ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ తో ఎంపి మద్దిల గురుమూర్తి భేటీ

తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్స్‌ సమస్యలకు పరిష్కారం చూపాల‌ని విన‌తి

న్యూఢిల్లీ: తిరుపతి పార్లమెంటు పరిదిలోని ఈఎస్ఐ హాస్పిటల్స్‌ సమస్యలకి పరిష్కారం చూపాలని కోరుతూ తిరుపతి ఎంపీ డా.మద్దిల గురుమూర్తి  ఇవాళ ఢిల్లీలో ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సందర్భంగా శ్రీసిటీ పారిశ్రామిక వాడలో నిర్మించ తలపెట్టిన 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్స్‌ నిర్మాణంలో ఆలస్యాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పారిశ్రామికంగా శరవేగంగా అబివృద్ది చెందుతున్న ఈ ప్రాంతాలలోని కార్మికులకు, సాదారణ ప్రజానీకానికి అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో ఈ హాస్పిటల్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఆయనకి వివరించారు. గత పార్లమెంటు సమావేశాలలో బాగంగా జీరో హవర్ లో ఈఎస్ఐ హాస్పిటల్స్‌ నిర్మాణం వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

తిరుపతి 50 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ పెరిగిన ఈఎస్ఐ లబ్దిదారుల ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చేందుకు సరిపోవటం లేదని ఈ హాస్పిటల్‌ను 100 పడకల హాస్పిటల్ గా పెంచాల్సిన అవసరాన్ని ఆయనకి వివరించారు. సత్యవేడు, తిరుమల, నాయుడుపేట, వరదయ్యపాలెం, నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు వంటి కీలక ప్రాంతాల్లోని అనేక ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు ఇంకా ప్రారంబానికి నోచుకొకపోవడం వలన అనేక మంది లబ్ధిదారులు అవసరమైన వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయనకి తెలియజేశారు. ఈ సమస్యలను తక్షణమే పరిష్కరించి ఈఎస్ఐ లబ్దిదారులకి మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డా. మద్దిల గురుమూర్తి ఆయనకి విజ్ఞప్తి చేశారు. సమస్యలను సావదానంగా విన్న ఈఎస్ఐ డైరెక్టర్ జనరల్ సానుకూలంగా స్పందించారని సమస్యల పరిష్కరానికి తగు చర్యలు తీసుకొంటామని తెలిపారని ఎంపీ గురుమూర్తి తెలియజేశారు.

Back to Top