అమరావతి: ఏపీ శాసన మండలిలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. మదనపల్లి ఆర్డీవో ఆఫీసులో అగ్ని ప్రమాదం ఘటన పై మంత్రి సత్య ప్రసాద్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ను ప్రస్తావించడంపై వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విచారణ లో ఉన్నప్పుడు పేర్లు ఎలా చెప్తారని నిలదీశారు. విచారణలో తేలాక మాట్లాడండి అంటూ హితవు పలికారు. ప్రతి ఒక్కరి మీద బురద చల్లడం ఏంటని ధ్వజమెత్తారు. రికార్డుల నుండి పెద్దిరెడ్డి పేరు ను తొలగించాలని బొత్స డిమాండు చేశారు. నష్టపోయిన రైతులందరికీ ఆదుకోవాలి వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతీ రైతును ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు డిమాండు చేశారు. గతంలో రైతులకు సమయానికి నష్టపరిహారం అందేదని, వైయస్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఎప్పుడు నష్టపోతే అదే సీజన్‌లో అందించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో నష్ట పరిహారం ఇవ్వడం లేదని, ఇటీవల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం అందరికి ఇవ్వలేదన్నారు. నష్టం అంచనా కూడా భారీగా తగ్గించి రైతులకు నష్టం చేశారని పేర్కొన్నారు.