దుశ్శాసనపర్వంపై హోం మంత్రి చర్యలేవి?

మహిళల దుస్తులు చించి బూతులు తిట్టిన టీడీపీ మూకలపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు  

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి  

 అనకాపల్లి: హోం మంత్రి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలోని కోటవురట్లలో చేనేత కారి్మకులైన ఇద్దరు మహిళలపై టీడీపీ మూకలు దాడిచేస్తే వారిపై చర్యల్లేవని.. దీనిపై అనిత సమాధానం చెప్పాలని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్‌ చేశారు. ఆమె సోమవారం కోటవురట్లలో మీడియాతో మాట్లాడారు. దాడి చేసిందే కాకుండా వారిపై కేసులు కూడా నమోదు చేశారంటే ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉందో అర్థమవుతోందన్నారు.

హోం మంత్రిగా అనిత బాధ్యతలు తీసుకున్న వెంటనే కోటవురట్ల మండలంలో ఇద్దరు మహిళల మీద  తెలుగుదేశం కార్యకర్తలు దారుణంగా దాడిచేయడమే కాకుండా వాళ్ల బట్టలు చించి బండబూతులు తిట్టారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు.. మహిళలపై ఎవరైనా చేయివేస్తే వారి తాటతీస్తామని ప్రగల్భాలు పలికిన హోం మంత్రికి ఈ దాడి కనిపించలేదా? అని ప్రశ్నించారు.

మీది మాటల ప్రభుత్వమేనా.. చేతల ప్రభుత్వం కాదా? అని నిలదీశారు. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేసిన పరిస్థితులు చూశామని, మళ్లీ అదే దుశ్శాసన ప్రభుత్వం వచ్చిందని మహిళలంతా భయాందోళనలకు గురవుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పాలనపై, మహిళల రక్షణపై దృష్టి సారించాలని.. వైయ‌స్ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాలను ఎలా కూల్చేయాలి? వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలపై ఎలా దాడిచేయాలనే ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు.  

బాలికపై లైంగిక దాడి కేసులో అలసత్వం 
 విశాఖ మధురవాడలో ఐదేళ్ల బాలికపై లైంగికదాడి జరిగితే ఆ కేసును నీరుగార్చే విధంగా విచారణ చాలా నెమ్మదిగా సాగుతోందనివైయ‌స్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి అన్నారు. ఆమె విశాఖపట్నంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఇటువంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే చర్యలు వేగంగా తీసుకోవాలని సూచించారు. బాధితులకు ప్రభుత్వం ఆరి్థక సహాయాన్ని తక్షణమే అందించాలని ఆమె డిమాండ్‌ చేశారు. 

Back to Top