మితిమీరిన టీడీపీ ఆగ‌డాలు

కర్నూలు జిల్లా కృష్ణగిరిలో వైయ‌స్ఆర్‌ విగ్రహం తల, చెయ్యి తొలగింపు

తిరుపతి జిల్లా గోవర్ధనగిరిలో సచివాలయం, ఆర్బీకే, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద శిలాఫలకాల ధ్వంసం

తూర్పు గోదావరి జిల్లా తెలికిచెర్లలో సచివాలయం, ఆర్బీకే, నవరత్న పథకాల శిలాఫలకాల తొలగింపు 

నెల్లూరు జిల్లా కొత్తపాళెంలో శిలాఫలకాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతల పేర్లపై పచ్చ రంగు

 అమ‌రావ‌తి: టీడీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలు మితిమీరిపో­యాయి. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు నుంచి వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. వైయ‌స్ఆర్‌ విగ్రహాలను, గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన శిలాఫలకాలను పనిగట్టుకుని పగులగొడుతు­న్నారు. శనివారం రాత్రి కర్నూలు జిల్లా కృష్ణగిరి­లోని బస్టాండ్‌లో ఉన్న వైయ‌స్ఆర్ విగ్రహంతోపాటు రైతు భరోసా కేంద్రం శిలాఫలకాన్ని కొందరు దుండగలు ధ్వంసం చేశారు. విగ్రహం తల, చెయ్యి తొలగించారు. ఆదివారం ఉదయం దీన్ని చూసిన స్థానికులు నాయకులకు సమాచారం ఇచ్చారు. 
ఈ విధ్వంసానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని ఎంపీపీ డాక్టర్‌ కంగాటి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు స్థానిక పోలీస్‌­స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నాయకులు కటారుకొండ మాధవరావు, శివ, వెంకటేశ్వర్లు, ఎరు­కల­చెర్వు ప్రహ్లాద, వెంకటరాముడు, అమక­తాడు బాలు, మాధవస్వామి, కృష్ణగిరి జయరామి­రెడ్డి, హుసేన్‌సాహెబ్, బాలమద్ది తదితరులు ఈ చర్యను ఖండించారు. తిరుపతి జిల్లా సత్యవేడు నియో­జకవర్గం పిచ్చాటూరు మండలంలోని గోవ­ర్ధన­గిరి గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ శిలాఫలకాన్ని శనివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వీటి ప్రారంభోత్సవ సమయంలో ఈ శిలాఫలకాలను ఏర్పాటు  చేశారు.

ఈ ఘట­నతో గ్రామంలో అలజడి రేగింది. టీడీపీ కార్య­కర్తలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారంటూ స్థానికులు ధ్వజమెత్తారు. దీనిపై గోవర్థనగిరి వైఎస్సార్‌సీపీ సచివాలయ కన్వీనర్‌ మునిశేఖర్‌ పిచ్చాటూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తూర్పు గోదా­వరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచెర్ల సచివా­లయం–1 పరిధిలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి నవరత్న పథకాలు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోతో ఉన్న శిలాఫలకాలను ధ్వంసం చేశారు. 26 రోజు­లుగా సాగుతున్న దాడులు, దాష్టీకాలు చూస్తూంటే మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక ఆటవిక పాలనలో ఉన్నామా అని సందేహం కలుగుతోందని గ్రామ సర్పంచ్‌ బండి చిట్టి, ఉప సర్పంచ్‌ నక్కా పండు ధ్వజమెత్తారు. ఈ ఘట­నలపై మానవ హక్కుల కమిషన్‌ తక్షణమే స్పందించి, తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

శిలాఫలకంపై పేర్లు తొలగింపు 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలం కొత్తపాళెంలో 2023లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో అంతర్గత రోడ్ల నిర్మాణం, నూతన విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, పంచాయతీ భవనం రీ మోడలింగ్‌ తది­తర పనులను వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం దాదాపు రూ.20 లక్షలతో చేపట్టింది. ఇందుకు సంబంధించిన శిలాఫలకంలో స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధు­లతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేల పేర్లను ప్రోటోకాల్‌ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు.

ఆదివారం గ్రామంలోని టీడీపీ నాయకులు ఈ శిలాఫలకంలో అప్పటి ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీలతో పాటు వారికి నచ్చని పేర్లను పచ్చ పెయింట్‌తో తుడి చేశారు. శిలాఫలకం దిమ్మె­లకు కూడా పచ్చ పెయింటింగ్‌ వేశారు. పంచా­యతీ భవనం గోడపై సీబీఎన్‌ అని రాశారు. గతంలో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్ర­శేఖర్‌రెడ్డి పేరు మాత్రం తొలగించలేదు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నారు. ఈ ఘటనపై వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

YS Rajasekhara Reddy statue restored in Addepally

అద్దేపల్లిలో వైయ‌స్ఆర్‌ విగ్రహం పునఃప్రతిష్ట 
 
బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైయ‌స్ఆర్‌సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్‌బాబును రేపల్లె తరలించారు.

 ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్‌ ఆదేశాల మేరకు అశోక్‌బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్‌బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైయ‌స్ఆర్‌ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడు­గంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Back to Top