సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవోలపై ఎన్‌హెచ్చార్సీకి ఫిర్యాదు

వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర వెల్లడి

చంద్రబాబును పదవి నుంచి తప్పించాలని రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రిని కోరాం

తిరుపతి తొక్కిసలాట ఘటనకు చంద్రబాబే బాధ్యుడు

ఆయనకు పదవిలో కొనసాగే అర్హత ఏ మాత్రం లేదు 

చంద్రబాబు వల్ల ఇప్పటికే ఎందరో అమాయకులు బలి

ఇప్పటికైనా ఈ దారుణాలకు ఫుల్‌స్టాప్‌ పడాలి

వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర స్పష్టీకరణ

తాడేపల్లి: తిరుపతి తొక్కిసలాట ఘటనకు సీఎం చంద్రబాబే పూర్తి బాధ్యుడని, అందుకే ఆయనకు ఇంకా పదవిలో కొనసాగే అర్హత లేదని వైయస్ఆర్‌సీపీ నాయకుడు వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై సీఎంతో పాటు, టీటీడీ ఛైర్మన్, ఈఓపై జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు వైఖరి వల్ల గోదావరి పుష్కరాలు మొదలు, పలు సందర్భాల్లో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, అందుకే ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని రాష్ట్రపతితో పాటు, కేంద్ర హోం మంత్రిని లేఖ ద్వారా కోరామని తెలిపారు. శుక్ర‌వారం వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకుడు వంగవీటి నరేంద్ర మీడియాతో మాట్లాడారు.

క్విడ్‌ప్రోకో కింద టీటీడీ చైర్మ‌న్ ప‌ద‌వి:
ఏ మాత్రం అర్హత లేని బీఆర్‌ నాయుడిని సీఎం చంద్రబాబు క్విడ్‌ప్రోకో కింద టీటీడీ ఛైర్మన్‌ను చేశారని వంగవీటి నరేంద్ర చెప్పారు. నిజానికి బీఆర్‌ నాయుడు, ప్రజలకు చేసింది ఒక్కటి కూడా లేదని, తొలి నుంచి టీడీపీకి అనుకూలంగా పని చేయడంతో, చంద్రబాబు ఆ పదవి కట్టబెట్టాడని ఆక్షేపించారు.
    చంద్రబాబు సీఎం అయినప్పుడల్లా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని, అమాయక ప్రజల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయని గుర్తు చేశారు. చంద్రబాబ పబ్లిసిటీ పిచ్చికి గోదావరి పుష్కరాల్లో 29 మంది బలి కాగా, ఆ తర్వాత కందుకూరులో మీటింగ్‌లో 7గురు, ఆ తర్వాత గుంటూరులో మరో ముగ్గురు చనిపోయారని గుర్తు చేశారు. అందుకే ఇకనైనా అలాంటి ఘటనలకు ఫుల్‌స్టాప్‌ పడాల్సిన అవసరం ఉందని చెప్పారు. 

సుమోటోగా కేసు న‌మోదు చేయ‌డం లేదు
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వరసగా ఇన్ని ఘటనలు జరుగుతున్నా చంద్రబాబుపై పోలీసులు సుమోటోగా కేసులు నమోదు చేయడం లేదని, అందుకే దానిపై జాతీయ మానవ హక్కుల సంఘాని (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కి ఫిర్యాదు చేశామని వంగవీటి నరేంద్ర వెల్లడించారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో కూడా ఒక వర్గానికి చెందిన అధికారులను కాపాడుతూ, సంబంధం లేని వారిపై చర్య తీసుకోవడం దారుణమని అన్నారు. చంద్రబాబు సీఎం అయిన నాటి నుంచి కక్ష సాధింపు చర్యలు, స్కామ్‌లు తప్ప, స్కీమ్‌ల అమలు లేదని వంగవీటి నరేంద్ర తేల్చి చెప్పారు. మరోవైపు తిరుపతి తొక్కిసలాట తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని, బాధితుల ఇళ్లకు అధికారులు వెళ్లి, క్షమాపణలు చెప్పాలనడం అర్థరహితమని వంగ‌వీటి న‌రేంద్ర‌ స్పష్టం చేశారు.
 

Back to Top