎన్డీటీవీ సర్వే ఫలితాలు వచ్చే సమయానికి ఆయన దేశంలో కూడా లేరు. ఆగమనానంతరం దీనిపై ఆయన ప్రతిస్పందన ఎలా ఉంటుందన్నదే అసలు ప్రశ్న. దీనిని అంగీకరిస్తారా... లేక కొట్టిపడేస్తారా చూడాల్సి ఉంది.

2004లో అధికారాన్ని కోల్పోయినప్పటినుంచి తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేరువకావడానికి చేయని యత్నం లేదు. బాబ్లీ అంశంపై ఎమ్మెల్యేలతో కలిసి చేపట్టిన బస్సు యాత్రను ప్రజలు నమ్మలేదనడానికి 2009ఎన్నికల ఫలితాలే రుజువు. అవినీతి .. అవినీతి.. అంటూ బాబు గొంతెత్తి దిక్కులు పిక్కటిల్లేలా అరిచినా.. నీ సంగతీ తెలుసులే అంటున్నట్లు ఓటర్లు జవాబు చెప్పారు. కరెంటు తీగలపై దుస్తులు ఆరేసుకోవాల్సిందేనంటూ ఉచిత విద్యుత్తు అంశంపై ఎకసెక్కాలాడిన బాబుకు ఓడించి తిరుగులేని సమాధానమిచ్చారు.

గడిచిన మూడు సంవత్సరాలలో పేరు తెచ్చుకోవడానికి ఆయన గానీ, తెలుగుదేశం పార్టీ గానీ చేయని యత్నంలేదు. బీసీలకు వంద టికెట్లంటూ చేసిన ప్రతిపాదన అభాసుపాలైంది. టికెట్లు కాదనీ, అందరం కలిసి బీసీలకు 150 సీట్లిద్దామనీ వైయస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేసిన ప్రతిపాదనకు ఆయన దగ్గర సమాధానమే లేకపోయింది. అవినీతి అంశంపై అన్నా హజారే పూరించిన సమర శంఖానికి శృతి కలిపిన బాబును చూసి నవ్వుకున్నవారూ లేకపోలేదు. పాదయాత్రలు చేపట్టిన ఆయనను చూసి బుగ్గలు నొక్కుకున్నారు. ఈ లోగా ఎన్డీటీవీ సర్వేలోని అంశాలు ఆ పార్టీకి పిడుగు పాటయ్యాయి. కొన్ని పత్రికలు బాబుకు ఎంతగా వంత పాడినా నిష్ఫలమేనని తేలిపోయింది. ఫలితంగా తెలుగుదేశం పార్టీ కడు దీన స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. పాపం... తెలుగు దేశం...

 

Back to Top