తాడేపల్లి: రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని... చంద్రబాదుడు పాలన అని వైయస్ఆర్సిపి నేతలు మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా రూ.15,485 కోట్లు భారాన్ని మోపడం దుర్మార్గమని అన్నారు. దీనికి నిరసనగా వైయస్ఆర్ సిపి అధినేత వైయస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 27వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైయస్ఆర్ సీపీ పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు, జోగి రమేష్, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఆ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు పాలనను ఎండగట్టారు. మాజీ మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రజలకు అనేక హామీలు ఇచ్చాడు. దీనిలో భాగంగా తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీల పెంపుదల ఉండదు అని ప్రజలను నమ్మించాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారంను ప్రజలపై మోపుతున్నాడు. గతంలోనూ విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రజలను అనేక కష్టాలకు గురి చేసిన చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఆనాడు విద్యుత్ చార్జీలతో నలిగిపోతున్న ప్రజలకు, రైతులకు అండగా స్వర్గీయ వైయస్ఆర్ పెద్ద ఎత్తున ఉద్యమించారు. చంద్రబాబు ఆ ఉద్యమాన్ని కర్కశంగా అణిచివేసేందుకు ఏకంగా రైతులపై పోలీసులతో కాల్పులు చేయించి, రక్తపాతానికి కారణమయ్యాడు. నేడు రాష్ట్రంలో మరోసారి చంద్రబాబు వల్ల విద్యుత్ చార్జీల భారాన్ని మోయలేక ప్రజల నడ్డి విరుగుతోంది. ప్రజలకు అండగా వైయస్ఆర్ సీపీ ఈనెల 27న తలపెట్టిన నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపడంతో పాటు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. మాజీ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ... ప్రజలపై చంద్రబాదుడు కార్యక్రమాన్ని వైయస్ఆర్ సిపి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడమే కాదు, వారి కష్టాలను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి, కొనేవారు లేక మద్దతుధర లభించక అల్లాడుతున్న రైతులకు అండగా వైయస్ జగన్ చేసిన ఆందోళనలతో ప్రభుత్వం కళ్ళు తెరిచింది. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలను పెంచడం, గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ కు మంగళం పాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు సరైన గుణపాఠం నేర్పుతాం. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 27న విద్యుత్ కార్యాలయాల వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలి. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ... ఎన్నిలకు ముందు విద్యుత్ చార్జీల మోత ఉండదూ అని ప్రజలను నమ్మించిన చంద్రబాబు నేడు దానికి విరుద్దంగా కరెంట్ చార్జీలను పెంచాడు. చంద్రబాబు దిగివచ్చి, కరెంట్ చార్జీల భారంను ఉపసంహరించుకునే వరకు వైయస్ జగన్ నేతృత్వంలో వైయస్ఆర్సిపి ఉద్యమిస్తూనే ఉంటుంది. ప్రజల గళంగా ఈ ప్రభుత్వంపై వత్తిడి తెస్తుంది. ప్రజల ఆవేదనకు అండగా నిలుస్తుంది. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం.