చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం ఎల్లోమీడియా తప్పుడు రాతలు

సీఎంగా వైయ‌స్‌ జగన్ గారి సెక్యూరిటీపై పచ్చి అబద్దాలు

చంద్రబాబుది ఎంతో ఉదారత అంటూ ఎల్లోమీడియా భజన

వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం

ఆనాడు వైయ‌స్ జగన్ గారి సెక్యూరిటీ సిబ్బంది సంఖ్య 196 మాత్రమే

నేడు చంద్రబాబు సెక్యూరిటీకి 2 వేల మంది మోహరింపు

ప‌చ్చకళ్ళతో చూస్తున్న ఎల్లో మీడియాకు వాస్తవాలు కనిపించడం లేదు

రాజకీయంగా బుదరచల్లడమే చంద్రబాబు పని

అందుకు వంతపాడుతూ స్వామిభక్తి చాటుకుంటున్న ఎల్లో మీడియా

వైయస్ఆర్ సిపిపై విషం చిమ్మడం, చంద్రబాబును కీర్తించడం ఎల్లోమీడియాకు అలవాటు

ఎన్నికల హామీల అమలుపై ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ అసత్య కథనాలు

ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి 

తాడేపల్లి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలకడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎల్లో మీడియా మరోసారి చంద్రబాబు కళ్ళలో ఆనందం కోసం  వైయస్ జగన్ పై విషం చిమ్ముతూ ఈ రోజు ఓ అబద్దపు కథనాన్ని వండి వార్చిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో సోమ‌వారం ఆయ‌న మీడియాతో  మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రాపకం కోసం ఎల్లో మీడియా రోజూ ఏదో ఒక అబద్దపు కధనాన్ని  తమ పత్రికల్లో  వండి వార్చడం పరిపాటిగా మారిందని అన్నారు. దానిలో భాగంగానే తాజాగా, పచ్చి అబద్ధాన్ని వల్లె వేస్తూ… వైయ‌స్ జగన్ గారి భద్రతకు ఏటా రూ.90 కోట్లు ఖర్చు చేసినట్లు ఈరోజు ఈనాడు విష కథనాన్ని ప్రచురించిందని ధ్వజమెత్తారు.   

చంద్రబాబు కుట్రలకు వంతపాడుతున్న ఎల్లో మీడియా

వైయ‌స్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన కోసం ఏకంగా 980 మంది భద్రతా సిబ్బంది పని చేశారని, అందుకోసం ప్రభుత్వం ఏటా రూ.90 కోట్లు ఖర్చు చేసిందని ఎటువంటి ఆధారాలు లేని ఒక తప్పుడు కథనాన్ని నిస్సిగ్గుగా ఈనాడు ప్రచురించింది.  చంద్రబాబు చాలా సచ్చీలురని, ఆయన ప్రజా ధనంపై ఎంతో బాధ్యతగా ఉంటారని కితాబు ఇస్తూ, భజన చేస్తూ, తన కథనం ద్వారా  స్వామి భక్తిని చాటుకుంది. అందుకోసం వాస్తవాలన్నీ కనుమరుగు చేస్తూ.. చంద్రబాబు ఇప్పుడు కేవలం 121 మంది భద్రతా సిబ్బంది చాలని అధికారులకు ఉపదేశం చేసినట్లు.. బిల్డప్ ఇస్తూ, ఈనాడు తన కథనంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తేసింది.  

980 మంది సెక్యూరిటీ సిబ్బంది అనేది పచ్చి అబద్దం

 వైయ‌స్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు 980 మందితో భద్రత కల్పించారనేది పచ్చి అబద్ధం. వైయ‌స్ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు కేవలం 196 మంది భద్రతా సిబ్బంది మాత్రమే పని చేశారు. ఏ రాష్ట్రంలో అయినా సీఎంకు భద్రత కల్పించడం కోసం పోలీస్ యంత్రాంగంకు సంబంధించి ఒక కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. డీజీపి, ఇంటెలిజెన్స్ చీఫ్ తదితర ఉన్నతాధికారుతో కూడిన కమిటీ ఎంత మేర సెక్యూరిటీ కల్పించాలి, సీఎం కు ఉన్న థ్రెట్ ఎంత, సీఎం ఏ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు… ఇలా పలు అంశాలను సమీక్షించుకుని, దానికి అనుగుణంగానే సెక్యూరిటీని నియమిస్తారు. పద్నాలుగు ఏళ్లు సీఎంగా చేశానని, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఇది తెలియదా? అయినా కూడా వైయ‌స్ జగన్ గారిపై రోజూ ఏదో ఒక అబద్దపు రాతను తన ఎల్లో మీడియా ద్వారా రాయించాలనే  ముఖ్య‌మంత్రి కుట్రలో భాగంగానే ఈ రోజు ఈనాడు పత్రిక వైయ‌స్ జగన్ గారి సెక్యూరిటీపై అసత్యపు కథనాన్ని ప్రచురించింది.
 
980 మంది సిబ్బంది అంటూ ఆధారాలు లేని ఆరోపణలు

నాడు వైయ‌స్ జగన్ గారి దగ్గర ఎల్లవేళలా సివిల్ పోలీసులు.. సీఐ, ఎస్ఐ, పోలీస్ అందరూ కలిపి ఉండే భద్రత సిబ్బంది 18 మంది పని చేశారు. ఆర్మ్డ్ రిజర్వ్డ్ (ఏఆర్) సిబ్బంది 33 మంది.  ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ (ఏపీ ఎప్పీఎఫ్) నుంచి 89 మంది. సీఎంగారు బయటకు వెళ్లినప్పుడు భద్రత కల్పించడానికి ‘అక్టోపస్’నుంచి 13 మంది. సీఎంగారి ఇంటి వద్ద, ఇంటి చుట్టుపక్కల ఉన్న భద్రత సిబ్బంది 23 మంది. సీఎం కాన్వాయ్  డ్రైవర్లతో సహా భద్రతా సిబ్బంది 21 మంది. ఇలా అందరూ కలిపి మొత్తం 196 మంది సిబ్బంది వైయ‌స్‌ జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు భద్రతా విధులు నిర్వర్తించారు. 

విఐపి సెక్యూరిటీని ఎస్ఆర్‌సీ నిర్ణయిస్తుంది

రాష్ట్రంలో విఐపి సెక్యూరిటీని పోలీస్ ఉన్నతాధికారుల నేతృత్వంలో ఉండే ఎస్ఆర్‌సీ నిర్ణయిస్తుంది.  వైయ‌స్ జగన్ గారు  సీఎంగా ఉన్నప్పుడు, ఆయన మూమెంట్లో బందోబస్తు కల్పించడం సహజం. ఎవరికైనా అలా సెక్యూరిటీ ఇస్తారు. సీఎం స్థానంలో ఎవరు ఉన్నా సెక్యూరిటీ అనేది పోలీస్ యంత్రాంగంకు సంబంధించిన అంశంగానే చూస్తారు. ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ కు అలా సెక్యూరిటీ ఇస్తున్నారా? లేదా? చంద్రబాబు ఉండవల్లి నివాసం నుంచి సెక్రటేరియట్ వరకు, తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు దారి పొడవునా పోలీస్ సెక్యూరిటీ ఉంటారు. ఇవి సీఎం సెక్యూరిటీలో భాగం కాదా? సీఎంగా చంద్రబాబు ప్రయాణించే రెగ్యులర్ రూట్ లో ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు పెట్టి, సెక్యూరిటీ సిబ్బంది పర్యవేక్షిస్తుంటారు. ఇది సీఎం సెక్యూరిటీలో భాగం కాదా? ఎల్లో మీడియాకు మాత్రం ఇవి కనిపించవు. 

చంద్రబాబు కోసం అడుగడుగునా ట్రాఫిక్ నిలిపివేతలు

 చంద్రబాబు తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని చెప్పారని ఎల్లోమీడియాలో ఆయనను ఆకాశానికి ఎత్తారు. కానీ, దాన్ని చూపించగలరా? ఆయన కోసం ట్రాఫిక్ ఆపడం లేదా? రోడ్డు మీదికి వచ్చి చూస్తే ఎల్లోమీడియాకు తెలుస్తుంది. తన పచ్చ కళ్ళద్దాలను తీసి చూస్తే వాస్తవం తెలుస్తుంది. నారా లోకేష్, పవన్ కళ్యాణ్ సహా, చివరకు మంత్రులు వెళ్తున్నా సరే, ట్రాఫిక్ ఆపుతున్నారు. చంద్రబాబు చివరకు రాజమండ్రి  జైలులో ఉన్నా, తనకు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ కావాలని కోరారు. ఇదేనా ఈనాడు ప్రవచించిన బాబుగారి సింప్లిసిటీ?

2 వేల మందితో చంద్రబాబు సెక్యూరిటీ

 2014–19 మధ్య ఇదే అప్పటి సీఎం చంద్రబాబు భద్రత కోసం 1800 నుంచి 2 వేల మంది పోలీసులను వాడారు.  మదీనాగూడ ఫామ్ హౌజ్ వద్ద ఎంత మంది పని చేశారు. జూబిలీ హిల్స్ ఇంటి వద్ద ఎంత మంది పని చేశారు?  చివరకు పార్క్ హయత్ హోటల్లో ఉన్నప్పుడు ఎంత మంది భద్రత సిబ్బంది పని చేశారు?  చంద్రబాబు మనవడు దేవాన్ష్ కోసం కూడా 4 ప్లస్ 4 గన్మెన్ల రక్షణ కల్పించారు. చంద్రబాబు భార్యకు, ఆయన కొడుక్కి, కోడలుకు, చివరకు మనవడికి కూడా భద్రత కల్పించారు. ఇవేవీ ఈనాడు పత్రికకు కనిపించని అంశాలు. నిజానికి అప్పుడు నారా లోకేష్ మంత్రిగా కూడా లేకపోయినా, ఆయనకు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించారు. చంద్రబాబు కరకట్ట నివాసం, నారావారిపల్లెలో చంద్రబాబు నివాసం, కుప్పంలో చంద్రబాబు నివాసం, హైదరాబాద్ లో చంద్రబాబు నివాసం పోలీస్ సెక్యూరిటీ లేకుండానే ఉన్నాయా? వాటికి ఇరవై నాలుగు గంటలు ఎంతమంది సెక్యూరిటీ కింద పనిచేస్తున్నారో తెలియదా? ఇవ్వన్నీ లెక్కిస్తే దాదాపు రెండు వేల మందికి పైగా చంద్రబాబు సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నారు. 

హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే

రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చని ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్ళించేందుకు నిత్యం ఎల్లో మీడియా ద్వారా ఇలాంటి తప్పుడు కథనాలను రాయిస్తున్నారు. చిత్తశుద్ది ఉంటే ముందు చంద్రబాబు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను వెంటనే అమలు చేయాలి. ధాన్యం కొనేవారు లేక రైతులు అల్లాడుతున్నారు. ఫీజు రియాంబర్స్ మెంట్ ఇవ్వక విద్యార్ధులు ఇక్కట్లు పడుతున్నారు. వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంతో ప్రజల నడ్డి విరుగుతోంది. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు రోజూ ఎల్లో మీడియాతో రాజకీయంగా ప్రతి అంశాన్ని చిత్రీకరిస్తూ బుదరచల్లుతున్నారు. ఇటువంటి తప్పుడు కథనాలను వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంద‌ని ఎమ్మెల్సీ అప్పిరెడ్డి పేర్క‌న్నారు.

Back to Top