బాపట్ల: రాష్ట్ర ప్రజలను చంద్రబాబునాయుడు అంకెల గారడీతో మళ్లీ మోసం చేశారని మాజీ డిప్యూటీ స్పీకర్, వైయస్ఆర్‌సీపీ బాపట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కోన రఘుపతి ఫైర్ అయ్యారు. స్థానిక వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్‌ను రూ.3.22లక్షల కోట్లతో ప్రవేశపెట్టడం చూస్తుంటే అంకెల గారడీగా ఉందని తెలిపారు. రూ.72వేల కోట్లు అప్పు ఉంటేనే గగ్గోలు పెట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు లక్ష కోట్లు ఏవిధంగా అప్పులు చేశారో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.40వేల కోట్లు అవసరమని చెప్పిన ఆయన ఇప్పుడు రూ. 6వేల కోట్లు మాత్రమే కేటాయించడం ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందని విమర్శించారు. పింఛన్లకు రూ.26వేల కోట్లు మాత్రమే కేటాయించడం గమనిస్తే, ఎంత మందివి తొలగించేందుకు కుట్ర జరుగుతుందో అర్థం కావడం లేదని తెలిపారు. మరోవైపు బీసీలకు 50సంవత్సరాలకే పింఛన్లు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు, తల్లికి వందనం, రైతుల గురించి పట్టించుకోలేదని చెప్పారు. మత్స్యకారులకు గత ఏడాది భరోసా కింద రూ.20వేలను ఇవ్వకుండా ఈ ఏడాది ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జగనన్న కాలనీల అభివృద్ధి పట్టించుకోకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాలకు వైయస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రూ.100కోట్లు చొప్పున కేటాయించగా, ఈ ప్రభుత్వం వాటి గురించి పట్టించుకోలేదని విమర్శించారు. మెడికల్ కళాశాలల గురించి ఊసే లేదని తెలిపారు. బడ్జెట్ ద్వారా చంద్రబాబునాయుడు హడావుడి నిర్ణయాలు చూస్తుంటే 2027లో జమిలి ఎన్నికలకు సిద్ధం అవుతున్నట్లు కనిపిస్తోందన్నారు. ప్రజల్లో వైయస్ఆర్‌సీపీపై విశ్వాసం ఉందని, వారికి అండగా ఉండేందుకు పార్టీ సిద్ధంగా ఉందని కోన స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొక్కిలిగడ్డ చెంచయ్య, ఎంపీపీ చిన్నపోతుల హరిబాబు, పార్టీ మండల అధ్యక్షులు మురుప్రోలు కొండలరెడ్డి, నాయకులు జోగి రాజా, కృష్ణ గుప్తా, కటికల యోహోషువా, పిన్నిబోయిన ప్రసాద్, శాయిల మురళి, నర్రా వెంకట్రావు, ఉరబిండి గోపి, తన్నీరు అంకమ్మ, డి.కోటిరెడ్డి పాల్గొన్నారు.