బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించండి

కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫెరెన్స్‌

ప్రతి ఒక్కరి నోటా.. ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్‌ బాగా చేశాడన్న మాట వినిపించాలి

పంటపొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి

యుద్ధ ప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలి

బాధితుల్లో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు

 తుపాను ప్రభావం, చేపడుతున్న సహాయచర్యలపై సీఎంకి వివరాలు అందించిన అధికారులు 

తాడేపల్లి: ఏపీలో తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్బంగా తుపాను ఎఫెక్ట్, పునరావాస చర్యలు, నష్టం అంచనాలు తదితర అంశాలపై సీఎం జగన్‌ చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే....:
వర్షాల నుంచి తెరిపి వచ్చింది. ప్రస్తుతం తుపాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. తుపాను వల్ల వర్షాలు విస్తృతంగా పడ్డాయి. కలెక్టర్లు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు స్పెషల్‌ ఆఫీసర్లుగా క్షేత్రస్ధాయిలో మంచిగా పనిచేశారు. అధికారులంతా మీ ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలి.  చిన్న చిన్న విషయాల మీద ధ్యాస మిస్‌ కాకుండా చూసుకోవాలి. బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించండి. బాధితుల స్ధానంలో మనం ఉంటే ఎలాంటి సహాయాన్ని ఆశిస్తామో.. ఆ తరహా సాయం వారికి అందాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. రూ.10 ఎక్కువ ఖర్చు అయినా.. బాధితులకు మంచి సహాయం అందాలి. ఆ దిశగా పనిచేయాలి. ప్రతి ఒక్కరి నోటా.. ఇంత కష్టంలో కూడా మా కలెక్టర్‌ బాగా చేశాడన్న మాట వినిపించాలి. వారి పట్ల ఉదారంగా వ్యవహరించాలి. పరిహారం అందించడంలో సానుభూతితో ఉండండి.

 సాయంలో లోటు రాకూడదు...
వర్షాల వల్ల ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ.10వేలు ఇచ్చే విషయంలోనూ, వర్షాలు కారణంగా ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల వారిని క్యాంపులకు తీసుకొచ్చి వారిని చూసుకునే విషయంలోనూ, క్యాంపుల నుంచి తిరిగి ఇళ్లకు వెళ్లున్న సందర్భంలోనూ వారికి ఇవ్వాల్సిన సహాయం వారికి ఇవ్వాలి. రేషన్‌ పంపిణీలో కూడా ఎలాంటి లోపం ఉండకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. 
 
 పొలాల్లో నీటి తొలిగింపు– అత్యంత ప్రాధాన్యాంశం
పంటపొలాల్లో ఉన్న వరదనీటిని పూర్తిగా తొలగించడంపై దృష్టి పెట్టాలి. అన్ని రకాల మానవ వనరులను దీనిపై పెట్టండి. ధ్యాసంతా ఇక్కడే పెట్టాలి. ఇది అత్యంత ప్రాధాన్య అంశం. పంటల సంరక్షణకు ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఎస్‌ఓపీ ఇప్పటికే జారీ చేశారు. 

ప్రతి అడుగులోనూ రైతుకు అండగా..
రైతులకు కచ్చితమైన భరోసా ఇవ్వండి. ప్రభుత్వం ప్రతి రైతుకు అండగా నిలబడుతుంది. వారు అధైర్య పడాల్సిన పనిలేదు. పంటల రక్షణ, పంటలకు పరిహారం అందించడం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం దగ్గర నుంచి అన్ని రకాలుగా రైతుకు ప్రతి అడుగులోనూ తోడుగా ప్రభుత్వం ఉంటుంది. 80శాతం సబ్సిడీపై విత్తనాల సరఫరాకూ అన్ని రకాలుగా సిద్ధం కావాలి. 

 యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు...
యుద్ధ ప్రాతిపదికన అత్యధిక ప్రాధాన్యతతో విద్యుత్‌ను పునరుద్ధరించాలి. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రవాణా పునరుద్ధరణకు వెంటనే చర్యలు తీసుకొండి. వీటిని కూడా ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమంగా తీసుకొండి. వర్షాలు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై కూడా దృష్టి పెట్టండి. అధికారులంతా బాగానే పనిచేస్తున్నారు. 

 మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఒక్క ఫోన్‌ కాల్‌ దూరంలో ఉన్నాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి. దురదృష్టవశాత్తూ విధి నిర్వహణలో ఉండగా చెట్టుకూలి కానిస్టేబుల్‌ చనిపోయాడు. ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆ కుటుంబానికి రూ.30 లక్షలు సాయం అందిస్తాం. విధినిర్వహణలో ఉన్న ఉద్యోగుల స్ధైర్యం నిలబడేలా ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది.

 ఉద్యోగుల స్ధైర్యం నిలబడేలా...
గ్రామాల్లో ఉన్న వాలంటీర్‌ దగ్గర నుంచి, సచివాలయ సిబ్బంది మొదలుకుని, ప్రభుత్వంలో పై స్ధాయిలో ఉన్న ఉద్యోగి వరకు ఎలాంటి ఇబ్బంది జరిగినా.. ప్రభుత్వం అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. వారిలో ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని సీఎం స్పష్టం చేశారు.

Back to Top