తాడేపల్లి: రైతులకు 9 గంటల విద్యుత్ పగటి పూటే ఇవ్వాలని అధికారంలోకి రాగానే నిర్ణయించామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ ప్రాంతానికి నాణ్యమైన విద్యుత్ అందివ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ ప్రారంభించిన సబ్‌స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని సీఎం అన్నారు. ఒకేసారి 28 సబ్ స్టేషన్లకు ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ట్రాన్స్‌కో) శ్రీకారం చుట్టామన్నారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో 16 సబ్‌స్టేషన్ల శంకుస్థాపన, 12 సబ్‌స్టేషన్ల ప్రారంభోత్సవాలు చేశారు. రూ.3,100 కోట్ల వ్యయంతో కర్నూలు, నంద్యాల, వైయస్ఆర్ కడప, సత్యసాయి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలోని 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్‌గా మాట్లాడారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతుంది. 14 జిల్లాల్లో విద్యుత్ పంపిణీ సామర్ధ్యాన్ని పెంచుతూ... దాదాపుగా 28 సబ్ స్టేషన్లలో కొన్నింటిని ప్రారంభించాం, కొన్నింటికి శంకుస్ధాపనలు చేస్తున్నాం. సుమారు రూ.3099 కోట్ల పెట్టుబడులతో మంచి కార్యక్రమం జరుగుతుంది. ఇటీవల గోదావరి ముంపునకు గురైన చింతూరు, వీఆర్‌పురం, కూనవరం,ఎటపాక తదితర విలీన మండలాల్లో తిరిగినప్పుడు సబ్‌స్టేషన్లు లేకపోవడంవల్ల ఇబ్బందులు వస్తున్నాయని అక్కడి ప్రజలు చెప్పారు. ఆ సమస్యను పరిష్కరిస్తూ.. అక్కడ సబ్‌స్టేషన్లను నిర్మించడంతో పాటు... ఇవాళ వాటిని ప్రారంభిస్తూ అక్కడి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఇవాళ రూ.620 కోట్లతో 12 సబ్‌స్టేషన్లను ప్రారంభిస్తున్నాం. రూ.2479 కోట్లతో మరో16 సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేస్తున్నాం. ఒకవైపున ట్రాన్స్‌మిషన్ కెపాసిటీని విస్తరించుకుంటూ, నాణ్యమైన విద్యుత్‌ను ప్రతి గ్రామానికి, ప్రతిరైతుకు ఇచ్చే పరిస్థితిని, వ్యవస్థను క్రియేట్ చేస్తున్నాం. రైతులకు 9 గంటలపాటు పగటిపూటే ఉచిత విద్యుత్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే విద్యుత్ పంపిణీ వ్యవస్థ బలోపేతానికి శ్రీకారం చుట్టాం. ఇది చేయాలంటే కెపాసిటీ సరిపోదు, ట్రాన్స్‌మిషన్ కెపాసిటీ అభివృద్ధి చేయాలన్నారు. ఆ తర్వాత రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ పగటి పూట ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అని అధికారులు చెప్పారు. దీనికోసం రూ.1700 కోట్లతో ఫీడర్లను ఏర్పాటుచేసి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను పగటిపూటే ఇస్తున్నాం. దీంతోపాటు రైతులకు ఉచిత విద్యుత్‌ను స్థిరంగా ఇవ్వడానికి రూ.2.49లకే యూనిట్ ధరతో సోలార్ పవర్‌ను ఆంధ్రరాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప అడుగు పడింది. దాదాపు 17వేల మిలియన్ యూనిట్లకు సెకీతో ఒప్పందం చేసుకున్నాం. వ్యవసాయ విద్యుత్‌కు కావాల్సిన 13వేల మిలియన్ యూనిట్లు పగటిపూటే...మరో 25 సంవత్సరాలపాటు రూ.2.49లకే అందుబాటులో ఉండేలా రైతులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. ఇవాళ యూనిట్ సగటు ధర రూ.5.30లు పడుతున్న పరిస్థితుల నుంచి రూ.2.49లకే యూనిట్ ధర వచ్చే పరిస్థితుల్లోకి అడుగులు వేస్తున్నాం. దీనివల్ల సెప్టెంబరు 2024కు 3వేల మెగావాట్లు, సెప్టెంబరు 2025 నాటికి మరో 3వేల మెగావాట్లు, సెప్టెంబరు 2026 నాటికి మరో 1000 మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. ఇవి ఒకవైపు జరుగుతుంటే... ఇవాళ దాదాపుగా రూ.3099 కోట్లు సబ్‌స్టేషన్లకోసం ఖర్చుచేస్తున్నాం. వీటిలో కొన్ని సబ్‌స్టేషన్లును ప్రారంభించాం. మరికొన్నింటి పనులు ప్రారంభిస్తున్నాం. రెండోవైపు మరో రూ. 3400 కోట్లతో దాదాపుగా 850 మెగావాట్ల సోలార్ పవర్‌కు శ్రీకారం చుడుతున్నాం. ఇవాళ వాటికి కూడా శంకుస్ధాపన చేసుకున్నాం. వీటిన్నింటికోసం దాదాపుగా రూ. 6500 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. మరోవైపు అవేరా స్కూటర్స్ తయారీ సంస్థకు శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటికే 25వేల స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభించి విజయవాడలో నిర్వహిస్తోంది. ఈ ప్రాజెక్టు కూడా లక్ష స్కూటర్ల ఉత్పత్తి దిశగా సామర్థ్యాన్ని పెంచుకుంటుంది. దీనికి సంబంధించి రూ.100 కోట్లతో విస్తరణ ప్రాజెక్టుకు కూడా ఇవాళ శంకుస్ధాపన చేసుకుంటున్నాం. ఈ కంపెనీలో 100 మందికి ఇప్పటికే ఉద్యోగాలు ఉన్నాయి. తాజా పెట్టుబడి వల్ల అదనపు ఉద్యోగాలు మరో 200 వస్తాయి. కొత్తగా వస్తున్న ఈ 28 సబ్ స్టేషన్లలో 200 మందికి ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. ఇవాళ శంకుస్ధాపన చేసుకున్న 850 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల వల్ల 1700 ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవికాక హెచ్‌పీసీఎల్‌తో మరో రూ.10 వేల కోట్ల పెట్టుబడికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాం. హెచ్‌పీసీఎల్‌తో 500 మెగావాట్లు సోలార్ ప్లాంట్, మరో 500 మెగావాట్ల పవన విద్యుత్, 250 మెగావాట్ల పీఎస్‌పీ, గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ (100 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్)తో కలిపి రూ.10వేల కోట్లకు సంబంధించిన ఎంఓయూ కుదుర్చుకున్నాం. దీనివల్ల దాదాపుగా మరో 1500 మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో వేగంగా అడుగులు ముందుకు పడి మరిన్ని ఉద్యోగఅవకాశాలతో పాటు రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ సామర్ధ్యం మెరుగుపడుతుంది. వీటన్నింటివల్లా కాలుష్యరహిత క్లీన్ ఎనర్జీ అందుబాటులోకి వచ్చి, రాష్ట్ర ప్రగతిని మరింత పెంచే పరిస్థితి రావాలని మనసారా కోరుకుంటున్నాను. పలు విద్యుత్ ప్రాజెక్టులను ఈరోజు ఇక్కడి నుంచి ప్రారంభిస్తూ.. ఈ రంగంలో మరింత అభివృద్ధి సాధించే దిశలో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వర్చువల్‌గా పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేవుడి దయ వలన మీ అందరికీ మంచి జరగాలని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే పరిస్థితులు రావాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.