చంద్రబాబు వచ్చారు.. స్కామ్‌లు, వరదలు తెచ్చారు

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు

హామీల పేరుతో మోసం చేసినందుకు మంచి ప్రభుత్వం అనాలా?
 
నారావారి ‘సారా’ పాలన.. ప్రజలు ఛీకొడుతున్నారు 

రామోజీరావు మరణిస్తే ప్రభుత్వం సొమ్ముతో సంతాప సభ పెట్టారు

తాడేప‌ల్లి: ‘‘చంద్రబాబు వచ్చారు.. స్కామ్‌లు, వరదలు తెచ్చారు’’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

 

 మంచి ప్రభుత్వమా!:
    కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 100 రోజుల్లో ఆరుసార్లు క్యాబినెట్‌ భేటీ జరిగినా, ఆ నిర్ణయాలేవీ ప్రజలకు ఉపయోగపడేలా లేకపోగా స్కామ్‌లకు, లోకేష్‌బాబు ట్యాక్సులకు, ఉన్న పథకాలు పీకేయడానికి వినియోగించుకున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ‘చంద్రబాబు వచ్చారు. స్కామ్‌లు తెచ్చారు.. చంద్రబాబు వచ్చారు. ప్రజలను ముంచారు.. చంద్రబాబు వచ్చారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఎగ్గొట్టారు’.. అని ఆయన వ్యాఖ్యానించారు.
    తమది మంచి ప్రభుత్వమని వారం రోజుల పాటు ప్రచారం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావించిన మాజీ మంత్రి, అది చెప్పాల్సింది ప్రజలు కానీ.. మీకు మీరు కాదని స్పష్టం చేశారు. నిజానికి మీదెలా మంచి ప్రభుత్వం అవుతుందో చెప్పాలన్న ఆయన.. పిల్లలకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి మోసం చేసినందుకా? వాలంటీర్లకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని, గతంలో ఇచ్చిన ఆ రూ.5 వేలు కూడా ఇవ్వకుండా వారిని త్రిశంకు స్వర్గంలో పెట్టినందుకా? అని సూటిగా ప్రశ్నించారు. కేవలం పాలకుల నిర్లక్ష్యంతో విజయవాడలో వరదలు ముంచెత్తి దాదాపు 60 మంది చనిపోతే, అది మంచి ప్రభుత్వం ఎలా అవుతుందని నిలదీశారు.

ప్రజల్లో ఆగ్రహం:
    ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే ఇసుక దోపిడి మొదలుపెట్టి, దాదాపు 60 లక్షల టన్నుల ఇసుకను అమ్మేసుకున్నారన్న మాజీ మంత్రి, అదో పెద్ద కుంభకోణమన్నారు. మరి ఇదా మంచి ప్రభుత్వమని ప్రశ్నించారు. 
    ఇన్ని స్కాములు, ఇన్ని గందగోళాలతో మీది మంచి ప్రభుత్వమెలా అవుతుందన్న అంబటి.. ఎవరికి వారు డబ్బా కొట్టుకోవడం తప్ప, ఎక్కడా ప్రజలు అనుకోవడం లేదని.. నిజానికి ఈ ప్రభుత్వ 100 రోజుల పాలనపై ప్రజాగ్రహం మొదలైందని చెప్పారు.

ఆ వివరాలు చెప్పగలరా?:
    నాణ్యమైన మద్యం అంటే అర్ధం ఏంటి? ఎంత తాగినా ఆరోగ్యం పాడవదా? అని అంబటి ప్రశ్నించారు. మద్యం మద్యమే కదా? అన్న ఆయన, మద్యం తాగడం హానికరం అనే పదాన్ని తీసేయాలని సలహా ఇచ్చారు. నాడు మద్యాన్ని స్కామ్‌గా మార్చుకున్న చంద్రబాబు కోట్లు కొల్లగొట్టారని.. ఇప్పుడు తిరిగి అదే పంథాలో నడుస్తున్నారని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలో సరఫరా చేసిన మద్యం వల్ల ప్రజారోగ్యం దెబ్బతిందని దుష్ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేసిన అంబటి, ఈ 100 రోజుల్లో అవే బ్రాండ్లు అమ్మారు కాబట్టి, ఎంతమంది కిడ్నీలు పాడయ్యాయో చెప్పాలని కోరారు.

మద్యం వినియోగం తగ్గించాం:
    మద్య వినియోగాన్ని తగ్గించడం కోసం చంద్రబాబు హయాంలో ఉన్న 4,380 మద్యం షాపులను 2,934 షాపులకు తగ్గించామని, వాటన్నింటికీ అనుబంధంగా ఉన్న పర్మిట్‌రూమ్‌లు రద్దు చేశామని, 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేశామని.. చివరకు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయించామని, విక్రయ వేళలు కూడా తగ్గించామని అంబటి రాంబాబు గుర్తు చేశారు.

ఆ బ్రాండ్లన్నీ బాబువే!:
    తమ ప్రభుత్వ హయాంలో ఒక్క బ్రాండ్‌ను కూడా అనుమతించ లేదన్న మాజీ మంత్రి, ఏ బ్రాండ్‌ లిక్కర్‌కు చంద్రబాబు ఎప్పుడు అనుమతించారో చెప్పారు.
    ‘బూమ్‌ బూమ్, ప్రెసిడెంట్‌ మెడల్‌ బ్రాండ్లు జగన్‌వి అన్నారు. కానీ అవి చంద్రబాబే ఇచ్చారు. ప్రెసిడెంట్‌ మెడల్, హైదరాబాద్‌ బ్లూ డీలక్స్‌ బ్రాండ్లకు 2017, నవంబర్‌ 22న అనుమతి ఇచ్చారు. గవర్నర్‌ రిజర్వ్, సెవెన్‌ హెవెన్‌ బ్లూ.. ఇలా 15 బ్రాండ్లకు ఒకేసారి 2018, అక్టోబరు 26న అనుమతి ఇచ్చారు. హైవోల్టేజ్, బ్రిటీష్‌ ఎంపైర్‌ సూపర్‌ స్ట్రాంగ్‌ ప్రీమియం బీర్, వోల్టేజ్‌ గోల్డ్‌ ఇలా కొన్ని బ్రాండ్లకు 2017లో అనుమతి ఇచ్చారు. రాయల్‌ ప్యాలెస్, న్యూకింగ్, సైన్‌ అవుట్‌ విస్కీ బ్రాండ్లకు 2018, నవంబరు 8న అనుమతి ఇచ్చారు. ఇంకా వీర–91 పేరుతో 3 రకాల బీరు బ్రాండ్లను చంద్రబాబు దిగిపోయే కొన్నాళ్ల ముందు, అంటే 2019, మే 14న అనుమతించారు. టీఐ మార్షల్‌ హౌస్, టీఐ కొరియర్, నెపోలియన్‌ విస్కీ బ్రాండ్లకు 2018, మే 15న అనుమతి ఇచ్చారని’.. అంబటి రాంబాబు వివరించారు.
    టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన ఎక్సైజ్‌ పాలసీ పూర్తిగా స్కామ్‌లకు ఆస్కారం ఇచ్చే విధంగా ఉందని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు సిండికేట్‌గా ఏర్పడి వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించడమే లక్ష్యంగా ఉందని మాజీ మంత్రి తేల్చి చెప్పారు.

భారతిగారిపై విష ప్రచారం–మూల్యం తప్పదు:
    దివంగత మహానేత వైయ‌స్ఆర్‌ ప్రారంభించిన సాక్షి పత్రిక మొదట్నుంచి ప్రజల పక్షాన ఉంటూ ప్రజా సమస్యలపై నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని, అలాంటి పత్రిక గొంతు నొక్కాలని అడుగడుగునా కుట్రలు చేస్తున్నారని అంబటి ఆక్షేపించారు. అందులో భాగంగానే ప్రభుత్వ సొమ్మును వైయ‌స్‌ జగన్‌ సతీమణి ఛైర్‌పర్సన్‌గా ఉన్న సాక్షి పత్రికకు దోచిపెట్టారని చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. అయితే సాక్షి పత్రికకు ఆమె ఛైర్‌పర్సన్‌ కారని, ఆ విషయం కూడా తెలియని అజ్ఞానంలో వారున్నారని అన్నారు.
    నారా లోకేశ్‌ ఆదేశాలతో భారతమ్మపై సోషల్‌ మీడియాలో ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో గమనిçస్తున్నామన్న మాజీ మంత్రి, ఇలాగే కొనసాగితే చూస్తూ ఊర్కోబోమని, వారు దానికి తప్పుకుండా మూల్యం చెల్లిం్తచుకోక తప్పదని హెచ్చిరించారు. 

యాడ్స్‌ విషయంలోనూ అసత్యాలు:
    సాక్షి పత్రిక సర్క్యులేషన్‌లో మొదటి రెండు స్థానాల్లో ఉంటుందన్న మాజీ మంత్రి, అలాంటి పత్రిక విషయంలో గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014–19 మధ్య కేటాయించిన ప్రకటనల విలువ రూ.30 కోట్లు మాత్రమే అని చెప్పారు. అదే సమయంలో సాక్షి కన్నా సర్క్యులేషన్‌లో బాగా వెనకబడి ఉన్న ఆంధ్రజ్యోతికి మాత్రం రూ.72 కోట్ల ప్రకటనలిచ్చారని, ఇక ఈనాడుకు ఏకంగా రూ.120 కోట్లు కట్టబెట్టారని చెప్పారు.
    మరోవైపు 2019–24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో ఈనాడుకు మూడున్నర ఏళ్లలోనే రూ.240 కోట్లు కేటాయించగా, రెండో స్థానంలో ఉన్న సాక్షికి ఐదేళ్లలో రూ.320 కోట్ల ప్రకటనలు ఇచ్చారని అంబటి తెలిపారు. తాము ప్రభుత్వ ప్రకటనలు తీసుకోబోమని ఈనాడు చెప్పడం వల్లనే, మూడున్నర ఏళ్ల తర్వాత ఆపేశారని గుర్తు చేశారు. 

సంతాప సభకు అంత ఖర్చా?:
    చంద్రబాబు సీఎం అయ్యాక, తన స్నేహితుడు రామోజీరావు సంతాప సభకు, పత్రికా ప్రకటనల ఖర్చు కాకుండా అక్షరాలా రూ.4,28,1,173 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్న అంబటి రాంబాబు, బ్లీచింగ్‌ పౌడర్‌ కొనడానికి కూడా డబ్బుల్లేవని పవన్‌కళ్యాన్‌ చెప్పినప్పుడు ఇంత విలాసంగా ఎలా ఖర్చు పెట్టగలిగారని ప్రశ్నించారు. 

ఫ్రస్టేషన్‌లో చంద్రబాబు:
    చంద్రబాబు నిత్యం అడ్డగోలు ఆరోపణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన ఫ్రస్టేషన్‌లో కనిపిస్తున్నారని, ఆ ఫ్రస్టేషన్‌లో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కానట్టుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న బోట్లతో ఢీకొట్టి ప్రకాశం బ్యారేజీ కూల్చడానికి ప్రయత్నించామని ఆరోపించారని, నిన్న ఏకంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతున్నారని మరింత దిగజారి మాట్లాడటం ఆయన చేతకానితనానికి నిదర్శనం అన్నారు. 

అది కూల్చి ఆదర్శంగా నిలవండి:
    మంత్రులు నారాయణ, పవన్‌కళ్యాన్‌.. బుడమేరు కాలువను ఆధునికీకరిస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్టు అంబటి రాంబాబు చెప్పారు. అందుకోసం కృష్ణ కరకట్టను ఆక్రమించి కట్టిన నివాసాల కూల్చివేతలతో పనులు మొదలుపెట్టాలని కోరారు. బఫర్‌ జోన్‌లో కట్టిన తాను నివాసం ఉంటున్న ఇల్లును ముందుగా కూల్చి చంద్రబాబు ఆదర్శంగా నిలవాలని సూచించారు.

వారికి రాజకీయ భవిష్యత్తు లేదు:
    అధికారంలో ఉన్నప్పుడు జగన్‌గారి విధానాలు నచ్చిన వారికి, ఓడిపోగానే ఎలా నచ్చకుండా పోయాయని మాజీ మంత్రి ప్రశ్నించారు. నైతిక విలువలు లేనివారే పార్టీలు మారుతున్నారన్న ఆయన, అలాంటి వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు. 2014–19 మధ్య తమ పార్టీ నుంచి 23 మంది ఫిరాయిస్తే, ఆ తర్వాత వారి రాజకీయ భవిష్యత్తు ఏమైందో చూస్తే పరిస్థితి అర్ధమవుతుందని అంబటి రాంబాబు గుర్తు చేశారు.

Back to Top