ఉచిత వైద్యం అందని ద్రాక్ష..!

ఆరోగ్యశ్రీకి మంగళం!

ఇక ట్రస్టు స్థానంలో బీమా విధానం

బీమా కంపెనీల లాభాపేక్ష ముందు పేదలకు ఉచిత వైద్యం ప్రశ్నార్థకం  

పబ్లిక్, ప్రైవేట్‌ బీమా కంపెనీల ద్వారా అమలుకు నిర్ణయం 

వైద్య ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌ 

ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ నిర్వీర్యం 

అందుకే ఉద్దేశపూర్వకంగా బకాయిలు చెల్లించని కూటమి ప్రభుత్వం  

రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం ఇక ఎండమావే 

బీమా కంపెనీ అనుమతి ఇచ్చే వరకు వేచి ఉండాల్సిన దుస్థితి 

సవాలక్ష కొర్రీలతో పేద రోగుల పరిస్థితి దైవాదీనం 

చికిత్స పొందాక ఇచ్చే ‘ఆరోగ్య ఆసరా’కూ ఇక మొండి చెయ్యి  

2014–19 మధ్య ప్రొసీజర్లు పెంచకుండా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం 

జగన్‌ హయాంలో 1,059 నుంచి 3,257కు ప్రొసీజర్స్‌ పెంపు 

ఈ దఫా మొత్తం పథకాన్ని కనుమరుగు చేస్తున్న చంద్రబాబు  

అమరావతి: రాష్ట్రంలో పేద ప్రజలకు ఉచిత వైద్యం ఇక ఎండమావిలా మారనుంది. కోటిన్నర కుటుంబాలకు ఆపద్భాంధవి అయిన ఆరోగ్యశ్రీ పథకాన్ని బీమా పద్ధతిలో అమలు చేయాలని కూటమి సర్కారు నిర్ణయించింది. ఆరోగ్యశ్రీ పథకానికి వెచ్చిస్తున్న మొత్తంలో భారీగా కోత కోయాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు అడుగులు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ఆరోగ్యశ్రీ ఉచిత వైద్య సేవలను ట్రస్ట్‌ పద్ధతిలో కాకుండా ఇన్సూరెన్స్‌ విధానంలో అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. 

శనివారం ఉండవల్లిలోని ఆయన నివాసంలో వైద్య ఆరోగ్య శాఖ  సమీక్షలో భాగంగా ఎన్టీఆర్‌ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)ను బీమా విధానంలో తీసుకొచ్చే అంశంపై అధికారులకు మార్గ నిర్దేశం చేశారు. ఆరోగ్య బీమా విధానం వల్ల నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని సమర్థించుకున్నారు. మొత్తంగా రాష్ట్రాన్ని రెండు యూనిట్లుగా విభజించి బీమా విధానాన్ని అమలు చేయాలని.. పబ్లిక్, ప్రైవేట్‌ సెక్టార్‌లోని బీమా కంపెనీల ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో బీమా కంపెనీల లాభాపేక్ష ముందు పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచితంగా కార్పొరేట్‌ వైద్యం అందడం ప్రశ్నార్థకంగా మారబోతోంది. 

పేదలెవరూ వైద్యం కోసం ఇబ్బందులు పడకుండా, అప్పుల పాలు కాకుండా మహోన్నత సంకల్పంతో 2007లో దివంగత వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014–19 మధ్య నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీకి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఊపిరిలూదింది. ఆరోగ్యశ్రీ అంటే వైయ‌స్ఆర్‌, వైయ‌స్‌ జగన్‌ గుర్తుకొచ్చేలా గత ఐదేళ్లుగా అమలైంది. అయితే వారి ముద్రను చెరిపివేసే చర్యల్లో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా కనుమరుగు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 

ఈ క్రమంలో ఇప్పటికే నెట్వర్క్‌ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా భారీగా బకాయి పెట్టారు. దీంతో ఆరోగ్యశ్రీ కార్డుతో ఆసుపత్రులకు వెళితే నిర్మొహమాటంగా యాజమాన్యాలు వెనక్కు పంపుతున్న దుస్థితి నెలకొంది. మరోవైపు చికిత్సల అనంతరం విశ్రాంతి సమయానికి అందించే ఆరోగ్య ఆసరా చెల్లింపులు సైతం నిలిచి పోయాయి.

ఈ నేపథ్యంలో శనివారం బీమా పేరిట ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ స్థానంలో ప్రైవేట్‌ కంపెనీని జొప్పించే ప్రతిపాదనలకు సీఎం ఆమోదం తెలిపారు. దీంతో కొత్త ఏడాదిలో టెండర్లు పిలిచి, బీమా కంపెనీల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఇప్పటికే వైద్య శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీమా కంపెనీలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించడం గమనార్హం. 

తొలి నుంచీ బాబుకు ప్రైవేట్‌ అంటే ప్రేమ  
»  విద్య, వైద్య రంగాలను ప్రైవేట్‌ పరం చేయటమే లక్ష్యంగా గతంలోనూ చంద్రబాబు పరిపాలన కొనసాగించారు. ప్రస్తుతం కూడా అదే తరహాలో  పాలన సాగిస్తున్నారు. ఏకంగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రతిష్టాత్మకమైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు. ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చడంతోపాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్‌ సౌకర్యం కల్పిస్తాం’ అని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అనంతరం మాట తప్పడం తెలిసిందే. 

» 2007లో వైఎస్సార్‌ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, ఆ తర్వాత చంద్రబాబు సర్కారు ఎన్టీఆర్‌ వైద్య సేవగా పేరు మార్చింది. తాజాగా బీమా రూపంలో పథకాన్ని ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. గత ప్రభుత్వంలో పథకం పరిధిలోకి తెచి్చన 3257 ప్రొసీజర్‌లకు కోతలు విధించడానికి వైద్య శాఖ కసరత్తు చేస్తోంది.   

» ప్రస్తుతం హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తుండగా కొత్త విధానంలో కుటుంబాలు/లబి్ధదారుల వారీగా ప్రభుత్వం ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్‌ కంపెనీ ద్వారా వైద్య సేవల కల్పన చేపడుతారు. ఇప్పటి వరకూ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నాయి. ఇన్సూరెన్స్‌ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే లాభాపేక్షతో ప్రజలకు వైద్య సేవలు ప్రశ్నార్థకంగా మారతాయనడంలో సందేహం లేదు. 

తాజా ప్రతిపాదనలకు ఆమోదం 
ఆరోగ్యశ్రీని ఇన్సూరెన్స్‌ విధానంలో అమలు చేయడంలో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విధానాలను కూడా పరిశీలించి అధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. జనఔషధి మందుల షాపులను ప్రతి మండలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

104 సర్వీసుల ద్వారా రక్త పరీక్షలు చేసే విధానాన్ని పైలెట్‌గా ప్రారంభించాలని సీఎం చెప్పారు. కొత్తగా 108 అంబులెన్స్‌లను కొనుగోలు చేయాలన్నారు. కాగా, 108 సర్వీసులో సిబ్బంది, డ్రైవర్లకు ఇస్తున్న జీతానికి అదనంగా రూ.4 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. కొత్తగా 58 మహాప్రస్థానం వాహనాలను సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా అందుబాటులోకి తేనున్నారు.

గత ప్రభుత్వంలో విప్లవాత్మక సంస్కరణలు
» వైయ‌స్ఆర్ సీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి విప్లవాత్మక సంస్కరణలతో వైయ‌స్‌ జగన్‌ ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించారు. 2019 ఎన్నికల హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చారు. చికిత్స వ్యయం పరిమితిని రూ.5 లక్షలు నుంచి 
దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షలకు పెంచారు.  

»  అంతకుముందు టీడీపీ హయాంలో కేవలం 1,059 ప్రొసీజర్లతో అస్తవ్యస్థంగా ఉన్న ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసి ప్రొసీజర్లను ఏకంగా 3,257కి పెంచారు. ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్స కోసం రూ.13 వేల కోట్లకు పైగా వెచి్చంచారు. శస్త్ర చికిత్సలు జరిగిన 24.59 లక్షల మందికి కోలుకునే సమయంలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర సాయం అందించారు. 

» ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను తేవాలన్న సంకల్పంతో రూ.8,500 కోట్లతో 17 కొత్త మెడికల్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల పల్లెకు, గిరిజన ప్రాంతాల్లోనూ పేదవాడి ఇంటి ముంగిటకే మెరుగైన వైద్యం అందించాలన్న సదుద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ప్రవేశపెట్టారు. వీటికి తోడు ప్రభుత్వ ఆస్పత్రులను మరింత మెరుగ్గా అభివృద్ధి చేయడంతో పాటు కొత్త ఆస్పత్రులు ఏర్పాటు చేసే కార్యక్రమంలో రూ.17 వేల కోట్లతో నాడు–నేడు కార్యక్రమం చేపట్టారు. 

» కోవిడ్‌ సమయంలో ప్రజలకు దేశంలో ఎక్కడా లేని విధంగా సేవలు అందించారు. వైద్య ఆరోగ్య శాఖ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఏకంగా 54 వేల వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు చేపట్టారు.  

Back to Top