కూట‌మి పాల‌న‌లో ఎస్సీల‌కు ర‌క్ష‌ణ క‌రువు

వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు ఆగ్ర‌హం

గ్రామ బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన కుటుంబాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల ప‌రామ‌ర్శ‌

క‌ర్నూలు ఎస్పీకి ఫిర్యాదు 

 క‌ర్నూలు: కూట‌మి ప్ర‌భుత్వంలో ఎస్సీల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు మండిప‌డ్డారు.  కేవ‌లం కూట‌మి ప్ర‌భుత్వానికి ఓటు వేయ‌లేద‌న్న కార‌ణంతో దాడులు, వేధింపుల‌కు గురి చేయ‌డం సిగ్గు చేటు అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్ది మండలం బొమ్మిరెడ్డిపల్లెలో దళితులను గ్రామ బహిష్కరణ చేయడం, ఆస్తుల విధ్వంసంపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు. కర్నూలులో బాధితులను మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్‌ సుధాకర్‌ బాబు,  కంగాటి శ్రీదేవి,  కాటసాని రామ్‌భూపాల్‌ రెడ్డి, కోడుమూరు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ డాక్టర్‌ ఆదిమూలపు సతీష్ ప‌రామ‌ర్శించారు. అనంతరం కర్నూలు ఎస్‌పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు మీడియాతో మాట్లాడారు. 

ఎస్సీలు వైయ‌స్ఆర్‌సీపీ వైపు ఉండొద్దా?:  సుధాకర్‌ బాబు  

ప‌త్తికొండ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు సాయంత్రమే మాదిగపల్లిపై పడి ఆడవారిని చెరబట్టే సమయంలో వారి కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఈ సంఘటనలో ప్రమేయం ఉన్నవారిపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా వైయ‌స్ఆర్‌సీపీ అడ్డుపడదు. కానీ ఆ తదుపరి గడ్డి వాములు తగలపెట్టడం, ఇళ్ళు ధ్వంసం చేశారు, వాహనాలు తగలపెట్టారు, సంఘటనకు సంబంధం లేని అమాయకులను కేసులో పెట్టారు. 80 రోజుల పాటు అక్రమంగా జైల్లో పెట్టారు. వయసు మళ్ళిన పండు ముసలివారిని కూడా జైల్లో పెట్టారు. గతంలో 2014-19 మధ్య టీడీపీ హయాంలో పత్తికొండలో నారాయణ రెడ్డిని అతి దారుణంగా చంపారు. నాడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారు. మరి ఆ తర్వాత 2019-24 మధ్య ప‌త్తికొండ ఎమ్మెల్యేగా శ్రీదేవమ్మ ఉన్నారు. ఆ సమయంలో ఏ ఒక్క సంఘటన అయినా జరిగిందా, ఎక్కడైనా హింసాత్మక చర్యలు జరిగాయా, స్ధానికంగా ఏ ఎన్నికలు జరిగినా వైయ‌స్ఆర్‌సీపీ హవా కొనసాగుతుందనే అక్కసుతో మాదిగపల్లిలో ఆడవారిని చెరబట్టే ప్రయత్నం చేశారు. ఎస్సీలు వైయ‌స్ఆర్‌సీపీ వైపు ఉండద్దా అని సుధాక‌ర్‌బాబు ప్ర‌శ్నించారు.

రాయలసీమను నాడు వైయ‌స్ఆర్ , తర్వాత వైయ‌స్‌ జగన్ గారు సస్యశ్యామలం చేశారు, కానీ టీడీపీ హయాంలో రాయలసీమలో నెత్తుటేళ్ళు పారిస్తున్నారు, రాజ్యాంగంలో దళితులను గ్రామ బహిష్కరణ చేసే హక్కు ఉందా, పోలీసులు ఎందుకు రక్షణ కల్పించడం లేదు, 8 నెలలుగా వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేశారు. వందల ఎకరాల భూమి బీడుగా మారింది, ఎందుకీ వివక్ష, ఏమిటీ దారుణం, చట్టాలు వర్తించవా అని నిల‌దీశారు. 

మేం ఎస్‌పీని కలిసి చర్చించాం, ఆయన సానుకూలంగా స్పందించారు, ఆయన విడతల వారీగా అందరినీ గ్రామంలోకి తీసుకుంటామన్నారు, వచ్చే శుక్రవారం వరకు ఆశతో ఎదురుచూస్తాం, ఆ రోజు కనుక మా వారిని గ్రామంలోకి తీసుకోకపోతే వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ వారి తరుపున పోరాడుతుంది అని సుధాకర్‌ బాబు చెప్పారు.

Back to Top