మెడికల్‌ సీట్లపై నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి

మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి డిమాండ్‌

పులివెందుల కాలేజీలో వెంటనే 50 సీట్లు కోరాలి

ఎన్‌ఎంసీకి రాసిన లేఖను వెనక్కు తీసుకోవాలి

కొత్తగా ఎంబీబీఎస్‌ సీట్లు నీట్‌ అభ్యర్థులకు వరం

పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్ష చేయొద్దు

ఎన్నికల్లో చెప్పినదానికి భిన్నంగా చంద్రబాబు పాలన

ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా నిర్వీర్యం చేశారు

కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది

ప్రెస్‌మీట్‌లో డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి స్పష్టీకరణ

అనపర్తి: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడంతో పాటు, ఒకేసారి 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి, అందులో గత ఏడాది అయిదు కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత గత ప్రభుత్వ హయాంలో సీఎం  వైయస్‌ జగన్‌ది అని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి వెల్లడించారు. మళ్లీ వైయ‌స్ జగన్‌గారు సీఎం అయి ఉంటే, ఈ ఏడాది కూడా మరో 5 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వచ్చి ఉండేవని, కానీ కూటమి ప్రభుత్వ నిర్వాకం వల్ల అది జరగలేదని ఆయన ఆక్షేపించారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడారు.

 పులివెందుల మెడికల్‌ కాలేజీకి ఈ ఏడాది 50 ఎంబీబీఎస్‌ సీట్లు అనుమతి ఇస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) వెల్లడిస్తే, అవి వద్దంటూ ప్రభుత్వం లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం జగన్‌గారికి మంచిపేరు వస్తుందన్న అక్కసుతోనే చంద్రబాబు ఈ పని చేశారని దుయ్యబట్టారు. 
    నిజానికి అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలోనూ అధికార కూటమిలో ఉన్నందు వల్ల ఎంబీబీఎ‹స్‌ సీట్లు ఇంకా పెంచుకోవాలి తప్ప, మంజూరైన సీట్లు వద్దనడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఇది కచ్చితంగా పేద విద్యార్థులను వైద్యవిద్యకు దూరం చేయడమేనని అన్నారు. కొత్తగా వచ్చే ఎంబీబీఎస్‌ సీట్లు, నీట్‌ అభ్యర్థులకు వరమని పేర్కొన్న ఆయన, ఈ విషయంలోనే చంద్రబాబు అసమర్థత బయటపడిందని చెప్పారు. ఎన్నో అసత్యాలు ప్రచారం చేసి, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి ప్రభుత్వం మూడు నెలలకే వాటిని అమలు చేయలేక చేతులెత్తేసిందని ఆక్షేపించారు.
    ఇప్పటికే ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని, మరోవైపు పీహెచ్‌సీల్లోనూ వైద్య సేవలందడం లేదని డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి గుర్తు చేశారు. ఇన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వంపై మూడు నెలల్లోనే తీవ్ర వ్యతిరేకత మొదలైందని ఆయన చెప్పారు.

Back to Top