మన దేశంలోని పేదసాదలందరూ తమ బిడ్డలను ఫైవ్ స్టార్ ఆస్పత్రులకు తీసుకెళ్లే పరిస్థితి ఉందా? ‘ఈ రోజుల్లో ప్రభుత్వాస్పత్రులకు వెళ్లేదెవరండీ? అందరూ కార్పొరేట్ ఆస్పత్రులకు పోయేవారే! ప్రభుత్వాన్ని అల్లరి పెట్టాలనుకునేవారికి తప్ప ప్రభుత్వ ఆస్పత్రుల గొడవ ఎవరికి పట్టింది?’- ఈ ప్రశ్న వేసిన పెద్దమనిషి ఓ ప్రజా ప్రతినిధి. పాలక పక్షం తరఫున మన అసెంబ్లీలో విప్‌గా ఉన్న బాధ్యుడు! ఆయన పేరు ద్రోణంరాజు శ్రీనివాస్. విశాఖపట్నం (దక్షిణం) ఎమ్మెల్యే. ఒకానొక పేరుపొందిన ప్రభుత్వ ఆస్పత్రిలో -సరయిన సౌకర్యాలు కరువయిన కారణంగా- వందలాది పసిపిల్లల ప్రాణాలు ‘గాలి’లో కలిసిపోతున్నాయన్న విమర్శకు ద్రోణంరాజు వారి స్పందన ఇదీ!తిరుపతిలోని రుయా ఆస్పత్రి ఈ మధ్య తరచు పతాక శీర్షికలకు ఎక్కుతోంది. ఏదో అనితర సాధ్యమయిన శస్త్ర చికిత్స చేసినందుకో- టన్ను బరువున్న కంతిని కడుపులోంచి వెలికితీసి రోగిని బతికించినందుకో- రోజుల వయసు శిశువుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసినందుకో ఒక ఆస్పత్రి పేరు మీడియాలో మార్మోగిపోవడం వేరు. కానీ, రుయా ఆస్పత్రికి దక్కిన ‘ప్రాచుర్యం’ అలాంటిది కాదు.ఆక్సిజెన్ సిలిండర్లు తగినన్ని లేకపోయినందుకూ, వెంటిలేటర్లు కరువయి ఇంటిదీపాలు ఆరిపోయినందుకూ, మూడు నాలుగు జిల్లాలకు పెద్దదిక్కుగా ఉన్న ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే వైద్యులు ఉద్యోగాల మీద కన్నా ప్రైవేటు ప్రాక్టీసుల మీదే దృష్టిపెడుతున్నందుకూ, ఫలితంగా ఎందరో పేదల పిల్లలు అన్యాయమయిపోతున్నందుకూ రుయా ఆస్పత్రి మీడియాకెక్కింది. ఆ విషయంలో విప్ ద్రోణంరాజును మీడియా ప్రశ్నించగా వారు స్పందించిన తీరు ఇంత ఘనంగా ఉంది!నిజంగానే మన దేశంలోని పేదసాదలందరూ తమ బిడ్డలను ఫైవ్ స్టార్ ఆస్పత్రులకు తీసుకెళ్లే పరిస్థితి ఉందా? ఉంటే, నిన్నటి స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ‘పేదరికం నుంచి విముక్తి పొందిననాడే నిజమయిన స్వాతంత్య్రం సంపాదించుకున్నట్లు అవుతుం’దని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నమాటలకు అర్థమేమిటి? ద్రోణంరాజు బుకాయించినట్లుగానే పరిస్థితి ఉన్న పక్షంలో మొన్ననే రాష్ట్రపతి పదవిని అలంకరించిన ప్రణబ్ బాబూ ‘ఆకలి కడుపు దేశానికి అవమానకరం!’ అని తొలి సందేశంలోనే ప్రస్తావించడంలోని ఔచిత్యమేమిటి? ద్రోణంరాజు శ్రీనివాస్ పెద్దింటి బిడ్డ అయివుండొచ్చు.ఆయన తండ్రి కీ.శే. ద్రోణంరాజు సత్యనారాయణ గ్రామకరణాల సంఘం రాష్ట్ర నాయకుడిగా ఓ వెలుగు వెలిగివుండొచ్చు. ఒకప్పుడు మంత్రి పదవిని అలంకరించిన ప్రముఖుడయివుండొచ్చు. ఏ పీవీ నరసింహారావు దయతోనో పార్లమెంటు సభ్యత్వమూ వెలగబెట్టివుండొచ్చు. అలాంటి నేపథ్యంలో పుట్టిపెరిగిన శ్రీనివాస్ -ఈ రోజుల్లోనే కాదు, ఏ రోజుల్లోనూ- ప్రభుత్వాసుపత్రి గడప తొక్కివుండకపోవచ్చు. కానీ, అందరూ ఆయనంత భాగ్యశాలులు కారు కదా! మన దేశంలో ఇప్పటికీ 80 శాతం జనాభా పేదలే. వారిలో కొందరు దారిద్య్ర రేఖకు దిగువన దుర్భరమయిన జీవితం గడుపుతున్నారు. ఏ పూట ముద్ద ఆ పూట సంపాదించుకోకపోతే వారికి గడవదు. అలాంటివాళ్ల బిడ్డలకు ఏ అనారోగ్యమో ఎదురయితే, వారికి ప్రభుత్వ ఆస్పత్రులే గతి. అలాంటి ఆస్పత్రుల్లో ఆక్సిజెన్ సిలిండర్లూ, వెంటిలేటర్లలాంటి అత్యవసర పరికరాలు లేకపోతే పేదల పిల్లల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ద్రోణంరాజు శ్రీనివాస్‌లాంటి దొరబాబులకు ఎలా తెలుస్తుంది? ఓ వైపు ఎవ్వరూ ప్రభుత్వాస్పత్రులకు వెళ్లడమే లేదని దబాయిస్తూనే, మరోవంక మన ప్రభుత్వాస్పత్రుల్లో సకల సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయని ద్రోణంరాజు శ్రీనివాస్ యోగ్యతాపత్రం దయచేయించారు. అదే నిజమయితే, ఒక్క రుయా ఆస్పత్రిలోనే మూడు మాసాల స్వల్ప వ్యవధిలోనే 130 మంది సామాన్యుల బిడ్డలు ఎందుకు చనిపోయారో చెప్తారా విప్ గారూ? అయ్యా, ఇప్పటికయినా కళ్లు తెరవండి మహాప్రభో!