రాప్తాడు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. రోజూ ఏదో ఒక గ్రామంలో దాడులకు పాల్పడుతున్నారు. గత నెల 30న రాప్తాడు మండలం వరిమడుగు గ్రామంలో వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులపై దాడి చేసిన ఘటన మరువకముందే తాజాగా ఆదివారం రాత్రి భోగినేపల్లిలో ఇద్దరు మహిళలపై అతి కిరాతకంగా దాడి చేశారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. నాలుగేళ్ల క్రితం గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త ఎలగొండ నాగమ్మ, అదే గ్రామానికి చెందిన కరె వెంకటేష్ ఇళ్ల దగ్గర స్థలం విషయంపై గొడవ జరిగింది. ఈ విషయంలో గతంలోనే కరె వెంకటేష్, అతని కుమారుడు, ప్రస్తుత ఫీల్డ్ అసిస్టెంట్ కరె ప్రసాద్‌లు ఎలగొండ నాగమ్మపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా తనపై నాగమ్మ దాడి చేసిందంటూ కరె వెంకటేష్ భార్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో ఇరు వర్గాల ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత ప్రభుత్వం ద్వారా పక్కా గృహం మంజూరు కావడంతో నాగమ్మ ఆ స్థలంలో ఇంటిని నిర్మించుకుంది. అయితే.. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ స్థలం తమదంటూ కరె వెంకటేష్ కుటుంబ సభ్యులు రోజూ నాగమ్మతో గొడవ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి తండ్రీకొడుకులిద్దరూ మద్యం తాగొచ్చి గొడవకు దిగారు. ఇనుప రాడ్లు, కొడవళ్లు, కట్టెలు తీసుకుని నాగమ్మ ఇంటి అద్దాలు, కిటికీలను, ఇంటి వెనుక ఉన్న బండలను ధ్వంసం చేశారు. అడ్డుపడిన నాగమ్మ, ఆమె అక్క కుమార్తె కోలా లక్ష్మీనారాయణమ్మలపై దాడి చేశారు. ‘ఇప్పుడున్నది మా ప్రభుత్వం. మీకు దిక్కెవరు?’ అంటూ బెదిరింపులకు దిగారు. తీవ్రంగా గాయపడిన మహిళలను స్థానికులు 108లో అనంతపురం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితీ విషమంగా ఉంది. గ్రామస్తులు అడ్డుకోకుంటే ఇద్దరు మహిళలనూ టీడీపీ నాయకులు అక్కడే చంపేసేవారని స్థానికులు చెప్పారు. టీడీపీ నేతల వేధింపులతో వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చింతలపూడి: టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేక ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎండపల్లిలో వైయస్ఆర్‌సీపీ నాయకుడు మోరంపూడి శ్రీనివాసరావు ఆదివారం గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశారు. ఎస్‌ఐ కుటుంబరావు నచ్చచెప్పి కిందకు దించారు. బాధితుడు తెలిపిన మేరకు.. మూడేళ్ల కిందట బహిరంగవేలంలో పంచాయతీకి చెందిన 28 ఎకరాల తుమ్మలచెరువులో చేపలు పెంచుకునే హక్కును ఆయన దక్కించుకుని చేపపిల్లల్ని వదిలారు. ప్రస్తుతం చెరువులో రూ.20 లక్షలకుపైగా విలువైన చేపలున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆంధ్ర కాలువ మరమ్మతుల్లో పూడికతీసిన మట్టిని ఈ చెరువుకు వెళ్లే రోడ్డుపై పోశారు. తరువాత వర్షాలతో రోడ్డు అధ్వానంగా మారి, చేపలు పట్టి తరలించేందుకు వీల్లేకపోయింది. దీంతో తాను నష్టపోతున్నానని, లీజును మరో ఏడాది పొడిగించాలని శ్రీనివాసరావు పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నారు. లీజు గడువు పెంచుతూ పంచాయతీ తీర్మానం చేసి నీటిపారుదలశాఖ అధికారులకు పంపింది. చెరువుకు ఎలాగైనా వేలం నిర్వహించాలని టీడీపీ నేతలు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఒత్తిడితో అధికారులు చేపల చెరువుకు వేలం వేస్తారేమోనని ఆత్మహత్యకు ప్రయత్నించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం కోసం పనిచేశాననే తెలుగుదేశం నాయకులు కక్షగట్టి తనను వేధిస్తున్నారని, బెదిరిస్తున్నారని శ్రీనివాసరావు చెప్పారు. ఈ విషయమై టీడీపీకి చెందిన గుత్తా వెంకులు, నల్లమోతు వాసు, దుర్గాప్రసాద్ (పండు), గుత్తా వెంకటేశ్వరరావు, గోళ్ల గాందీ, కొమ్మినేని నాగబాబు తదితరులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారి, నీటిపారుదలశాఖ అధికారులు తనకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.