తాడేపల్లి: బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ అన్నట్టుగా పరిస్థితి మారిందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు చెప్పారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర అప్పులపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారన్నారు. 30 వేల మంది మహిళలను అక్రమ రవాణా చేశారని పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని.. మహిళల అక్రమ రవాణా పచ్చి అబద్ధమని అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతలే ఒప్పుకున్నారన్నారు. గురువారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. – తాను మళ్లీ 1995 నాటి సీఎంగా మారిపోయాను అనే మాట చంద్రబాబు చెబుతున్నారు. అది నిజమే. ఎందుకంటే ఇక్కడేదో గొప్ప పరిపాలన సాగుతున్నట్టు అసెంబ్లీలో కలరింగ్ ఇస్తున్నారు. అబద్ధాలను పదే పదే చెప్పి, నిజాలని నమ్మించాలని అసెంబ్లీలో ప్రయత్నం చేస్తున్నారు. కేవలం అబద్ధాల పునాదుల మీదనే ఈ ప్రభుత్వం ఆధారపడి ఉందనిపిస్తోంది. – జరగనిది జరిగినట్టు చూపించి లబ్ధి పొందాలని కూటమి నేతలు ప్రయత్నించినట్లు, అసెంబ్లీ సాక్షిగా, స్వయంగా వారిచ్చిన సమాధానాలతో రుజువైంది. తేటతెల్లమైన పచ్చి అబద్ధాలివి: – రాష్ట్ర రుణం రూ.6.46 లక్షల కోట్లు అని బడ్జెట్ లెక్కల్లోనే చూపడం, దాన్ని కాగ్ కూడా ధృవీకరించడం.. రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లు అంటూ ఇన్నాళ్లూ వారు చేసిన దుష్ప్రచారం తప్పని రుజువైంది. – రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు మిస్సయ్యారు. నాకు కేంద్ర నిఘా వర్గాల సమాచారం ఉంది. అమ్మాయిల తరలింపులో వలంటీర్లదే కీలకపాత్ర అని ఎన్నికల ముందు పవన్‌కళ్యాన్ ప్రచారం చేశారు. దానికి చంద్రబాబు, లోకేష్ వంత పాడారు. – కానీ అదంతా పచ్చి అబద్ధమని కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్‌లో మిస్సయ్యారని, దానికి సంబంధించి 36 కేసులు నమోదయ్యాయని అసెంబ్లీలో మంత్రులే సమాధానం ఇచ్చారు. – రాష్ట్రంలో భవనాలకు వైయస్సార్సీపీ రంగులు వేయడానికి రూ.3 వేల కోట్లు ఖర్చు చేశారని ఆరోజు చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. అందుకు రూ.2300 కోట్లు ఖర్చు చేశారని పవన్‌కళ్యాణ్ కూడా ప్రచారం చేశారు. – కానీ ఇప్పుడు అదే పవన్‌కళ్యాణ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సభలో చెప్పిన సమాధానం. రంగులు వేయడానికి, తీయడానికి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.101 కోట్లు. అంటే ఆనాడు వారు చెప్పిందంతా అబద్ధపు ప్రచారమేనని తేలిపోయింది. – రుషికొండలో టూరిజం శాఖ ద్వారా ఐకానిక్ భవనాలను నిర్మిస్తుంటే వైఎస్ జగన్ సొంతానికి భవనాలు కట్టుకుంటున్నారని, పర్యావరణ శాఖ అనుమతులు లేవని తప్పుడు ప్రచారం చేశారు. రుషికొండ భవనాలు అన్ని అనుమతులతోనే నిర్మించారని సభలో ఆ శాఖ మంత్రి స్వయంగా ప్రకటించారు. దీంతో కూటమి మరో పచ్చి అబద్ధం తేటతెల్లమైంది. – వాలంటీర్ వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఎన్నికల ముందు మాట్లాడిన చంద్రబాబు, పవన్‌కళ్యాన్.. తీరా ఎన్నికల ప్రచారం వచ్చేసరికి ఓట్ల కోసం మాట మార్చి వాలంటీర్లను కొనసాగిస్తామని, వారిని తొలగించబోమని.. పైగా వారి గౌరవ వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. – కానీ ఇప్పుడు వాలంటీర్లను కొనసాగించేది లేదని సభలోనే ప్రకటించారు. పైగా, గత ఏడాది ఆగస్టు నుంచే వారు సర్వీసులో లేరని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చేవరకు గ్రామాల్లో వలంటీర్లు పనిచేసిన మాట వాస్తవమా? కాదా?. వారికి మార్చి వరకు గౌరవ వేతనాలు ఇచ్చింది నిజం కాదా?. అయినా పచ్చి అబద్ధాలు. – అసలు వాలంటీర్లు వ్యవస్థలోనే లేనప్పుడు, వారు న్యూస్ పేపర్లు కొనడానికి రూ.200 చొప్పున ఇస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ రద్దు చేయాలని ఈ ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకుంది!. – అమల్లో లేని ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పుకుంటున్నారు. ఇంతకన్నా పచ్చి అబద్ధం ఇంకోటి ఉండదు. నాడు వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే జగన్ భూములన్నీ లాక్కుంటాడని, సర్వే చేయడమే నేరమని ప్రచారం చేశారు. ఇప్పుడు ఎక్కడైనా సర్వే ఆగిందా?. – స్మార్ట్ మీటర్లు బిగిస్తుంటే ఉరితాళ్లని చెప్పారు. ఇప్పుడు అదో గొప్ప నిర్ణయమన్నట్టు ప్రచారం చేసుకుంటున్నారు. ఈరోజు అవన్నీ పసుపు తాళ్లు అయ్యాయా?. ప్రతి ఇంటికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రీపెయిడ్ చేస్తున్నారు. – చెత్త పన్ను రద్దు చేశామని చెబుతున్నారు. అసలు ఆ పన్ను వేసిందెవరు? వచ్చే అక్టోబర్ దాకా ఆ చెత్త తీయరట? అప్పటిదాకా ఆ చెత్త పేరుకుని ఉండాలా?. ఇసుక. మద్యం మాఫియాలు: – మా ప్రభుత్వంలో లారీ ఇసుక రూ.16 వేలకు అందితే, ఈరోజు ఉచిత ఇసుక పేరు చెప్పి రూ.26 వేలకు అమ్ముకుంటున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యం ఉంటుందా? కూటమి నాయకులు అడ్దూ అదుపూ లేకుండా ఎలా దోచుకుంటున్నారో వారి కరపత్రంలా ఉన్న ఈనాడు లోనే రాస్తున్నారు. అయినా వీరు మాత్రం ఆహా ఓహో అని చెప్పుకుంటారు. గ్రామాల్లో పనుల్లేక కార్మికులు అలమటిస్తున్నారు. – లిక్కర్ వ్యవస్థది మరో ఘోరం. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ఒక్కో గ్రామంలో ఆరేడు బెల్ట్ షాపులు నడుస్తున్నాయి. ధరలు తగ్గిస్తామన్నారు. ఒక్క బ్రాండ్ ధర కూడా తగ్గలేదు. ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువకే కొనాల్సిన దుస్ధితి. లిక్కర్ పాలసీలో ప్రభుత్వం దారుణంగా ఫైయిలైంది. ఆర్నెళ్లు తిరక్కుండానే ప్రభుత్వ మోసం మందు బాబులకు కూడా అర్థమైపోయింది. ధరల మంట: – నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయని ఆనాడు మా ప్రభుత్వంపై అదే పనిగా దుష్ప్రచారం చేశారు. అదే ఇప్పుడు కూటమి పాలనలో ఉప్పు, పప్పు, చింతపండు, నూనెలు, ఉల్లి.. ఏది కొనాలన్నా షాక్ కొట్టే పరిస్థితి. ఏదీ కొని తినలేని పరిస్థితి. ఇది చంద్రబాబు ప్రభుత్వం సాధించిన గొప్ప విజయమే!. బాదుడే బాదుడు: – రూరల్ రోడ్లకు టోల్ గేట్లు పెట్టి ట్యాక్సులు వసూలు చేస్తామని అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో చేతులెత్తించి చంద్రబాబు చెబుతున్నారు. లేదంటే గుంతలు కూడా పూడ్చలేమని ఆయన అంగీకరిస్తున్నాడు. మన దగ్గరేం మంత్రదండం లేదు. తెలివితేటలతోనే పరిపాలించాలని చెబుతున్నాడు. ట్యాక్సులు వసూలు చేయడం, ప్రజలపై భారం మోపడం కూడా తెలివితేటలా?. – అధికారంలోకి వచ్చేందుకు వారిచ్చిన నినాదం. బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ. కానీ ఇప్పుడు మాత్రం ‘బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ’ అన్నట్లుంది. ల్యాండ్, శాండ్, మైన్, వైన్.. ఇలా అన్నింట్లోనూ అవినీతి. అడ్డగోలు దోపిడీ. హామీల అమలు లేదు: – మెగా డీఎస్సీ మీద తొలిసంతకం చేశాడు. ఆర్నెళ్లయినా అతీగతీ లేదు. ఇది విజయం సాధించినట్లా?. – సిలిండర్ పథకం అమలు చేశామన్నారు. 1.55 కోట్ల కనెక్షన్లు. ఒక్కో కనెక్షన్‌కు, ఒక్కో సిలిండర్‌కు రూ.1450 కావాల్సి ఉంటే కేటాయించింది మాత్రం రూ. 850 కోట్లే. అంటే ఇవ్వలేమని ఒప్పుకున్నట్టే. మూడు సిలిండర్ల ఊసే లేదని అసెంబ్లీలోనే ఒప్పుకున్నారు. కానీ పథకం అమలు చేశామని జొబ్బలు చరుచుకుంటున్నారు. ఇది విజయమా?. ప్రశ్నిస్తే వేధింపులు: – సోషల్ మీడియా పేరుతో వందలాది వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు. సాక్షాత్తు ఒక దళిత మాజీ ఎంపీని 90 రోజులుగా బెయిల్ రాకుండా జైల్లో నిర్బంధించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మీద ట్వీట్ చేసినందుకే 8 కేసులు పెట్టారు. మరి వైఎస్ జగన్‌ను తిట్టినందుకు, మార్ఫింగ్ చేసిన వారి మీద ఒక్క కేసు కూడా పెట్టలేదు. ఇదేనా మంచి ప్రభుత్వం?: – గుంతలు పూడ్చడానికి కూడా ముఖ్యమంత్రి శంకస్థాపన చేసిన పరిస్థితి!. – గీత కార్మికులకు మద్యం షాపుల్లో 10 శాతం వాటా ఇచ్చామని చెబుతున్నారు. రాష్ట్రంలో మీరు కేటాయించిన షాపు ఒక్కటైనా ఉందా? ఉంటే చూపించండి. – నాడు కుల కార్పొరేషన్లను ఎద్దేవా చేసిన చంద్రబాబు.. నేడు వారి కార్యకర్తలతో వాటిని ఎలా భర్తీ చేసుకున్నారు?. – చేనేత మీద జీఎస్టీ ఎత్తేశామని చెప్పారు. అసలు ఆ ఆదేశాలుంటే చూపించండి. జీఎస్టీ ఎత్తేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుందా? – గృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టామంటున్నారు. ఎక్కడ పేపర్లో శ్రీకారం చుట్టారా? – చంద్రబాబు లేకపోతే రాష్ట్రానికి నష్టం జరిగిపోతుందని ప్రచారం చేసుకునే సత్తా వారి భజన మీడియాకు ఉంది కాబట్టి నమ్మంచగలిగారు. అప్పులపై వార్తలు. ఆర్థిక పరిస్థితి: – ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్ర అప్పులు రూ.5,19,192 కోట్లు అని ఈరోజు ఈనాడులో రాశారు. అదే కాకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు మరో రూ.2,48,677 కోట్లు అని అందులో ప్రస్తావించారు. మరి ఆ రుణాలు రూ.1,54,797 కోట్లు అని, బడ్జెట్‌లో ప్రస్తావించారు. అదే కాగ్ రిపోర్ట్‌లోనూ ఉంది. మరి ఏది నిజం?. – ఒకే పద్దుని రెండు చోట్ల చూపించడం ద్వారా వైయస్సార్‌సీపీ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని ప్రచారం చేయడమే వీరి ఉద్దేశం. – ఒక పక్క డబ్బులన్నీ వృథా చేస్తున్నారని ప్రచారం చేశారు. ఇంకో పక్క కాగ్ లెక్కల ప్రకారం రూ.78 వేల కోట్లు మూలధన వ్యయం చేశారని వీరే ఒప్పుకుంటున్నారు. వీటితోపాటు పనులకు చెల్లించాల్సిన బిల్లులు మరో రూ.50 వేల కోట్ల వరకు ఉంటే.. ఇదంతా మూల ధనం కోసం చేసిన ఖర్చే కదా?. – అది అయిదేళ్లలో ఎంతైనట్లు?. రూ.86 వేల కోట్ల బిల్లులు అప్‌లోడ్ చేయాలని మీరే అంటున్నారు. ఎందుకు అప్‌లోడ్ చేయడం లేదు. వాటికి ఎందుకు కేటాయింపులు చేయడం లేదు?. ఈ కేటాయింపులు చేసుంటే నిజాలన్నీ బయటపడేవి. – తప్పుడు లెక్కలతో తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాగ్ లెక్కలు నమ్మమంటారా?. లేక మీరిచ్చి కాకి లెక్కలు నమ్మమంటారా? – ఏపీఐడీసీ ద్వారా రుణం తీసుకొచ్చారు. ఇలా చేస్తే చైనాలో ఉరి తీస్తారని యనమల చెబుతున్నారు. అలా ఉరి తీసేది ఉంటే.. 2014–19 మధ్య రుణమాఫీ కోసం అంటూ రైతు సాధికార సంస్థ క్రియేట్ చేశారు. దాని మీద అప్పు తెచ్చారు. ఆ అప్పును 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం చెల్లించలేదా? ఇప్పడు కూడా రూ.139 కోట్లు సాధికార సంస్థకు కేటాయిస్తూ ఈ బడ్జెట్‌లోనూ చూపించారు కదా?. – మీడియా మేనేజ్‌మెంట్‌తో ఈ ప్రభుత్వాన్ని ఎంతోకాలం నడపలేరు. అందరినీ అన్ని రోజులూ మోసం చేయలేరు. సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడం సబబు అని భావించినట్టయితే మీరే మూల్యం చెల్లించుకుంటారు. కొత్త రాజకీయ విధానాలు మీరే మోసుకొచ్చినట్టు అవుతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు