రైతు భరోసాకు విశేష ‘స్పందన’ 

అందరికీ న్యాయం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్పందన కార్యక్రమం

హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

అమరావతి: వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం అన్నదాతల ఇంట ఆనందోత్సాహాలను నింపుతోంది. ఆర్థిక సాయం కోసం రైతులు ఏ ఒక్కరినీ ఆశ్రయించే పని లేకుండా ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా, పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికోసం రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ (ఆర్టీజీఎస్‌) సాంకేతిక సహకారాన్ని తీసుకుంటోంది. ఇప్పటికే 40.84 లక్షల మందికి పైగా రైతుల ఖాతాల్లో రూ.4,697.36 కోట్లను జమ చేసింది. అంతేకాకుండా నగదు జమ చేసినట్లు రైతుల ఫోన్లకు సందేశాలు కూడా పంపింది. ఈ 40.84 లక్షల మంది రైతులు కాకుండా ఆర్థిక సాయం పొందడంలో చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటున్న మరో ఐదు లక్షల మంది రైతుల సమస్యలను పరిష్కరించడానికి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో సమస్యలను పరిష్కరించి త్వరలోనే ఈ ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో  నగదు జమ చేయనుంది. దీంతో రైతులు, కౌలు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని మండల కేంద్రాల్లోని తహశీల్దార్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రైతులు తమ సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. రైతులకు, కౌలు రైతులకు మధ్య సయోధ్య కుదిర్చి సాగు ఒప్పంద పత్రాలు రాసుకునేలా ఈ స్పందన కార్యక్రమం తోడ్పడుతుందని రైతులు విశ్వసిస్తున్నారు. వెబ్‌ల్యాండ్‌లో ఎదురయ్యే సమస్యలు కూడా పరిష్కారమవుతాయని భావిస్తున్నారు.కొంతమంది రైతులకు ఆధార్‌ కార్డులు లేకపోవడం, ప్రజాసాధికార సర్వేతో అనుసంధానం కాకపోవడం, బ్యాంకు ఖాతాను ఆధార్‌తో లింక్‌ సమస్యలు  తీరతాయని చెబుతున్నారు.  వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందని రైతుల కోసం ప్రత్యేకంగా స్పందన నిర్వహించడం అభినందనీయమని అన్నదాతలు పేర్కొంటున్నారు. పదే పదే కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగే పని లేకుండా మండలంలో ఒక రోజులోనే సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రైతులు స్వాగతిస్తున్నారు.  

 

Read Also: అర్హులందరికీ సంక్షేమ పథకాలు

Back to Top