గుంటూరు: ‘‘దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి సతీమణి, విషాదాన్ని కూడా దిగమింగి తన భర్త మరణాంతరం అనేక అవమానాలను ఎదురొడ్డి.. తన కుమారుడిని ఇంతటి గొప్ప ముఖ్యమంత్రిగా తీర్చిదిద్దేందుకు వైయస్ విజయమ్మ నిర్వర్తించిన భూమిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు.. భారతదేశంలో వైయస్ విజయమ్మ పాత్ర మరువలేనిది’’ అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. స్పీకర్ రాజకీయ సభలకు హాజరయ్యారని రాసిన ఈనాడు రామోజీరావుకు.. గత మహానాడుకు కోడెల శివప్రసాద్ హాజరై మాట్లాడిన మాటలు వినపడలేదా.. కనబడలేదా..? అని ప్రశ్నించారు. తాను వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడైన తరువాతే ఎమ్మెల్యే, స్పీకర్ అయ్యానని చెప్పారు. ప్లీనరీ రెండోరోజు సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. ‘మన అధికార ప్రయాణం మూడో సంవత్సరం దాటి నాల్గవ ఏట అడుగుపెట్టాం. మనం మూడేళ్లలో సాధించిన విజయాలు అంతాఇంతా కాదు. మన శత్రువులపై వ్యూహాత్మకమైన దాడులు నిర్వహించాలి. లేకపోతే ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏనాడైనా ప్రతిపక్షాలు ప్రజల కోసం ఆలోచించారా.. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించారా..? కదనరంగంలో అడుగుపెట్టాం.. సమరానికి సిద్ధం అవుతున్నాం. ఈ సమయంలో మనం కచ్చితమైన ఉత్సాహభరితంగా ముందుకుసాగాలి. 2024లో మళ్లీ విజయాన్ని సాధించడమే మనముందున్న లక్ష్యం.. ఆ లక్ష్యంవైపు సాగేందుకు సీఎం వైయస్ జగన్ సంక్షేమం, అభివృద్ధి అనే ఆయుధాలు ఇచ్చారు. స్పీకర్ ప్లీనరీకి వచ్చారు.. రాజకీయ సమావేశంలో పాల్గొంటున్నారని ఈనాడులో రాశారు. రామోజీరావు నేను అడుగుతున్నా.. గడిచిన మహానాడులో ఆనాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ మాట్లాడింది మీరు వినలేదా..? మీకు చెవులు వినిపించవా..? మీకు కళ్లు కనిపించవా..? ఆనాడు ఎందుకు రాశారు. ప్రభుత్వం చేసిన మంచిని ఏనాడైనా రాశారా..? ఇది సరైన పద్ధతి కాదు. సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పత్రికలకు చెబుతున్నా.. నేను బేసిక్‌గా వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుడిని, ఆ తరువాతే మా నాయకుడు ఆదేశం మేరకు శాసనసభ్యుడిగా, శాసనసభాపతిగా ఎన్నికయ్యాను. ఎస్.. ఇప్పటికీ చెబుతున్నాను.. నేను వైయస్‌ఆర్ సీపీ ప్రాథమిక సభ్యుడిని, తరువాతే శాసనసభ్యుడిని, శాసనసభాపతిని అని గర్వంగా చెబుతున్నాను. ప్రజల కోసం అమలవుతున్న అనేక సంక్షేమ పథకాల గురించి ఎల్లో మీడియా ఎందుకు రాయడం లేదు. విద్య, వైద్యం, సంక్షేమం, అభివృద్థి రంగాల్లో ప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. పేదరికం విద్యా, వైద్యానికి, సేద్యానికి అడ్డంకి కాకూడదని, అభివృద్ధి పల్లెలకు చేరాలని ఇంత ప్రయత్నం చేస్తుంటే కనిపించడం లేదా..? పచ్చపత్రికలు కావు అవి.. పక్షపాత పత్రికలు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఈ పక్షపాత పత్రికలకు తెలియదు. గడప గడపకూ తిరుగుతున్న మాకు తెలుసు ప్రజల మనసు. 75 ఏళ్ల వృద్ధురాలు.. సీఎం వైయస్ జగన్ నాయకత్వాన్ని మెచ్చుకుంటుంది. రేపు రాబోయేది సీఎం వైయస్ జగన్ సానుకూల ఓట్లతో 175 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతున్నాం. ప్రతిపక్షాలన్నీ భూస్థాపితం అవుతాయి. ధర్మాన్ని కాపాడుతున్న సీఎం వైయస్ జగన్‌ను.. ఆ ధర్మమే కాపాడుతుంది. ఈ రాష్ట్రానికి మళ్లీ కాబోయే ముఖ్యమంత్రి వైయస్ జగనే. మీరు గెలిచి తీరాలి. లేకపోతే సంస్కరణలు, వికేంద్రీకరణలు ఆగిపోతాయి. అసమానత్వం తొలగాలి.. పేదరికం పోవాలి.. ఇది జరగాలంటే మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పాలించి.. ప్రజలను కాపాడటం కోసం గెలవాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను మనం ప్రజల వద్దకు తీసుకెళ్లాలి. గడప గడపకూ కార్యక్రమాన్ని పూర్తిచేయాలి.