ప్రశ్నిస్తే.. డైవర్షన్‌ పాలిటిక్సా?

ఏ హక్కుతో సరస్వతి పవర్‌ భూములపైకి వెళ్లారు?

పవన్‌కళ్యాణ్‌ను నిలదీసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు

సరస్వతి భూముల్లోకి అక్రమంగా ప్రవేశించావు

చట్ట విరుద్ధమని తెలిసీ కవ్వించడానికే వెళ్లావ్‌

చంద్రబాబు ఆదేశాలతోనే ఈ డైవర్షన్‌ పాలిటిక్స్‌  

మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టీకరణ

ప్రభుత్వ వైఫల్యాలను కవర్‌ చేసుకోలేక ఆపసోపాలు 

కోడెల విగ్రహాన్ని టీడీపీ నేతలే బాత్రూం పక్కన పడేశారు

చంద్రబాబు వాడుకోవడానికే పవన్‌తో పార్టీ పెట్టించాడు

ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి అంబటి ఆక్షేపణ

గుంటూరు: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడం ఈ ప్రభుత్వానికి అలవాటని.. ఆ దిశలోనే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్‌ ప్రాజెక్టు భూములపైకి వెళ్లారని వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. అసలు ఏ హక్కుతో పవన్‌ ఆ భూములపైకి వెళ్లారని ఆయన పవన్‌ను నిలదీశారు. చంద్రబాబు ఆదేశాలతోనే డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేయడానికే చట్టపరంగా రైతులకు డబ్బులిచ్చి కొనుగోలు చేసిన సరస్వతి పవర్‌ భూముల్లోకి వపన్‌ కళ్యాన్‌ ప్రవేశించారని ఆక్షేపించారు. అధికార మదంతో పోలీసులను వెంటేసుకుని చట్ట విరుద్ధంగా ప్రైవేటు భూముల్లోకి ప్రవేశించిన పవన్‌కళ్యాణ్‌.. కవ్వింపు వ్యాఖ్యలు చేసి ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్‌ చేయాలని తహతహలాడుతున్నారని దుయ్యబట్టారు. గుంటూరు క్యాంప్‌ ఆఫీస్‌లో వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు.

చట్ట విరుద్ధం కాక మరేమిటి?:
    నాడు వైయస్సార్‌గారు సీఎంగా ఉన్న సమయంలోనే జగన్‌గారు 1184 ఎకరాలు కొనుగోలు చేశారన్న మాజీ మంత్రి, 2014–19 మధ్య కూడా అప్పటి సీఎం చంద్రబాబు, ఇదే విధంగా యరపతినేని శ్రీనివాసరావును ఆ భూముల్లోకి పంపించి హడావుడి చేశారని గుర్తు చేశారు. వైయ‌స్ఆర్ మరణం తర్వాత చంద్రబాబు కోర్టు కేసుల ద్వారా అడ్డుకోకుండా ఉండి ఉంటే, అక్కడ కూడా భారతి సిమెంట్‌ లాంటి మంచి సిమెంట్‌ పరిశ్రమ వచ్చుండేదని, వేలాది స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చేవని చెప్పారు. ఈ ప్రాంత యువతకు ఉద్యోగాలు రాకుండా చంద్రబాబే అడ్డుకున్నారని ఆరోపించారు.
    తాము ప్రతీకారం కోసం రాలేదంటూనే చట్ట వ్యతిరేకంగా ప్రైవేటు భూముల్లోకి ఎందుకు ప్రవేశించారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పవన్‌కళ్యాణ్‌ను వాడుకోవడానికే చంద్రబాబు ఆయనతో పార్టీ పెట్టించారని ఆరోపించారు. 

వాటిపై ఎందుకు స్పందించలేదు?:
    కూటమి ఐదు నెలల పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పవన్‌కళ్యాణ్‌ అన్నారని, ముందు నుంచి తామూ అదే చెబుతున్నామని మాజీ మంత్రి గుర్తు చేశారు. అన్నింటా విఫలమైన ఈ ప్రభుత్వానికి ఇంకా కొనసాగే అర్హత లేదని ఆయన స్పష్టం చేశారు.
    ‘ప్రజలు మిమ్మల్ని తిడుతున్నారంటే మీకు పాలన చేతకావడం లేదని, మీరు వైఫల్యం చెందారని అర్థమని’.. పవన్‌ వ్యాఖ్యలను ఉద్దేశించి అంబటి అన్నారు. హోం మంత్రి వైఫల్యం గురించి మాట్లాడుతున్న పవన్‌కళ్యాణ్‌ తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో యువతిపై అత్యాచారం జరిగినప్పుడు, తెనాలిలో మహిళపై దాడి, కాకినాడలో దళిత ప్రొఫెసర్‌పై దాడి.. తదితర ఘటనలపై ఎందుకు స్పందించలేదని నిలదీశారు. 

పవన్‌ బ్లాక్‌మెయిల్‌ రాజకీయం:
    సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెడతాం, మడతపెట్టి కూర్చోబెడతాం అంటున్న పవన్‌కళ్యాణ్, ఆ విధంగా బ్లాక్‌మెయిల్‌ రాజకీయం చేస్తున్నారా? అని దుయ్యబట్టారు. 33 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని, ఎన్నికల ముందు ప్రచారం చేసిన పవన్, అధికారంలోకి వచ్చాక, ఎంత మందిని వెతికి తెచ్చారని, నెల రోజుల్లో పరిష్కరిస్తామన్న సుగాలిప్రీతి కేసు ఏమైందని నిలదీశారు.
    కోడెల శివప్రసాదరావును తమ ప్రభుత్వం వేధించలేదని, ఆ విషయం పవన్‌కు కూడా తెలుసన్న అంబటి రాంబాబు.. మరి ఆయన విగ్రహావిష్కరణను టీడీపీ నాయకులే అడ్డుకున్నారని, దాన్ని మూట గట్టి బాత్రూం పక్కన పడేశారన్న విషయం తెలుసా అని ప్రశ్నించారు. పవన్‌ కళ్యాణ్‌ సనాతన డ్రెస్సు వేసుకున్న విప్లవకారుడని ఎద్దేవా చేశారు. 

తిరుమల శ్రీవారిని క్షమాపణ కోరుతున్నా:
    నవరత్నాలతో కూడిన జగన్‌ బొమ్మ ఉన్న దుస్తులు ధరించడం తన కమిట్‌మెంట్‌ అన్న అంబటి రాంబాబు, తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు, ఆ చిత్రాన్ని టవల్‌తో కవర్‌ చేసినా పొరపాటున బయట పడిందే తప్ప, తాను ఉద్దేశపూర్వకంగా పార్టీ జెండా ప్రదర్శించాలనే ప్రయత్నం చేయలేదని వివరణ ఇచ్చారు. తెలియకుండా జరిగిన తప్పుకు శ్రీవారిని, ఆలయ పండితులు, అర్చకులను క్షమాపణ కోరుతున్నానని ఆయన వెల్లడించారు.

Back to Top