ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో దురహంకార తత్వం

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ధ్వజం

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌పై విషం చిమ్ముతున్నారు

గ్రామీణ విద్యార్ధులు ఆంగ్లభాషలో నిష్ణాతులవడాన్ని ఓర్వలేకపోతున్నారు

వైయ‌స్ఆర్‌సీపీ  ప్రభుత్వం తెచ్చిన జీఓ:85 రద్దు కోరడం దుర్మార్గం

ఇంగ్లిష్‌ మీడియమ్‌ వద్దనే వారి పిల్లలు, వారసులు ఏ మీడియంలో చదువుతున్నారు?

రామోజీరావుకు చెందిన రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ తొలగించగలరా?

చంద్రబాబు కుమారుడు, మనవడు తెలుగులో ఒక పేరా రాయగలరా?

సూటిగా ప్రశ్నించిన జూపూడి ప్రభాకర్‌రావు

ఇంగ్లిష్‌ చదువులతో మీ పిల్లలు ప్రపంచస్థాయి అవకాశాలు అందుకోవాలి!

గ్రామీణ విద్యార్ధులు మాత్రం తెలుగు మీడియంలోనే చదువుకోవాలా?

ఇదెక్కడి న్యాయం? 

మీ స్కూళ్లలో తెలుగు మీడియం ప్రారంభించాకే ఆ భాషపై మాట్లాడండి

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన జూపూడి ప్రభాకర్‌రావు

హైదరాబాద్‌:     ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమ అమలుపై ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు మేథావులు చేసిన వ్యతిరేక వ్యాఖ్యలు వారి అహంకార మనస్తత్వాన్ని చాటుతున్నాయని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు ఆక్షేపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్ధులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందుకోవాలంటే ఆంగ్లంలో నిష్ణాతులు కావాలని, గత సీఎం  వైయస్‌ జగన్ ముందుచూపుతో ఆ నిర్ణయాన్ని అమలు చేశారని ఆయన వెల్లడించారు. అయితే దురహంకారంతో వ్యవహరిస్తున్న కొందరు మేధావులు ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదిక సాక్షిగా, గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధనపై వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు బట్టడం ఏ మాత్రం సరికాదని జూపూడి తేల్చి చెప్పారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సోమ‌వారం వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మీడియాతో మాట్లాడారు. 

ఆ లక్ష్యంతోనే ఇంగ్లిష్‌ మీడియమ్‌:
    గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో సీఎం  వైయస్‌ జగన్, విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పలు సంస్కరణలు అమలు చేశారు. అందులో భాగంగా, గవర్నమెంట్‌ స్కూళ్లలో ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టారు. తద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఆంగ్లంలో ప్రావీణ్యత సాధించి, ప్రపంచ స్థాయిలో అవకాశాలు అందుకోవడం ద్వారా తమ జీవితాలను మెరుగు పర్చుకోవాలని జగన్‌గారు ఆశించారు. ఆ మేరకు జీఓ:85 జారీ చేశారు. అయినా అందులో ఇంగ్లిష్‌ మీడియమ్‌ తప్పనిసరి అని పేర్కొనలేదు. ఆసక్తి ఉన్న విద్యార్ధులు మాత్రమే ఇంగ్లిష్‌ మీడియమ్‌ చదివేలా నిర్దేశించారు. 
    
అలాగే పాఠ్యపుస్తకాలను కూడా బైలింగ్వువల్‌లో.. అంటే ఒకపేజీలో ఇంగ్లిష్, పక్క పేజీలో తెలుగుతో ముద్రించి పంపిణీ చేశారు. అలా రెండు మాధ్యమాల్లో సిలబస్‌ ఉండేలా చూశారు. ఇంగ్లిష్‌ బోధించే టీచర్లకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. నాడు వైయ‌స్ జగన్‌గారు తీసుకున్న ఈ నిర్ణయం.. రాష్ట్రంలో తమ బిడ్డలను కార్పొరేట్‌ స్కూళ్ళలో ఇంగ్లిష్‌ మీడియంలో చదివించుకోవాలనుకుని, ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ బడుల్లో తెలుగు మీడియంలో చదివిస్తున్న ఎందరో తల్లిదండ్రుల కలలను సాకారం చేసింది. 

అడుగుడుగునా అడ్డుకున్న దురహంకారులు:
    గ్రామీణ ప్రాంత విద్యార్థులు కూడా ఇంగ్లిష్‌ మీడియమ్‌లో చదువుకుని, తమ పిల్లలతో సమానంగా ఎదుతారన్న విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు, ప్రభుత్వ నిర్ణయంపై కోర్టుకెక్కారు. దీంతో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 18 లక్షల మంది తల్లిదండ్రులను దీనిపై అభిప్రాయాలు కోరితే, 90 శాతం మంది తమ పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియం కావాలని కోరుకున్నారు. అది అప్పుడు వైయ‌స్ జగన్‌గారు తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రుల మద్దతును నేరుగా చూపింది.

కూటమి ప్రభుత్వ కుటిలత్వం:
    గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియమ్‌పై తొలి నుంచి విషం చిమ్ముతున్న కూటమి పార్టీలు, అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో విద్యా వ్యాపారం చేస్తున్న కార్పొరేట్‌ స్కూళ్లకు మేలు చేసే విధంగా, గ్రామీణ విద్యార్ధులకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ దూరం చేసే కుట్రకు నాంది పలికాయి. ఆ ప్రక్రియలో భాగంగా ముందుగా సీబీఎస్‌ఈ సిలబస్‌ తొలగించారు. టోఫెల్‌ శిక్షణ రద్దు చేశారు. గ్రామీణ విద్యార్థులు కేవలం తెలుగు మీడియమ్‌కే పరిమితమయ్యేలా చర్యలు మొదలుపెట్టారు.
    తాజాగా, విజయవాడలో జరిగిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో తెలుగుదేశంకు చెందిన కొందరు మేధావులు ఇంగ్లిష్‌ మీడియమ్‌పై విషం చిమ్మారు. తెలుగు భాషను జగన్‌గారు చంపేస్తున్నారంటూ మొసలి కన్నీరు కార్చారు. 
ఆ మేధావులను సూటిగా ప్రశ్నిస్తున్నాం..
    ఆనాడు తెలుగును ఉద్ధరించిన నన్నయ్య, తిక్కన వంటి వారు మరణించారు. మరి తెలుగుభాష వారితోనే మరణించిందా? అసలు మాతృభాషకు మరణం ఉంటుందా? దాన్ని ఎవరైనా నిర్మూలించగలరా?.
    ఇవన్నీ తెలిసి కూడా ఆ మేధావులు గ్రామీణ విద్యార్ధులకు ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధించడంపై ఎందుకు రగిలి పోయారు? అంటే వారి నిజమైన బాధ.. గ్రామీణ విద్యార్థులు తమ పిల్లలతో సమానంగా అవకాశాలు అందుకోకూడదు. వారికి ఆంగ్లభాషపై పట్టు ఉండకూడదు. వారు ఎప్పటికీ తమకు సేవ చేసే వర్గంగానే మిగిలిపోవాలనేది ఆ మేధావుల అసలు ఉద్దేశం.

అదే వారి అసలు లక్ష్యం:
    తెలుగుపై అమితమైన అభిమానం కనబర్చిన వారి వారసులు ఏ మాధ్యంలో చదువుతున్నారో చెప్పాలి. అంతెందుకు రామోజీరావుకు చెందిన రమాదేవి పబ్లిక్‌ స్కూల్‌ లో తెలుగు మాధ్యంలోనే బోధన జరుగుతోందా? ఆంగ్ల మా«థ్యాన్ని తొలగిస్తామని వారు చెప్పగలరా?.
    సీఎం చంద్రబాబు సైతం ఆంగ్లభాషలో నైపుణ్యం లేక బట్లర్‌ ఇంగ్లిష్‌ మాట్లాడుతున్నారు. కానీ ఆయన కుమారుడు, మనవడు మాత్రం ఆంగ్లంలో చక్కగా మాట్లాడగలరు. మరి వారు తెలుగులో కనీసం ఒక పేరా అయినా రాయగలరా? తెలుగు గురించి మాట్లాడిన తెలుగుదేశం మేధావులు, రచయితల అసలు లక్ష్యం గ్రామీణ విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడకూడదు. వారి జీవితాల్లో ఎప్పటవికీ వెలుగులు రాకూడదు.  

ఆ సంస్కర్తలు ఆ అవసరాన్ని చెప్పారు:
    మేం దళితులం. మా చిన్నతనంలో తెలుగు మీడియమ్‌లో చదువుకుని, ఉస్మానియా యూనివర్సిటీలో చేరినప్పుడు అక్కడ ఇంగ్లిష్‌లో బోధనను అర్థం చేసుకునేందుకు ఎంతో ఇబ్బంది పడ్డాం. అటువంటి పరిస్థితి ఏర్పడకుండా, గ్రామీణ పిల్లలకు చిన్నతనం నుంచే ఇంగ్లిష్‌ మీడియమ్‌లో బోధించాలని వైయ‌స్ జగన్‌గారు చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. 
    నిజానికి ఆంగ్లభాష ప్రాధాన్యతను ఆనాడు బీఆర్‌ అంబేడ్కర్, పెరియార్‌ వంటి సంఘ సంస్కర్తలు చాలా స్పష్టంగా చెప్పారు. ఆంగ్లంతోనే గొప్ప అవకాశాలను అందుకుంటారని వారు ఆనాడే వెల్లడించారు. నేడు ప్రపంచ దేశాల్లో మన దేశం కూడా దూసుకుపోతోంది అంటే దానికి కారణం ఎక్కువ భాషలను నేర్చుకోవడమే. అంతమాత్రాన మాతృభాషను చంపేస్తున్నారని విమర్శలు చేయడం దుర్మార్గం.

మీకు నిజంగా తెలుగుపై ప్రేమ ఉంటే?:
    కుట్రతో గ్రామీణ విద్యార్థులకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ను దూరం చేస్తారా? మీకు నిజంగా తెలుగు భాషపై ప్రేమ ఉంటే, రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో ఇంగ్లిష్‌ మీడియమ్‌ను తొలగించాలి. అలా మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.
    అందుకే దురహంకార వైఖరితో గ్రామీణ విద్యార్ధులకు అన్యాయం చేసేలా తెలుగుదేశం మేధావులు, రచయితలు చేసిన విమర్శలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గ్రామీణ విద్యార్థులకు కూడా ఇంగ్లిష్‌లో బోధన కొనసాగేలా వైయస్సార్‌సీపీ పోరాడుతుందని జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు.

Back to Top