అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి?  

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డి

ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోంది

ఈ కేసులు తప్ప రాష్ట్రంలో సమస్యలే లేవా? చర్చించాల్సి అంశాలే లేవా?

వర్రా రవీంద్రారెడ్డిని కోర్టులో హాజరుపరచాలని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాం

వైయ‌స్ఆర్‌ జిల్లా: ప్రజా సమస్యలు వదిలేసి వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల వెనుక అసలు మర్మమేంటి? అంటూ మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ప్రశ్నించారు. శనివారం ఆయన ప్రొద్దుటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అసలు ప్రభుత్వానికి ప్రజల సమస్యలు కనిపించడం లేదా? అని నిలదీశారు. 

 పోలీసులు అదుపులోకి తీసుకున్న వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని వెంటనే మీడియాకు చూపాలని, ఆ తర్వాత సోమవారం కోర్టులో ప్రవేశపెట్టాలని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే, రవీందర్‌రెడ్డి ప్రాణాలకు హాని కలిగించి, దాన్ని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుని, తమ పార్టీని అప్రతిష్ట పాల్జేసేలా టీడీపీ పథక రచన చేసిందన్న అనుమానం కలుగుతోందని ఆయన వెల్లడించారు. కేవలం సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి, ఆయన ప్రాణాలతో చెలగాటం ఆడటం సరి కాదని చెప్పారు.
    ‘వర్రా రవీందర్‌రెడ్డి ఒక సోషల్‌ మీడియా యాక్టివిస్టా?. లేక అంతర్జాతీయ తీవ్రవాదినా?. ఎల్లో మీడియా ఎందుకు ఆ స్థాయిలో రాస్తోంది? వర్రా రవీందర్‌రెడ్డిని అంత దారుణంగా టార్గెట్‌ చేస్తోంది?
ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పా?’ అని సూటిగా ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే, ఎల్లో మీడియా కథనాలతో ఆందోళన కలుగుతోందని, ఆయన ప్రాణాలకు హానిపై అనుమానం వస్తోందని చెప్పారు. ప్రభుత్వం, పోలీసులు దీనిపై స్పందించాలని కోరారు.
    ఒక పథకం ప్రకారం రాష్ట్రంలో వైయస్సార్‌సీపీపై దుష్ప్రచారం సాగుతోందన్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి.. బిటెక్‌ రవి వల్ల.. వర్రా రవీందర్‌రెడ్డికి ప్రాణహాని ఉందని.. అందుకే బిటెక్‌ రవి ఒక వీడియో రిలీజ్‌ చేసి, దాన్ని వైయస్సార్‌సీపీపైకి నెట్టే ప్రయత్నం చేశారని, ఇదంతా ఒక పక్కా వ్యూహంలో భాగమన్న అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.
    రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, ప్రజలకు ఎక్కడా స్వేచ్ఛ లేదని, అంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారని తెలిపారు. ఎక్కడికక్కడ వైయస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారన్న రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఈ వ్యవహారంలో అందరు న్యాయమూర్తులు జోక్యం చేసుకోవాలని వేడుకున్నారు.

Back to Top