విపక్ష నేతలకు సమాధానం చెప్పలేక అధికార పక్షం ఎదురు దాడి

ప్రజల తరపున ప్రశ్నిస్తే తమపై బురద చల్లుతున్న కూటమి పార్టీలు 

శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం

పథకాలపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దారుణం

గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడలేదు

రుషికొండ నిర్మాణాలపై అవినీతి ఆరోపణలు అవాస్తవం

తప్పు జరిగినట్లు భావిస్తే కాంట్రాక్టరుకు ఎలా బిల్లు చెల్లించారు

ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన బొత్స సత్యనారాయణ

శాసనమండలి మీడియా పాయింట్‌:    బడ్జెట్‌పై శాసనమండలిలో జరిగిన చర్చా కార్యక్రమంలో అధికార పార్టీ నేతలు విపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక రాజకీయ ఎదురుదాడికి దిగడం సరికాదని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రస్తుతమున్న సచివాలయం, అసెంబ్లీ భవనాలు తాత్కాలికం కాదంటూనే మరోవైపు కొత్త భవనాల కోసం టెండర్లు పిలవడం కూటమి పార్టీల ద్వంద్వ వైఖరికి నిదర్శమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే అధికార పార్టీ నేతల మాటలు, వారి నిలకడ లేమికి నిదర్శమని తేల్చి చెప్పారు. శాసనమండలి మీడియా పాయింట్‌ వద్ద  మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడారు.

ఏ సీఎం కూడా అలా మాట్లాడలేదు:
    మరోవైపు రాజ్యంగం మీద ప్రమాణం చేసి.. ముఖ్యమంత్రి స్దానంలో ఉన్న చంద్రబాబు అధికార పార్టీకే పని చేయాలని చెబితే దాన్ని వక్రీకరించారని చెబుతున్న అధికార పార్టీ నేతలు కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం కానీ అదే విషయాన్ని అధికారికంగా చెప్పమంటే ఎందుకు ముందుకు రావడం లేదని మండలి విపక్షనేత ప్రశ్నించారు. సీఎం స్ధానంలో ఉన్న ఏ వ్యక్తి దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడలేదని ఆయన గుర్తు చేశారు. ఇలా మాట్లాడ్డం భావ్యం కాదని. అన్ని పార్టీల్లోనూ లబ్దిదారులు ఉంటారని, వారికి పార్టీలు అపాదించడం ఏ తరహా న్యాయమని నిలదీశారు. ఈ విషయాల మీద మండలిలో మాట్లాడుతుంటే, సాంకేతిక సమస్య పేరుతో ప్రత్యక్ష ప్రసారాలు నిలిపి వేశారని చెప్పారు.

బిల్లులు ఎలా చెల్లించారు?:
    రుషికొండలో ప్రపంచ ప్రమాణాలతో అద్భుతమైన భవనాలు నిర్మిస్తే ప్రజాధనం వృథా. అధికార దుర్వనియోగం అని గగ్గోలు పెట్టిన కూటమి నేతలు.. ఒక్కో చదరపు అడుగుకు రూ.10,500 చొప్పున వెచ్చించి తాత్కాలిక భవనాలు నిర్మించడం అంటే అవినీతి చేయడం కాదా అని నిలదీశారు. రుషికొండపై కట్టడాల్లో అవినీతి, తప్పులు జరిగితే దాని నిర్మాణ కాంట్రాక్టరుకు ఎలా బిల్లులు చెల్లించారని ప్రశ్నించారు. తప్పు జరిగితే దానిపై విచారణ వేసి శిక్షించాలని డిమాండ్‌ చేస్తే.. దానిపై దాటవేసే ధోరణితో ప్రభుత్వం మాట్లాడుతుందన్నారు.
    ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అధికార పార్టీ ప్రతిపక్షాన్ని బుల్డోజ్‌ చేస్తూ.. రాజకీయ కోణంలో గౌరవ సభను ఉపయోగించుకుంటున్న తీరును మండలి విపక్షనేత తప్పు పట్టారు. అయినా ప్రజల తరపున ప్రతిపక్షంగా సభలో వారిని నిలదీస్తామని స్పష్టం చేశారు. 

‘ఆడలేక మద్దెలోడు’:
    తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రూ.1.19 లక్షల కోట్లతో అమరావతి అభివృద్ది ప్రణాళిక వేయగా.. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో తాను మున్సిపల్‌ మంత్రిగా బాధ్యతలు తీసుకునేటప్పటికి కేవలం రూ.6 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిన విషయాన్ని బొత్స గుర్తు చేశారు. అందులో రూ.2 వేల కోట్లు బాండ్స్, రూ.2 వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్‌ కాగా, మరో రూ.2 వేల కోట్లు బకాయిలు పెట్టారన్నారు. ఈ నేపధ్యంలో ఇంత పెద్ద అంచనాలతో రాజధాని నిర్మించాలంటే మరో  5, 6 సంవత్సరాలు పడుతుందని చెప్పారు. అంత ఆర్ధిక స్దోమత లేనందునే, ఆరోజు ఖాళీగా ఉన్న భూములను చూసి వల్లకాడులా ఉందన్న నానుడిని ఉపయోగించానని చెప్పారు.
    ఏడేళ్ల క్రితం అత్యధికంగా చదరపు అడుగు రూ.10,500 చొప్పున తాత్కాలిక భవనాలు నిర్మించడం యథేచ్ఛ దోపిడీ కాక మరేమిటని మండలి విపక్షనేత ప్రశ్నించారు. మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే బుల్డోజ్‌ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, సమాధానం చెప్పలేక బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆక్షేపించారు. రాజధాని నిర్మాణంలో ‘ఆడలేక మద్దెలోడు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.
 

Back to Top