‘భారీ నష్టం.. పిసరంత సాయం’

వరద సాయం ప్రకటనపై వైయ‌స్ఆర్‌సీపీ ధ్వజం

తుపాన్‌పై సమాచారం ఉన్నా ఎందుకు జాగ్రత్త పడలేదు?

దీనికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకుంటుంది?

విపత్తుకు ఎవరిని బా«ధ్యులను చేస్తుంది? 

దీనిపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు?

మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌ సూటి ప్రశ్న

విజయవాడ వరద బాధితులకు పరిహారం పెంచాలి

సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవాలి

వరద బాధితుల కరెంటు బిల్లులూ రద్దు చేయాలి

వాహనాలకు సంబంధించి బీమా సంస్థలతో మాట్లాడాలి

క్లెయిమ్‌ల పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలి

మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌ డిమాండ్‌

తాడేపల్లి: విజయవాడ నగరాన్ని బుడమేరు వాగు ముంచెత్తుతోందని తెలిసినా ముంపు నుంచి ప్రజలను ఎలాగూ కాపాడలేకపోయారని, వరద పోటెత్తిన తర్వాత బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ దేవినేని అవినాష్‌ ఆక్షేపించారు. వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గం  ఇంఛార్జ్‌ దేవినేని అవినాష్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

    తుపాన్‌ వస్తుందని, కుండపోత వానలు పడతాయని తెలిసి కూడా, ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేదన్న వారు, అసలు ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడలేదని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకుంటుందన్న వారు.. ఎవరిని బా«ధ్యులను చేస్తారని నిలదీశారు. ఇంత జరిగినా దీనిపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని మల్లాది విష్ణు, దేవినేని అవినాష్‌ సూటిగా ప్రశ్నించారు.
    విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం, ఏ మాత్రం సరిపోదన్న వారు, వెంటనే వాటన్నింటినీ పెంచాలని డిమాండ్‌ చేశారు. 9 అడుగుల వరకు వరద ముంచెత్తిన దారుణ పరిస్థితి కనిపించినా, 60 మందికి పైగా అమాయకులు చనిపోయినా కంటి తుడుపుగా వరద సాయం ప్రకటించడం దారుణమన్నారు. 
    50 ఏళ్లలో విజయవాడ చూడని భారీ వరద కారణంగా నగరంలోని 16 డివిజన్ల పరిధిలోని దాదాపు 2.5 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. భారీ వరదలకు లక్షలాది మంది ఇళ్లలోని వస్తువులు, ఎలక్ట్రానిక్‌ సామాగ్రితో పాటు సర్వస్వం కోల్పోయారని పేర్కొన్న ఆయన, ప్రభుత్వం ప్రకటించిన అరకొర సాయంతో వారికి ఎలాంటి మేలు జరగదని స్పష్టం చేశారు.
    గ్రౌండ్‌ ప్లోర్‌కు ప్రకటించిన రూ.25 వేల సాయాన్ని రూ.50 వేలకు పెంచాలని, ఫస్ట్‌ ఫ్లోర్‌కు రూ.10 వేలు సాయం అందించాలని మల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. వరదల కారణంగా దాదాపు 5 వేల మంది ఆటో కార్మికులు జీవనోపాధిని కోల్పోయారని, ఇన్సూరెన్స్‌ కంపెనీలతో మాట్లాడి పాడైపోయిన వాహనాలను ఉచితంగా సర్వీసింగ్‌ చేయించడం లేదా కొత్త వాహనాలు ఇప్పించాలని కోరారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న దాదాపు 10 వేల క్లెయిమ్‌లు తక్షణం పరిష్కరించాలని సూచించారు.
    వరద ప్రాంతాల్లో కరెంట్‌ బిల్లులు రద్దు చేయాలని, బ్యాంకు రుణాలకు మూడు నెలల మారటోరియం ప్రకటించడమే కాకుండా, వారికి రూ.2 లక్షల వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని కోరారు. ఎంఎస్‌ఎంఈలకు తీవ్ర నష్టం జరిగిందన్న మల్లాది.. ప్రింటింగ్, పాడి పరిశ్రమ, చిరు వ్యాపారాలు, ఫర్నీచర్‌ పరిశ్రమలు దెబ్బ తిన్నాయని కాబట్టి, వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    వరద ముంచెత్తి 20 రోజులు గడిచినా ఇప్పటికీ సాధారణ పరిస్థితులు రాలేదని విజయవాడ తూర్పు నియోజకవర్గం వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జ్‌ దేవినేని అవినాష్‌ తెలిపారు. ఆయా ప్రాంతాల్లో బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. విజయవాడ వరద బాధితులకు పార్టీ తరపున రూ.1.10 కోట్ల విలువైన నిత్యావసర సరుకులు అందజేసినట్లు అవినాష్‌ వివరించారు.

Back to Top