గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ను కూటమి సర్కార్.. అరాచకప్రదేశ్‌గా మార్చేసింది. వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే టార్గెట్‌గా అడ్డూ, అదుపు లేకుండా అక్రమ కేసులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అక్రమ కేసుల పర్వం వంద దాటగా, ఏడేళ్ల క్రితం పోస్టు పెట్టావంటూ ఇప్పుడు కూడా కేసులు నమోదు చేస్తున్నారు. అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా అరెస్టుల పరంపర కొనసాగుతోంది. బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ ఆదేశాలతో అత్యవసరంగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను వైయస్ఆర్సీపీ ఏర్పాటు చేసింది. అడ్వొకేట్ల బృందం 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న పోలీసులపై ప్రైవేట్ కేసులకు వైయస్ఆర్సీపీ రంగం సిద్ధం చేసింది. కాగా, వైయస్ఆర్ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిన్నటి నుంచి ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా పోలీసులు తెలుపలేదు. ఉదయం రవీంద్రారెడ్డి భార్య కల్యాణి, సోదరుడు మల్లికార్జున రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని తొలుత వేముల పోలీస్ స్టేషన్‌కి తరలించగా, అనంతరం చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఎస్పీ మాట్లాడాలి.. తీసుకురమ్మని చెప్తే తెచ్చామంటూ పోలీసులు చెబుతున్నారు. అయితే, ఉదయం నుంచి ఎస్పీ వద్దకు కూడా వారిని తీసుకెళ్లలేదు. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల పోలీసుల ఓవరాక్షన్ వైయస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు ఆగడం లేదు. ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్ల పోలీసులు ఓవరాక్షన్ చేశారు. పెండ్యాల గ్రామం వాట్సాప్ గ్రూప్‌లోని 170 మందికి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారని గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వాట్సాప్ గ్రూపులోని సభ్యులను ప్రతి రోజూ పోలీసు స్టేషన్‌కు పిలిపించి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. దీంతో బుధవారం వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి బాధితులు వచ్చారు. బాధితులకు వైయస్ఆర్సీపీ లీగల్ సెల్ అండగా నిలిచింది. ప్రతి కార్యకర్తను కాపాడుకుంటాం కూటమి సర్కార్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అన్నారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, ప్రతి కార్యకర్తనూ కాపాడుకుంటామని ఆయన భరోసా కల్పించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేశామని, అక్రమంగా అరెస్టు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. పూర్తి న్యాయ సాయం పార్టీనే ఇస్తుందని పొన్నవోలు సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై తీవ్ర చర్యలు తీసుకునేలా పార్టీ చూసుకుంటుందన్నారు. చట్టవ్యతిరేకంగా పని చేస్తున్న ఏ పోలీసునూ వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. కక్షసాధింపు చర్యలు పీక్ స్టేజ్ ఏపీలో అరాచక పాలన కొనసాగుతోంది. కూటమి పాలనలో కక్షసాధింపు చర్యలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే నెపంలో వర్రా రవీంద్రారెడ్డి అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడిని ఏ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారనే వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఈరోజు తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంటిలో డీఎస్పీ సోదాలు నిర్వహించడంతో ఆయన కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. వివరాల ప్రకారం.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడనే నెపంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన వర్రా రవీంద్రారెడ్డిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి నుంచి పోలీసు వాహనంలో అతడి వేరే చోటకు తరలించారు. అయితే, నిన్న రాత్రి రవీంద్రారెడ్డిని ఎక్కడ ఉంచారనే విషయాన్ని మాత్రం పోలీసులు వెల్లడించలేదు. ఇక, రవీంద్రారెడ్డిని పోలీసులు తీసుకెళ్లిన వెంటనే గుర్తు తెలియని ఓ ముఠా రంగంలోకి దిగింది. రవీంద్రారెడ్డి గురించి ప్రశ్నిస్తున్న వారిపై సదరు ముఠా దాడులు చేస్తోంది. పోలీసులు అక్రమంగా రవీంద్రారెడ్డి తీసుకెళ్లడంతో అతడికి జామీను ఇచ్చేందుకు వేముల మండలం పెండ్లూరు సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి పోలీసులు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో పీఎస్ వద్ద గుర్తు తెలియని ముఠా.. మహేశ్వర్ రెడ్డిపై దాడి చేసింది. ఆయనపై చేయి చేసుకున్నారు. రాత్రి నుంచి మహేశ్వర్ రెడ్డి ఆచూకీ కూడా తెలియడం లేదు. అయితే, వారు పోలీసులా? లేక ప్రైవేటు వ్యక్తులా? అనేది అర్థం కాకుండా ఉంది. ఇక, మంగళవారం రాత్రి నుంచి రవీంద్రారెడ్డిని ఏ పోలీసు స్టేషన్‌కు తరలించారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇదేంటని ప్రశ్నించిన వారిపై దాడులు జరుగుతున్నాయి. కాగా, సోషల్ మీడియా పోస్టుల్లో 41ఏ నోటీసు ఇచ్చి వదిలేయాలని నిబంధన ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం నోటీసులను ఖాతరు చేయడం లేదు. మరోవైపు.. బుధవారం తెల్లవారుజామున రవీంద్రారెడ్డి ఇంటిలో డీఎస్పీ సోదాలు నిర్వహించారు. దీంతో, రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. రవీంద్రారెడ్డి, సర్పంచ్ మహేశ్వరరెడ్డి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.