తిరుపతి జిల్లా: చంద్రబాబు నాయుడు కేవలం తెలుగు దేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రి అని, రాష్ట్రానికి కాదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ‘వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ పనులు చేయకూడదు’ అన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. సోమవారం సత్యవేడు సబ్ జైల్లో ఉన్న తడకుపేట దళితులను మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..`ఆరేళ్ల క్రితం పోసాని కృష్ణమురళి మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని ఆయన్ను అరెస్ట్ చేయడం దారుణం. పోసానిపై బీఎన్ఎస్ 111 సెక్షన్ కేసు పెట్టి , అక్రమంగా అరెస్టు చేయించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీపై చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్లు కింద కేసు నమోదు చేయగలరా? చంద్రబాబు వ్యాఖ్యలు హేయం వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం హేయమైన చర్య. వైయస్ఆర్‌సీపీ వాళ్లు కట్టే పనులను ఈ ప్రభుత్వం తీసుకోవడం లేదా? వైయస్ఆర్‌సీపీకి ఓటు వేసిన వాళ్లపై, హత్యాయత్నాలు, అత్యాచారాలు, దోపిడీ కేసులు పెట్టి జైలుకు పంపి, సీడీ ఫైళ్లు కోర్టులకు ఇవ్వకుండా, తప్పుడు నెంబర్లు వేసి వాళ్లని జైల్లోనే మగ్గనిచ్చేలా చేస్తున్నారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా, ఆయన చేసిన తప్పు ఎత్తి చూపిన సహించలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు, మంచి ప్రభుత్వమని స్టిక్కర్లేసుకోవడం తప్ప, మొన్న పెట్టిన బడ్జెట్ తో ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వమని ఏపీ ప్రజలకు అర్థమైంది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుపై పెట్టిన శ్రద్ధ, ఎల్లో బుక్ మేనిఫెస్టో పైన ఎందుకు పెట్టడం లేదు?. బటన్ నొక్కాడానికి వైయస్ జగన్ అవసరం లేదు. మూలనున్న ముసలమ్మ చాలు అన్న చంద్రబాబు.. నువ్వు ముసలాడివే కదా అనుభవం ఉన్నడివి కదా నువ్వు ఎందుకు బట్టన్ నొక్కలేకపోతున్నావు. చంద్రబాబు ఒక్క హామీని అమలు చేయలేదు. వైయస్ జగన్ అమలు చేసిన ఒక్క హామీని కూడా ప్రజలకు చేరవేయడం లేదు, చంద్రబాబుకు ఓటేసినందుకు యువత వాళ్ళ చెప్పుతో వాళ్లే కొట్టుకుంటున్నారు. వైయస్ జగన్ వస్తే.. వడ్డీతో సహా తిరిగిస్తారు రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైయస్ఆర్‌సీపీ వాళ్లపై దాడులు చేయడం అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిస్తామనుకుంటే.. రేపు అదే రిపీట్ అవుతుంది. వైయస్ జగన్ వస్తే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు . వైయస్ఆర్‌సీపీకి తెలిసో, తెలియకో ఎటువంటి సహాయం చేయొద్దు అన్నారంటే ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ కి ముఖ్యమంత్రా? ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రా? ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబుకు నొప్పి వస్తే పరిగెత్తే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే నోరెందుకు మెదపడం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు చూడండి, 30 వేల మంది మహిళలు వైయస్ఆర్‌సీపీ హయాంలో మాయమయ్యారన్నారు. పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా తీసుకొచ్చారా? దానికోసం బడ్జెట్లో నిధులు కేటాయించి ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు కదా` అంటూ ఆర్కే రోజా ప్రశ్నించారు.