నిబంధనలకు లోబడే అమరావతికి అప్పులు

ఎంపీ గురుమూర్తి ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి స‌మాధానం

ఢిల్లీ: ఏపీ నూతన రాజధాని అమ‌రావ‌తి నిర్మాణానికి ష‌ర‌తులు, నిబంధ‌న‌ల‌కు లోబ‌డే అప్పులు ఇస్తున్నామ‌ని  కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్ప‌ష్టం చేశారు. రాజ‌ధాని నిధుల అంశంపై లోక్ సభలో వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇవాళ‌ సమాధానం ఇచ్చారు. అప్పుల కింద తెచ్చిన నిధుల వినియోగంపై ప్రత్యేక పర్యవేక్షణ యంత్రాంగం ఉండాల‌ని కేంద్ర మంత్రి సూచించారు. ఏపీ రాజధాని నిర్మాణం కోసం రూ.2500 కోట్ల గ్రాంట్ ఇప్పటికే ఇచ్చామ‌ని, వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రూ.6,700 కోట్ల అప్పులు ఇప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంద‌న్నారు. ఈ అప్పుల తో అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంద‌ని వెల్ల‌డించారు.  జనవరి 22, 2025 నుంచి వరల్డ్ బ్యాంక్ అప్పులు, ఫిబ్రవరి 10 , 2025 నుంచి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పులు అమల్లోకి వస్తాయ‌న్నారు. ఈ అప్పుల కింద ఇప్పటివరకు ఇంకా నిధులు విడుదల కాలేద‌ని, రాజధాని మొత్తం ప్రాజెక్టు ఖర్చులో రూ.1500 కోట్లు మించకుండా  10 శాతం కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ గా ఇస్తుంద‌ని తెలిపారు. ఏపీ అప్పుల సీలింగ్ పరిధిలోకి రాజధాని అప్పుల వ్యయం రాద‌ని, నిర్ణీత నిబంధనలు, షరతులకు లోబడి  అప్పుల కింద తెచ్చిన నిధుల వినియోగం జరగాల‌ని కేంద్ర మంత్రి పంకజ్ చౌద‌రి రాష్ట్రానికి సూచించారు.
 

Back to Top