ప్రభుత్వ విద్య మిథ్యే!

రాష్ట్రంలో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న కూటమి సర్కారు

ప్రమాణాలు క్షీణించేలా చేసి పిల్లలను ‘ప్రైవేట్‌’ బాట పట్టించడమే లక్ష్యం

ఇప్పటికే పాఠశాల విద్య నిర్వీర్యం.. తాజాగా ఇంటర్‌ విద్య వంతు  

విచ్చలవిడిగా కార్పొరేట్, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

ఆరు నెలల్లో కొత్తగా 80కి పైగా ప్రైవేట్‌ కాలేజీలకు అనుమతులు

37 మండలాలు, 2 మున్సిపాలిటీల్లో కొత్తగా 53 కాలేజీలు అవసరమని గుర్తింపు 

ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ కాలేజీలు పెట్టకుండా ప్రైవేటుకు అనుమతిస్తూ జీవో  

ఇంటర్‌ బోర్డు పాలక మండలిలో కార్పొరేట్‌ ‘నారాయణ’కు చోటు.. ఐఐటీ శిక్షణ అంటూ ఇప్పటికే నాలుగు కేంద్రాలు ప్రైవేటుపరం  

ఇప్పటికే గత సర్కారు తెచ్చిన అన్ని పథకాలను ఆపేసి పేద పిల్లలతో ఆటలు  

అమ్మ ఒడి, నాడు–నేడుకు మంగళం.. 

గోరుముద్ద ఘోరం.. ఇంగ్లిష్‌ మీడియం, సీబీఎస్‌ఈ, ఐబీ, ట్యాబ్‌లు, టోఫెల్‌ శిక్షణ రద్దు 

అటకెక్కిన ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ టీవీలతో డిజిటల్‌ బోధన  

తాగు నీరు కరువు.. పారిశుధ్య లోపం.. వేధిస్తున్న మౌలిక వసతుల లేమి

అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. సర్కారు పాఠశాలలు, ఇంటర్‌ కళాశాలల్లో ప్రమాణాలు క్షీణించేలా చేసి.. వాటిలో చదువుతున్న పిల్లలను ప్రైవేట్‌ బాట పట్టించడమే ధ్యేయంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది. ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేయా ల్సింది పోయి అక్కడ ప్రైవేట్‌కు అవకాశం ఇస్తోంది. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కొత్తగా దాదాపు 80 ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీల ఏర్పాటుకు అనుమతులిచ్చింది. 

అంతేగాక విద్యను కార్పొరేట్‌ వ్యాపారం చేసిన నారాయణ విద్యా సంస్థల ప్రతినిధికి తాజాగా ఇంటర్మీడియట్‌ బోర్డులో స్థానం కల్పించింది. గత ప్రభుత్వంలో మండలానికి రెండు ప్రభుత్వ కాలేజీలు.. వాటిలో ఒకటి బాలికలకు తప్పనిసరి చేస్తూ ఏర్పాటు చేసిన 502 హైస్కూల్‌ ప్లస్‌లను సైతం రద్దు చేసేందుకు కంకణం కట్టుకుంది. పిల్లల సంఖ్య అధికంగా ఉన్న చోట ప్రభుత్వమే పాఠశాలలు, జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాలి. 

కానీ అందుకు భిన్నంగా 37 మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఏకంగా జీవో ఇస్తూ.. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారులకు అప్పగించింది. ‘ప్రభుత్వ విద్య వద్దు.. ప్రైవేటు చదువులే ముద్దు’ అని గత టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు బహిరంగంగానే ప్రకటించారు. విద్య ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో సదుపాయాలు ఉండవని, ప్రైవేటు స్కూళ్లల్లో చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన.. ఇప్పుడూ సీఎంగా అదే పంధాను కొనసాగిస్తున్నారు. 

మొత్తంగా విద్య రంగం అంతటినీ ప్రయివేట్‌ చేతుల్లో పెట్టే కుట్రకు ఈ సర్కారు తెర లేపింది. ఇందులో భాగంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ అమలు చేసిన పలు పథకాలు, కార్యక్రమాలను అటకెక్కిస్తుండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. 

అన్ని దశల్లో ప్రైవేటుకే ప్రాధాన్యం  
⇒ దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యం ఇస్తాయి. కేరళ, ఢిల్లీలో అక్కడి ప్రభుత్వాలు అద్భుతమైన ప్రభుత్వ విద్యను అందిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 మే వరకు గత ప్రభుత్వ పాలనలో సర్కారు విద్యకే ప్రాధాన్యం ఇచ్చి పాఠశాల, జూనియర్‌ విద్యను పటిష్టం చేసింది.  

⇒ రాష్ట్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రభుత్వ విద్యలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను ఒకొక్కటిగా నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్‌ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇటీవల నిర్వహిచిన కలెక్టర్ల సదస్సులోనూ సీఎం చంద్రబాబు.. ప్రైవేటు విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యలో ప్రైవేటు భాగస్వామ్యం ఉండాలని ప్రకటించారు.  

⇒ ఇది జరిగిన నాలుగు రోజుల్లోనే నారాయణ జూనియర్‌ కాలేజీకి చెందిన ప్రిన్సిపల్‌ను ఇంటర్‌ బోర్డులో సభ్యుడిగా నియమించారు. వాస్తవానికి ఈ స్థానాన్ని లాభాపేక్ష లేని ట్రస్ట్‌ బోర్డు యాజమాన్యాలకు లేదా చిన్న ప్రైవేటు కాలేజీలకు కల్పించాలి. అందుకు విరుద్దంగా విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్‌ సంస్థకు అప్పగించారు.  

⇒ ఆరు నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా దాదాపు 80 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలకు అనుమతులిచ్చారు. 2025–26 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 37 మండలాల్లో 47, రెండు మున్సిపాలిటీల్లో 6 జూనియర్‌ కాలేజీలను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రభుత్వమే ప్రైవేటు యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఇందుకోసం ఇటీవల జీవో 496ను సైతం విడుదల చేసింది.  

⇒ ఈ 53 ప్రాంతాల్లో విద్యార్థులున్నారన్న విషయం ప్రభుత్వానికి తెలుసు కాబట్టి, ఆ మేరకు ఇంటర్‌ కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ప్రైవేటు కాలేజీలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులివ్వడం విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులను విస్తుపోయేలా చేసింది. కాగా, రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో సుమారు 800 జూనియర్‌ కాలేజీలు ఉంటే.. 2,200 వరకు ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిలో అధికంగా నారాయణ, చైతన్యవే కావడం గమనార్హం.  

ప్రభుత్వ లెక్చరర్లకు బోధన సామర్థ్యం లేదట! 
⇒ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో గత విద్యా సంవత్సరం అప్పటి ప్రభుత్వం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఐఐటీ, నీట్‌ శిక్షణను పైలట్‌గా ప్రారంభించింది. ఎంపిక చేసిన కాలేజీల్లో ఆసక్తి ఉన్న సీనియర్‌ లెక్చరర్లతో ప్రత్యేక తరగతులు నిర్వహించింది. అయితే, ఈ విధానాన్ని మరింత మెరుగ్గా కొనసాగించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఐఐటీ, నీట్‌ శిక్షణ ఇచ్చే సామర్థ్యం ప్రభుత్వ లెక్చరర్లకు లేదని చెప్పి.. నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది.  
 
⇒ తొలి దశలో కర్నూలు, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఆ నగరాల్లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, ఆయా నగరాలకు ఐదు నుంచి పది కి.మీ పరిధిలోని ప్రభుత్వ కాలేజీల ఎంపీసీ, బైపీసీ విద్యార్థులను అక్కడకు చేర్చారు. వారికి ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించి, శిక్షణ ఇస్తున్నారు.  

⇒ ఒక్కో నగరం పరిధిలో నాలుగు నుంచి 10 కళాశాలల వరకు ఉండగా, అన్ని కళాశాలల్లోనూ ఇంటర్‌ మొదటి ఏడాది విద్యార్థులకు కామన్‌ ఎంట్రన్స్‌ నిర్వహించి ఒక్కో (ఎంపీసీ, బైపీసీ) గ్రూప్‌ నుంచి 25 నుంచి 40 మందిని ఎంపిక చేశారు. అంటే ప్రతిభ గల ప్రభుత్వ విద్యార్థులకు మాత్రమే నారాయణ సిబ్బంది శిక్షణ ఇస్తారు. వారు విజయం సాధిస్తే అది నారాయణ విజయంగా జమకట్టి.. మిగిలిన ప్రభుత్వ కాలేజీలను కార్పొరేట్‌ యాజమాన్యాలకే కట్టబెట్టేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక వేశారు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ ఇదే పంధాను అనుసరించారు. 

⇒ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు బోధనా సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయని చెప్పి, వారికి నారాయణ స్కూళ్ల సిబ్బంది శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు. నాడు ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత వచ్చినా నిర్బంధంగా అమలు చేశారు. ఇప్పుడు జూనియర్‌ కాలేజీల్లో లెక్చరర్లను పక్కనబెట్టి.. అదే విధానంలో విద్యార్థులను టార్గెట్‌ చేయడం గమనార్హం.  

అధికారంలోకి రాగానే మొదలు.. 
⇒ రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చింది మొదలు విద్య రంగంపై శీతకన్ను వేసింది. గత సర్కారు ప్రారంభించిన పథకాలు, కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా కొనసాగించాల్సిందిపోయి.. వాటి పునాదులు పెకిలిస్తూ నీరుగారుస్తోంది. తొలుత ‘అమ్మ ఒడి’ పథకంపై కక్ష కట్టింది. ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ‘అమ్మకు వందనం’ కింద ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల ముందు చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు చేతులెత్తేశారు. ఫలితంగా 45 లక్షల మంది తల్లులు, 84 లక్షల మంది పిల్లలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. 

⇒ స్కూళ్ల రూపురేఖలు మార్చేసిన నాడు–నేడు పనులను మధ్యలో నిలిపేశారు. పిల్లలకు అందించే మధ్యాహ్న భోజనం.. జగనన్న గోరుముద్ద పేరును డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా మార్చి ఏజెన్సీలను రాజకీయ కక్షతో తొలగించారు. గతంలో దాదాపు 95 శాతం మంది పిల్లలు గోరుముద్దను తీసుకోగా ఇప్పుడు నాణ్యత కొరవడటంతో 50 శాతం మంది కూడా తినడం లేదు. రోజుకో మెనూ గాలికి పోయింది. నీళ్ల పప్పు రోజులను మళ్లీ తీసుకొచ్చింది. 

⇒ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువుల్లో మెరుగ్గా రాణించేందుకు గత ప్రభుత్వం బైజూస్‌ కంటెంట్‌తో ఉచితంగా ట్యాబ్‌లు అందించింది. రూ.1,305.74 కోట్లతో 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ట్యాబ్‌ల మాటే ఎత్తడం లేదు. ఒకటో తరగతి నుంచే ఇంగ్లిష్‌ మీడియం బోధనను నీరుగారుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదవలేకపోతున్నారంటూ ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను తెలుగు మీడియంలో రాసేలా నిర్ణయం తీసుకుంది. సీబీఎస్‌ఈ బోధనను రద్దు చేసింది. ఆంగ్ల భాషా నైపుణ్యాల కోసం మూడో తరగతి నుంచే ప్రారంభమైన ‘టోఫెల్‌’ శిక్షణను కూడా రద్దు చేసింది.  

⇒ పేదింటి పిల్లలు అంతర్జాతీయంగా ఎదగాలన్న వైఎస్‌ జగన్‌ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ స్కూళ్లలో ప్రవేశపెట్టిన ‘ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌(ఐబీ) బోధనపై కూడా చంద్రబాబు ప్రభుత్వం కక్ష కట్టింది. విద్యార్థుల్లో బోధనా ప్రమాణాలు పెంచేందుకు 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్‌ బోధనను సైతం పక్కనపెట్టింది. టెన్త్, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమానికీ తిలోదకాలిచ్చింది. యూనిఫాంతో కూడిన కిట్లు కూడా సరిగా పంపిణీ చేయలేకపోయింది.   

⇒ ఐఎఫ్‌పీలు, స్మార్ట్‌ టీవీలతో డిజిటల్‌ బోధన.. ఇలా ఒక్కోదాన్ని అటకెక్కిస్తూ వస్తోంది. నిర్వహణపై చేతులెత్తేసి తాగునీరు, మరుగుదొడ్ల సమస్యను గతానికి తీసుకెళ్లింది. విద్య దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా పిల్లలను ఉన్నత చదువులకు దూరం చేస్తోంది. ఈ పరిణామాలన్నీ రాష్ట్రంలో విద్యా వేత్తలను, తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.  

ఇది విద్యా రంగాన్ని ప్రమాదంలోకి నెట్టడమే  
రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్‌ విద్యా మండలి పునర్వ్యవస్థీకరణలో భాగంగా విచిత్రమైన ఉత్తర్వులు జారీ చేసింది. ఆశ్చర్యకరంగా కార్పొరేట్‌ విద్యా సంస్థ అయిన నారాయణ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ను మండలిలో నామినేటెడ్‌ సభ్యుడిగా నియమించింది. ప్రభుత్వమే విద్య వ్యాపారీకరణను ప్రోత్సహిస్తుందనేందుకు ఇంతకంటే మంచి ఉదాహరణ మరొకటి అవసరం లేదు. 

నారాయణ, చైతన్య వంటి కార్పొరేట్‌ ప్రైవేట్‌ విద్యా సంస్థలు తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయల ఫీజులను వసూలు చేస్తూ ఇంటర్‌ విద్యను భ్రష్టు పట్టించాయి. ఈ సంస్థలు ఏ విషయంలోనూ ప్రభుత్వ నిబంధనలు అమలు చేసింది లేదు. తమ వ్యాపారం కోసం విద్యార్థుల మధ్య మార్కులు, ర్యాంకుల పోటీ పెట్టి మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఈ కాలేజీల్లో చదువులు కేవలం మెడికల్, ఇంజినీరింగ్‌ ప్రవేశ పరీక్షల కసరత్తుగా తయారయ్యాయి. దీంతో ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. 

ఇలాంటి విద్యా సంస్థలతో సలహాలు తీసుకొని ప్రభుత్వ ఇంటర్‌ కాలేజీలలో విద్యా బోధనను మెరుగు పరుస్తామని ప్రభుత్వం చెప్పడం విద్యా వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడమే అవుతుంది. ఇది విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా కాకుండా, కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయం అని స్పష్టమవుతోంది. 
- ఇ.మహేష్‌, ఆలిండియా డెమొక్రటిక్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌ రాష్ట్ర కార్యదర్శి 

కూటమి పాలనలో చెదిరిన చదువులు

ఐక్యరాజ్య సమితి వరకు వినిపించిన ఏపీ ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రగతి ఆర్నెల్లలోనే గాడి తప్పింది! గత ఐదేళ్లూ మహోన్నతంగా విలసిల్లిన సర్కారు స్కూళ్లు మళ్లీ అద్వానంగా మారాయి. పిల్లల మధ్యాహ్నం భోజనం నాణ్యతను పరీక్షించే నాథుడే లేరు. సదుపాయాలు, ప్రమాణాలు దిగజారి దయనీయంగా కనిపిస్తున్నాయి. ‘మెగా పేరెంట్స్‌ డే’ పేరుతో కూటమి ప్రభుత్వం ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో ఓ సమావేశాన్ని నిర్వహించి ఒక్క రోజు హడావుడి చేసింది. 

ఈ కార్యక్రమం ‘గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు’లో లిఖించదగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా బోధన ఎలా ఉంది? ఎలాంటి సదుపాయాలున్నాయి? మన విద్యా వ్యవస్థ నాడు – నేడు ఎలా ఉంది? విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏమనుకుంటున్నారో తెలుసుకు­నేందు కు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో ప్రభుత్వ స్కూళ్లను క్షేత్రస్థాయి­లో పరిశీలించింది.

కూటమి అధికారంలోకి వచి్చన తర్వాత కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వానంగా మారింది.
⇒ కర్నూలు జిల్లా సి.బెళగల్‌ మండలం ముడుమాల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విద్యార్థులు చెట్ల కిందే కూర్చుని పాఠాలువింటున్నారు. కొంత మంది అసంపూర్తిగా నిలిచిపోయిన గదుల్లో ఇసుక, మట్టిపై కూర్చుని కనిపించారు. బ్లాక్‌ బోర్డును ఇటుకలపై అమర్చి బోధిస్తున్నారు. 12 తరగతి గదుల నిర్మాణాన్ని మధ్యలో నిలిపేశారు. రూ.46.99 లక్షలు నిధులున్నా, వాటిని పూర్తి చేసే వారు లేరు. సంగాల ఉన్నత పాఠశాల భవనాలను మధ్యలోనే నిలిపేశారు. నాగులదిన్నె, నందవరంతో పాటు జడ్పీ హైస్కూలు భవనాల నిర్మాణం ఆగిపోయింది. ప్రభుత్వం మారడంతో పనులు నిలిపివేసింది.

⇒ నందవరం మండలం నాగులదిన్నె స్కూలులో తాగేందుకు మంచినీరు లేక ట్యాంకుల్లో నింపిన నీటినే పిల్లలు తాగుతున్నారు.
⇒ కర్నూలులో స్టాంటన్‌పురం నుంచి  ఎమ్మిగ­నూరు వరకు ఏ స్కూల్లో చూసినా మరుగు­దొడ్లలో దుర్గంధమే.
⇒ చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అధ్వా­నంగా 
ఉంది. చాలా మంది పిల్లలకు బూట్లు లేవు. చెప్పులు, ఒట్టి కాళ్లతో బడికి వచ్చారు.

⇒ కర్నూలు రూరల్‌ మండలం కోడుమూరు నియోజక­వర్గం సుంకేసుల ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాల భవనాలు, ప్రహరీ, కిచెన్‌ నిర్మాణాలను  మధ్యలోనే నిలిపివేశారు. కాలనీలో నిరుపేద మహిళలను పలుకరించగా.. ‘సార్‌! మాలాంటోళ్లకు అమ్మ ఒడితో ఎంతో మేలు జరిగింది. ఇప్పుడు ‘తల్లికి వందనం’ అంటూ ఎంతమంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామన్నారు. మరి ఎక్కడిచ్చారు?’ అంటూ మహిళలు శిరోమణి, స్వరూప, మహేశ్వరి నిర్వేదం వ్యక్తం చేశారు.

అమ్మ ఒడి లేదు.. నీడనిచ్చే హాస్టళ్లూ లేవు..!
కర్నూలు జిల్లా కోసిగి మండలం పల్లెపాడు హైస్కూలులో 608 మంది విద్యార్థులు చదువు­తుండగా 160 మంది మాత్రమే బడికి వస్తున్నారు. మిగిలిన వారంతా తల్లిదండ్రులతో కలసి ఉపాధి కోసం వలస వెళ్లారు. గతంలో తల్లిదండ్రులు వలస వెళ్లినా పిల్లలు సీజనల్‌ హాస్టళ్లలో ఉంటూ చదువుకునేవారు. ఇప్పుడు డిసెంబర్‌ వచ్చినా సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయకపో­వడంతో తల్లిదండ్రులతో కలసి పనుల కోసం పిల్లలు ఊరు విడిచి వెళ్లారు. అమ్మ ఒడి కూడా అందకపోవడంతో కష్టజీవులు తమ పిల్లలను చదివించుకునే పరిస్థితి లేకుండా పోయింది.

బడి వదిలి.. పొలం  బాట .. 
సి.బెళగల్‌ మండలం ఈర్లదిన్నెలో శేఖర్‌ అనే విద్యార్థి స్కూలుకు వెళ్లకుండా తండ్రి ఈశ్వర్‌తో కలిసి పొలంలో గడ్డివామి వేస్తున్నాడు. అదే గ్రామంలో సందేశ్, జీవన్‌ అనే మరో ఇద్దరు చిన్నారులు కూడా తల్లి ప్రవీణతో కలసి మొక్కజొన్నకు మందు పిచికారీ చేస్తున్నారు. ‘అమ్మ ఒడి డబ్బులు వస్తే పిల్లల ఖర్చులకు ఉపయోగప డేవి. ఇప్పుడు ఇవ్వట్లేదు కదా సార్‌! ఏదో వీళ్లు పనికి వస్తే కూలీ డబ్బులైనా మిగులుతాయి’ అని తల్లిదండ్రులు చెబుతున్నారు.

అమ్మ ఒడి లేక డ్రాపౌట్స్‌!

బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందక పేద పిల్లలు పాఠశాల­లకు దూరమవుతున్నారు. డ్రాపౌట్స్‌ పెరిగిపోతు­న్నారు. ఈ ఏడాది ఇంకా చాలా మందికి యూనిఫాం, బూట్లు, ఇతర వస్తువులు అందలేదు... అని చీరాల నియోజక­వర్గం వేటపాలెం మండలం అక్కాయి­పాలెం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చెప్పారు. అమ్మ ఒడి అందకపో­వడంతో ఈ పాఠ­శాలలో 23 మంది విద్యార్థులు తగ్గిపోయినట్లు ఓ ఉపాధ్యా­యుడు తెలిపారు. 

⇒ చంద్రబాబు ప్రభుత్వం అమ్మ ఒడి ఇవ్వక పోవడంతో ఇద్దరు పిల్లలను చదివించడం భారం­గా ఉందని సముద్ర తీర ప్రాంతం వాడరేవుకు చెందిన మత్స్యకారుడు శ్రీను ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మ ఒడి రాక తమ పిల్లలను బడి మానిపించినట్లు మహిళలు సురేఖ, కుమారి తెలిపారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్‌ మీడియం చదువులు లేనప్పుడు ఇక పిల్లలను బడికి పంపడం ఎందుకు సారూ.. అని మత్స్యకార మహిళ అక్ష  ప్రశ్నించింది. ఓడరేవు ఉన్నత పాఠశాలలో గత ప్రభుత్వ హయాంలో మొదలైన భవన నిర్మాణ పనులు మధ్య­లోనే ఆగిపోవడంతో విద్యార్థులు ఆరు బయట ఇసుకలో చదువుకుంటూ కనిపించారు. 

⇒ చినగంజాం మండలం అడవి వీధిపాలెం ఉన్నత పాఠశాలను పరిశీలించేందుకు ఉపాధ్యాయులు అనుమతి నిరాకరించి గేటుకు తాళం వేశారు. నాసిరకం బియ్యం, టమాటా చారుతో పెడుతున్న మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు తినడం లేదని, చాలామంది ఇంటి నుంచే భోజనం తెచ్చుకుంటున్నారని  అనూష అనే మహిళ తెలిపింది. తాగడానికి మంచినీళ్లు కూడా అందుబాటులో లేవని, మరుగుదొడ్లు శుభ్రంగా లేవని విద్యార్థులు చెప్పారు. జిల్లాలో సుమారు రూ.350 కోట్ల విలువైన నాడు–నేడు పనులు మధ్యలోనే ఆగిపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయి.

తడికెల బడి.. కర్నూలులోని స్టాంటన్‌పురం జడ్పీ హైస్కూల్లో అంగన్‌వాడీ నుంచి పదో తరగతి వరకూ ఒకటే బడి. ‘నాడు–నేడు’ కింద మంజూరైన నిధులున్నా  భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. దీంతో టీచర్లు చందాలు వేసుకుని తడికెలు సమకూర్చుకుని అందులోనే పిల్లలకు చదువు చెబుతున్నారు. ఆర్నెల్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిపోయిందో చెప్పేందుకు ఇవి సరిపోవా?

శ్రీకాకుళం జిల్లా ఆనందపురం యూపీ స్కూల్‌లో నిరూపయోగంగా మారిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన వాటర్‌ ఫిల్టర్‌ 

నిర్వహణ అస్తవ్యస్తం
శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మూత్రశాలలు, మరుగుదొడ్లకు రన్నింగ్‌ వాటర్‌ లేక విద్యార్థులు అవస్థ పడుతున్నారు. రణస్థలం మండలం పైడి భీమవరం హైస్కూ­ల్‌లో వాష్‌బేసిన్‌లు, మూత్రశాలలు నీటి సదుపాయం లేక వెక్కిరిస్తు­న్నాయి. టెక్కలి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక చాలా చోట్ల పాఠశాలల భవనాలు ప్రారంభించేందుకు సిద్ధమైనా వాటిని పట్టించుకునే నాధుడు లేరు. భవనాల్లో అమర్చా­ల్సిన తలుపులు, కిటికీలు, ఇతర సామగ్రిని పాఠశాలల్లోని స్టోర్‌ రూమ్‌లో పడేశారు. ఈ పనుల కోసం ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని రణస్థలం మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

⇒ పాఠశాలల్లో తాగునీటి ఆర్వో ప్లాంట్లు నిర్వహణ లోపంతో పని చేయడం లేదు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం పెట్టడం లేదు. చాలా చోట్ల ఆరు బయట అపరిశుభ్ర వాతావరణంలో వండటం కనిపించింది. రణస్థలం మండలం పాతర్లపల్లి హైస్కూల్‌లో విద్యార్థులకు సిద్ధం చేసిన వంటల్లో పక్షుల విసర్జితాలు నేరుగా పడుతున్న దుస్థితి పరిశీలనలో కంటబడింది. పక్కా భవనం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఉపాధ్యాయులు, వంట కార్మికులు చెబుతున్నారు.

నాడు–నేడు కింద చేపట్టిన భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయని, అవి పూర్తయితే వంటగదిని కేటాయించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. నాడు–నేడుతో తమ పాఠశాల రూపురేఖలు మారాయని, చుట్టూ రక్షణ గోడ నిర్మించడంతోఎన్నో ఏళ్లుగా వేధించిన వరద నీటి ముంపు సమస్య తొలగిందని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఆనందపురం యూపీ స్కూల్‌ ప్రధానోపాధ్యా­యుడు ఏ.ఆదినారాయణ చెప్పారు.

కలలో కూడా అనుకోలేదు..
‘ఎప్పుడు ఏది కూలుతుందో తెలియని దుస్థితి నుంచి కార్పొరేట్‌ పాఠశాలలను తలదన్నే రీతిలో మా స్కూళ్లు మారతాయని ఎన్నడూ ఊహించలేదు. నా సర్వీస్‌లో ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు..’ – డిజిటల్‌ బోర్డు వైపు చూస్తూ శ్రీకాకుళం జిల్లా దేశవానిపేట యూపీ స్కూల్‌ టీచర్‌ ఉత్తముడి మాట!

ఈ మార్పులు ఎవరి చలువ?
‘ఇటీవల పేరెంట్స్‌–టీచర్స్‌ మీటింగ్‌ కోసం పాఠశాలకు వెళ్లాం. అక్కడ ఉన్నవన్నీ ఎవరు ఏర్పాటు చేసిన వసతులు? ఎవరి హయాంలో వచ్చిన మార్పులు అవి? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనే వ్యక్తి లేకపోతే మా ఊరి బడి పరిస్థితి మారేదా..?’     
– శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో 8వ తరగతి విద్యార్థి తండ్రి ఎస్‌.రామారావు మనోగతం!

జగన్‌ మా బాధలు తీర్చారు..
‘పాఠశాలకు వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు ఒకటే టెన్షన్‌. చుట్టూ మురుగునీరు.. తీవ్ర దుర్గంధం! చినుకు పడితే పాముల బెడద. ఎప్పుడూ జలమయంగా ఉండే పాఠశాల ప్రాంగణం.. జగన్‌ నాడు–నేడులో భాగంగా చేపట్టిన ప్రహరీ నిర్మాణంతో మా బాధలు తీరాయి’     – డోల చంద్రుడు, విద్యార్థి ఆనందపురం, శ్రీకాకుళం జిల్లా

ఆర్నెల్లుగా జీతాలులేకున్నా..
‘పిల్లల బాగోగులే మాకు కావాలి బాబూ..! జగన్‌ బాబు ఉన్నప్పుడు ప్రతి నెలా జీతం వచ్చేది. ఇప్పుడు జీతం ముఖం చూసి ఆరు నెలలైంది. అయినా సరే పని చేస్తున్నాం. పిల్లల ఆరోగ్యమే మా జీవితం. మా ఆకలి బాధలు తీరకున్నా మరుగుదొడ్లు నిత్యం పరిశుభ్రంగానే ఉంచుతున్నాం. మాకు చేతనైంది ఇదే పని బాబూ.. జీతాలిప్పించండి..’ అంటూ పాతర్లపల్లి, పైడి భీమవరంలో ఆయా రాములమ్మతో పాటు మరికొందరు వేడుకున్నారు. 
 

Back to Top