ఒంగోలు: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచిలో నాలుగో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక దాడి అత్యంత హేయమన్న మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఆ తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు మరీ దారుణమని చెప్పారు. బాలిక తల్లిదండ్రులు తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని బోరుమంటున్నా, పోలీసుల్లో చలనం లేదని, మంత్రి డోలా స్వామికి భయపడి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆక్షేపించారు. తన సొంత నియోజకవర్గంలో చిన్నారిపై అత్యాచారం జరిగితే పరామర్శించడానికి వెళ్లే ఓపిక మంత్రి డోలా వీరాంజనేయస్వామికి లేదా? అని ప్రశ్నించారు. దారుణ అత్యాచారానికి గురై, ఒంగోలు రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నాలుగో తరగతి విద్యార్థినిని పరామర్శించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం బాలిక తల్లిదండ్రులతో మాట్లాడేందుకు పోలీసులు అనుమతించడంతో, వారిని పరామర్శించిన మాజీ మంత్రి, అక్కడే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు ఏ మాత్రం రక్షణ లేకండా పోయిందన్న మాజీ మంత్రి, అన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన చెందారు. తమ పార్టీ పోరాడితే తప్ప, బాలికపై అత్యాచార కేసు దర్యాప్తునకు, ఎఫ్‌ఐఆర్ నమోదుకు పోలీసులకు మనసు రాలేదని చెప్పారు. రాజకీయ ఒత్తిళ్లతో బాధిత కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తే చూస్తూ ఊర్కోబోమని ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు.