రైతు నష్టాల బాట‌..వైయ‌స్ఆర్‌సీపీ పోరుబాట‌

రేపు వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ల వద్ద అన్నదాతల ఆందోళన

ఆరు నెలలుగా ఆదుకునే దిక్కు లేదు 

పైసా పెట్టుబడి సాయం రాలేదు.. రబీ కరువు సాయం ఊసే పట్టదు

సున్నా వడ్డీ రాయితీ జాడ లేదు.. పంటల బీమా పరిహారం దక్కలేదు

మద్దతు ధర కల్పనలో సర్కారు విఫలం

75 కేజీల బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు నష్టం

దళారీల చేతిలో రైతులు గుల్ల.. అటకెక్కిన ఉచిత పంటల బీమా పథకం

మద్దతు ధరకు ధాన్యం కొనేవారు లేక ఆవేదన

గ్రామ స్థాయిలో తోడుగా నిలిచిన ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం

గత ఆరు నెలల్లో 70 మంది రైతుల ఆత్మహత్యలు

అమరావతి: అన్నదాత కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పడరాని పాట్లు పడుతున్నారు. ఏటా సీజన్‌కు ముందే  అందే పెట్టుబడి సాయం లేదు. ఉచిత పంటల బీమా అటకెక్కింది. పంటల బీమా పరిహారం జాడలేదు. కరువు సాయం ఊసే లేదు. సున్నా వడ్డీ రాయితీ లేదు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందడం లేదు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలకు  ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కనీస మద్దతు ధర దక్కక రైతులు ఆత్మహత్యలకు ఒడిగట్టే దుస్థితి నెలకొంది. 

ప్రభుత్వ తీరుపై అన్నదాతలు కన్నెర్ర చేస్తున్నారు. ఓవైపు విత్తనాలు, ఎరువుల కోసం ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు పండించిన పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆందోళన బాటపట్టారు. ఇటీవలే  ధాన్యం రాశులతో మండల కేంద్రాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు డిమాండ్‌తో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. 

ఈ నేపథ్యంలో ఆర్నెల్ల కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు అండగా వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన బాటపట్టింది. ఈ నెల 13వ తేదీన జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట వైయ‌స్ఆర్‌సీపీ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన వ్యక్తం చేసేందుకు రైతులు సన్నద్దమవుతున్నారు. 

అన్నదాతా.. ఎక్కడ సుఖీభవ? 
అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందిస్తామంటూ సూపర్‌ సిక్స్‌లో ఇచి్చన హామీని చంద్రబాబు అటకెక్కించేశారు. గత  ఐదేళ్లుగా వైయ‌స్ఆర్  రైతు భరోసా కింద లబ్ధి పొందిన 53.58 లక్షల మంది రైతులకు  రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలంటే ఏటా రూ.10,718 కోట్లు అవసరం. కానీ బడ్జెట్‌లో కేవలం రూ.వెయ్యి కోట్లు మాత్రమే విదిలించి చేతులు దులిపేసుకున్నారు. 

ఇప్పటికే ఖరీఫ్‌ సీజన్‌ ముగిసింది. రబీ సీజన్‌ ప్రారంభమై 40 రోజులు దాటింది. కేంద్రం రెండు విడతల్లో పీఎం కిసాన్‌ సాయం అందించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక్క విడత కూడా పెట్టుబడి సాయాన్ని జమ చేసిన పాపాన పోలేదు. అన్నదాత సుఖీభవ కోసం విధివిధానాల రూపకల్పన కూడా జరగలేదు. పెట్టుబడిసాయం అందక, సకాలంలో రుణాలు దొరక్క గత రెండు సీజన్లలో రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. 

పంటల బీమాకు దూరం 
రైతులపై పైసాభారం పడకుండా ఐదేళ్ల పాటు నోటిఫై పంటలకు యూనివర్శల్‌ కవరేజ్‌ కల్పిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని కూటమి ప్రభుత్వం అటకెక్కించేసింది.  2023–24 సీజన్‌కు సంబంధించి రైతులతో సహా రాష్ట్ర ప్రభుత్వ వాటా కలిపి రూ.930 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జమ చేయకపోవడం వల్ల ఆ సీజన్‌లో కరువు వల్ల పంటలు దెబ్బతిన్న దాదాపు 15 లక్షల మంది రైతులకు రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందకుండా పోయింది. 

రబీ సీజన్‌ నుంచి స్వచ్ఛంద నమోదు పద్ధతిలో పంటల బీమా అమలు చేస్తుండడంతో ప్రీమియం భరించలేక రైతులు పంటల బీమాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. రబీలో ఇప్పటి వరకు 16.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగైతే బీమా కవరేజ్‌ పొందిన విస్తీర్ణం కేవలం 65 వేల ఎకరాలు మాత్రమే. ప్రీమియం భారం రైతుల నెత్తిన వేయడంతో ఈ సీజన్‌లో రూ.350 కోట్లకుపైగా భారం భరించలేక  పంటల బీమాకు దూరమవుతున్నారు. 

కరువు సాయం అందక అగచాట్లు 
వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌–2023 సీజన్‌లో పంటలు నష్టపోయిన 8.89 లక్షల మంది రైతులకు రూ.1,126.31 కోట్లు జమ చేశారు. సాంకేతిక కారణాల వల్ల 1.54 లక్షల మందికి రూ.163.12 కోట్లు జమ కాలేదు. రబీ–2023–24 సీజన్‌లో కరువు ప్రభావం వల్ల 2.52 లక్షల హెక్టార్లలో దెబ్బతిన్న పంటలకు గాను 2.32 లక్షల మంది రైతులకు రూ.164.05 కోట్ల కరువు సాయం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు బకాయిలు కలిపి 3.91 లక్షల మంది రైతులకు  రూ.327.71 కోట్ల కరువు సాయం ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతోంది.

ఇక ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో కురిసిన వర్షాల వల్ల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తొలుత 16 జిల్లాల్లో 1.65 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా, చివరికి నాలుగు  జిల్లాల్లో 54 వేల ఎకరాలకు పరిమితం చేశారు. 29,944 మంది రైతులకు రూ.37.33 కోట్లు పరిహారం చెల్లించాలని లెక్కతేల్చగా ఆచరణకు వచ్చేసరికి  కేవలం 23వేల మందికి రూ.25.75 కోట్లకు కుదించేశారు. ఆ పరిహారం నేటికీ జమ చేయలేదు. 

సెప్టెంబర్ లో కురిసిన భారీవర్షాలు, వరదలకు తొలుత 6 లక్షల ఎకరాల్లో పంటలతో పాటు పెద్ద ఎత్తున పాడి రైతులకు జరిగిన నష్టానికి సంబంధించి రూ.557 కోట్ల పరిహారం ఇవ్వాలని అంచనా వేయగా చివరికి  2.15 లక్షల మందికి రూ.319.59 కోట్లకు కుదించేశారు. సాంకేతిక కారణాలతో లక్షలాది మందికి నేటికీ పరిహారం అందక పడరాని పాట్లు పడుతున్నారు. 

మరొక పక్క వర్షాభావ పరిస్థితుల వల్ల కరువుతో అల్లాడుతున్న రాయలసీమ జిల్లాల్లో కంటి తుడుపుగా కరువు మండలాల ప్రకటన చేసిన ప్రభుత్వం ఆయా జిల్లాల రైతులను ఆదుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. 

కలసిరాని సాగు.. ఆదుకోని ప్రభుత్వం 
ప్రభుత్వ నిర్వాకానికి తోడు వైపరీత్యాల ప్రభావంతో ఖరీఫ్‌తో పాటు రబీ సాగు కూడా రైతులకు కలిసిరా­వడం లేదు. పెట్టుబడుల కోసం పడరాని పాట్లు పడ్డారు. రూ.3–5 వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సాగు చేసినా వైపరీత్యాల ప్రభావంతో పంటలు దెబ్బతినడంతో పాటు ఆశించిన దిగుబడులు రాక లక్షలాది మంది రైతులు నష్టాలపాలయ్యారు. చేతికొచ్చిన పంటలు అమ్ముకునే సమయంలో మార్కెట్‌లో ధరలేక ధాన్యం రైతులతో పాటు పత్తి తదితర పంటల రైతులకు పెట్టుబడి కూడా దక్కని పరిస్థితి నెలకొంది. 

ఓ వైపు ముమ్మరంగా కోతలు జరుగుతున్న దశలో విరుచుకు పడిన ఫెంగల్‌ తుపాన్‌ ప్రభావంతో చేతికొచ్చిన పంట దెబ్బతిని మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం చేతులెత్తేయడంతో తమ రెక్కల కష్టార్జితాన్ని దళారీల పాల్జేయాల్సిన దుస్థితి రైతులకు దాపురించింది.

తేమ శాతం సాకుతో దోపిడీ..
కేంద్ర ప్రభుత్వం ధాన్యం సాధారణ రకానికి క్వింటా రూ.2300, ఏ–గ్రేడ్‌కు రూ.2320గా మద్దతు ధర ప్రకటించింది. అంటే 75 కేజీల బస్తాకు సాధారణ రకానికి రూ.1725, ఏ–గ్రేడ్‌కు రూ.1740 గిట్టుబాటు ధర చెల్లించాలి. కానీ కూటమి ప్రభుత్వ పాలనలో 75 కేజీల బస్తాకు రూ.400 నుంచి రూ.500 వరకు రైతు నష్టపోతున్నారు. 

రైతు సేవా కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యాన్ని తేమ శాతాన్ని బట్టి ధర నిర్ణయించాల్సిన అధికారులు మిల్లర్లు చెప్పిన ధరకు అమ్ముకోమంటూ సల­హాలిస్తున్నారు. మరోవైపు మార్కెట్‌లో మద్దతు ధరకు మించి రేటు పలికే ఎంటీయూ 1262, ఎంటీయూ 1318, బీపీటీ 5204 వంటి ఫైన్‌ వెరైటీస్‌కు కూడా ఈసారి మద్ద­తు ధర కూడా దక్కడం కష్టంగా ఉంది. 75 కేజీల బస్తా రూ.1300–1500 మధ్య కొనే పరిస్థితి నెలకొంది. 

కోసిన ధాన్యా­న్ని కొనే నాధుడు లేక రైతులు గగ్గోలు పెడుతున్నారు. గోనె సంచుల కొరత తీవ్రంగా ఉంది. ఆరబోతకు కూలీల కొరత వేధిస్తోంది. కూలీల ఖర్చులు, పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్స్‌కు ఎకరాకు రూ.వెయ్యి వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఆందోళన కలిగిస్తున్న రైతు ఆత్మహత్యలు 
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్న రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కేవలం ఆర్నెల్ల వ్యవధిలోనే సుమారు 70 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు ఒడిగట్టడం రాష్ట్రంలో రైతుల దయనీయ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. 

అత్యధిక­ంగా ఒక్క కర్నూలు జిల్లాలోనే 30 మందికి పైగా బలవన్మరణం చెందారు. రాయలసీమ జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, గోదావరి జిల్లాల్లో కూడా రైతు ఆత్మహత్యలకు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు కుటుంబానికీ కూటమి సర్కా­రు పరిహారం ఇచ్చిన దాఖలాలు లేవు.

వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే..
అదే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఉండి ఉంటే.. జూన్‌లో అన్నదాతకు తొలి విడత వైయ‌స్ఆర్‌ రైతు భరోసా సాయం అందేది. గడిచిన సీజన్‌ మాదిరిగానే ఈ ఏడాది కూడా 53.58 లక్షల మందికి మేలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4,000 చొప్పున పెట్టుబడి సాయాన్ని జమ చేసేవారు. 

ఖరీఫ్‌–2023 సీజన్‌కు సంబంధించి రూ.1,385 కోట్ల బీమా పరిహారం అందేది. కరువు సాయం బకాయిలు రూ.327.71 కోట్ల కూడా జమ చేసేవారు. సున్నా వడ్డీ రాయితీ కింద సుమారు రూ.130 కోట్ల వరకు జమయ్యేది. ఖరీఫ్‌ సీజన్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రతీ రైతుకు పూర్తి స్థాయిలో పరిహారం జమయ్యేది.

Back to Top