ఎవరి కోసం చంద్రబాబు దీక్ష

 టీడీపీ పాలనలో విచ్చలవిడిగా ఇసుక దోపిడీ

అడ్డువచ్చిన మహిళా తహసీల్దారుపై టీడీపీ ఎమ్మెల్యే దాడి

ఇసుక పేరుతో అడ్డంగా దోచుకున్న అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు

వైయస్‌ జగన్‌ సీఎం కాకముందే ఇసుక దోపిడీ ఉందటూ ఈనాడు కథనాలు చదవలేదా?

 అమరావతి:  అధికారంలో ఉన్న ఐదేళ్లు చంద్రబాబు, ఆయన బినామీలు, పచ్చ పార్టీ నేతలు ఇసుక దోపిడీతో వేల కోట్లు అక్రమంగా సంపాదించారు. ఉచితమంటూనే ఉన్న ఇసుకంతా ఊడ్చేశారు. నదీ గర్భంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఏకంగా గ్రీన్‌ ట్రిబ్యూనల్‌కే కోపం తెప్పించి..ఏకంగా ఏపీకి వంద కోట్ల జరిమానా విధించారంటే ఏ మేరకు ఇసుక దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు ఇసుక దందా.. మరోవైపు పోలవరం పేరిట వేల కోట్లు పక్కదారి.. అడ్డువచ్చిన అధికారులపై దాడులకు తెగబడిన ప్రజాప్రతినిధులకు చంద్రబాబు అండగా నిలిచారు. ఈ ఆకృత్యాలే ఏపీలో చంద్రబాబు పాలనను అంతం చేశాయనడానికి సజీవ సాక్ష్యం. ఏపీలో ఇసుకమాఫియా దోపిడీ రూ.12,500 కోట్లు ఉంటుందని ఒక అంచనా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వానికి ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించిందంటే ఈ దందా ఎంతగా ఉన్నదో అర్థమవుతుంది. చంద్రబాబు అండతో ఏపీలో దాదాపు 500కుపైగా ఇసుకరీచ్‌లను టీడీపీ నాయకులు తమ దోపిడీకేంద్రాలుగా మార్చుకొన్నారు.

ప్రశ్నిస్తే దాడులు..

ఇసుక దోపిడీపై ఎవరైనా ప్రశ్నిస్తే అప్పటి అధికారపార్టీ నేతలు దాడులకు దిగారు. చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో ఇసుక మాఫియాకు అడ్డుపడినవారిని పోలీస్‌స్టేషన్ ఎదుటే ఇసుక ట్రాక్టర్లతో తొక్కించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయింది. ఇసుక అక్రమ తవ్వకాన్ని ప్రశ్నించినందుకు మహిళా తాసిల్దార్ వనజాక్షిపై  అప్పటి  ప్రభుత్వవిప్ చింతమనేని ప్రభాకర్‌ దాడి చేస్తే ఆయనకు చంద్రబాబే అండగా నిలబడ్డారు. పర్మిట్లులేకుండా ఇసుక తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న అధికారులపై అనంతపురం జిల్లాలో దాడులు జరిగాయి. తుంగభద్ర నది మధ్యలో ఓ మంత్రి నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా నాలుగు కిలోమీటర్లు రహదారిని ఏర్పాటుచేసి ఇసుకను తరలింపునకు పాల్పడ్డారు. ఇక్కడి నుంచి బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు.

ఉచిత ఇసుక పేరుతో పచ్చ నేతల దోపిడీ

వాస్తవానికి ఇసుక తరలింపును మహిళా సంఘాలకు కేటాయించి వారికి ఆదాయవనరుగా మార్చాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది.  అయితే టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చక్రం తిప్పి.. మహిళా సంఘాల పేరుతో బంధువర్గాన్ని రంగంలోకి దింపడంతో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. దీంతో చంద్రబాబు ఇసుక విధానాన్ని ఉచితంగా ఇస్తున్నానని చెబుతూనే టీడీపీ నేతలకు రీచ్‌లు కట్టబెట్టారు.   అవసరాల కోసమంటూ నదీ పరివాహక ప్రాంతాల్లో మధ్యనుంచి ఇసుకను తీసుకురావడం, అక్కడ నుంచి ప్రత్యేకప్రాంతాలను ఏర్పాటు చేసుకుని అమ్ముకోవడం పరిపాటిగా మారింది. ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లేందుకు ప్రభు త్వం పచ్చనేతలకు అవకాశం కల్పించడం ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమయింది. ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలపై చర్యలు తీసుకోవాలంటూ వాటర్‌మ్యాన్ రాజేంద్రసింగ్, అనుమోలు గాంధీ ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఎన్జీటీ.. ఏపీ ప్రభుత్వానికి రూ. 100 కోట్లు జరిమానా విధించింది.     

సొంత కొడుకుతో డైటింగ్‌ దీక్ష..దత్తపుత్రుడితో రాంగ్‌ మార్చ్‌..

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కాకముందే రాష్ట్రంలో ఇసుక కొరత ఏర్పడింది. ఈ ఏడాది మే నాటికి రాష్ట్రంలో తీవ్ర ఇసుక కొరత ఉందంటూ ఈనాడులో బ్యానర్‌ కథనాలు రాశారు. దీనికి చంద్రబాబు కాదా కారణం. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఎగువ రాష్ట్రాల నుంచి నదులకు భారీగా వరద రావడం, భారీ వర్షాలు కురవడంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. దీంతో కొంత ఇసుక కొరత ఏర్పడింది. ఇసుకను అందరికి అందుబాటులోకి తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నూతన పాలసీ తీసుకువచ్చింది. ఈ విధానాన్ని సమర్ధించాల్సింది పోయి ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు బురద రాజకీయాలు చేస్తున్నాయి. మంగళగిరిలో చంద్రబాబు తన సొంత కుమారుడు లోకేష్‌తో 4 గంటల దీక్ష చేయించాడు. దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌తో విశాఖలో లాంగ్‌ మార్చ్‌ పేరుతో రాంగ్‌ మార్చ్‌ చేయించాడు. ఇది చాలదన్నట్లు నవంబర్‌ 14న బాలల దినోత్సవం రోజు చంద్రబాబు విజయవాడలో దీక్షకు సిద్ధమవుతుండటం పలు విమర్శలకు దారి తీస్తోంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం, మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి వ్యవహరిస్తున్న తీరు ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనంగా ఉంది. వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు వెళ్లిన సామెత మాదిరిగా చంద్రబాబు దొంగ దీక్షలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Read Also:గిరిజన సలహా మండలి సమావేశం

Back to Top