తాడేపల్లి: రాష్ట్ర బడ్జెట్ బుక్ చూస్తే కలర్ ఎక్కువ... కంటెంట్ తక్కువ కనిపిస్తోందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బడ్జెట్ లో చేసిన అరకొర కేటాయింపులు చూస్తే ఆశ్చర్యం కలుగుతోందని అన్నారు. ఇప్పటి వరకు గత ప్రభుత్వం చేసిన అప్పులు అంటూ చేసిన దుష్ర్పచారం బడ్జెట్ లెక్కల సాక్షిగా బయటపడిందని అన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటిల్లో బడ్జెట్ అంచనా వ్యయం రూ.3,22,359 కోట్లు, రెవెన్యూ రాబడి రూ.2,17,976 కోట్లు, అప్పు రూ.1,04,382 కోట్లుగా చూపించారు. ఇది కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండో బడ్జెట్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రతి సందర్భంలోనూ గత ప్రభుత్వం అంటూ వైయస్ఆర్ సీపీపై దూషణలకు పాల్పడుతోంది. ఈ బడ్జెట్ ప్రసంగం చూస్తే గత ప్రభుత్వం గురించి 25 సార్లు, విధ్వంసం గురించి మరో 10 సార్లు ప్రస్తావించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి పదినెలలు అవుతోంది, ఇకనైనా ప్రజలకు ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీల అమలు గురించి ఇకనైనా చెప్పాల్సిన అవసరం లేదా? ఎన్నికలు జరిగిందే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై. ప్రతి ఇంటికి తిరిగి హామీలను పదేపదే చెప్పి ప్రజలను నమ్మించారు. 2019-24 వరకు వైయస్ జగన్ గారు క్యాలెండర్ ప్రకారం మేనిఫేస్టోలో చెప్పినది ప్రతీదీ అమలు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇదే తరహాలో హామీలను అమలు చేస్తుందని ఆశతోనే ప్రజలు కూటమికి పట్టం కట్టారు. గతంలో అనేకసార్లు చంద్రబాబు వల్ల మోసపోయినా కూడా తిరిగి వారు చెప్పిన ఆకర్షనీయమైన హామీలతో మోసపోయి కూటమికి అధికారం అప్పగించారు. బడ్జెట్ లో సూపర్ సిక్స్ కు మొండిచేయి సూపర్ సిక్స్ హామీల అమలును చూస్తే తొలి ఏడాది బడ్జెట్ లో ఎలా మొండిచేయి చూపించారో అలాగే ఈ బడ్జెట్ లో కూడా చేశారు. దీపం పథకం కింద అర్థదీపం, పావుదీపం అమలు చేశారు. మరోవైపు కూటమి ప్రభుత్వం చేసినంత అప్పు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఒక్క ఏడాదిలోపే రూ.1.19 కోట్లు అప్పులు చేశారు. 1995 నాటి పరిస్థితిని ఉదహరిస్తూ, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని ఆర్థిక మంత్రి వాపోయారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో 1995లో మిగులు బడ్జెట్ ఉంది. ఏ లెక్కల ప్రకారం ఆర్థిక మంత్రి అలా చెప్పారో అర్థం కావడం లేదు. చాణక్యుడిని కోట్ చేస్తూ ప్రజలపై ఎక్కువ భారం వేయకూడదు, సహేతుకంగా పన్నులు విధించి, వాటిని ప్రజల కోసం సద్వినియోగం చేయాలని అన్నారు. ఇందులో ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం చేయడం లేదు. గత బడ్జెట్ లో 63 పేరాల్లో కేవలం రెండు పేరాల్లో ఒక లైన్ లో 'సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభవ - ప్రధాన మంత్రి కిసాన్ పథకం కింద అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటించిందని' రాశారు. కానీ ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ఈ పథకం కింద లబ్ధి చేకూరిందా? అలాగే 29వ పేరాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఒకటి నుంచి పన్నెండో తరగతి వరకు చదివే పిల్లల తల్లులకు తల్లికివందన కింద ఆర్థిక సాయం అందిస్తూ మా ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీని అమలు చేస్తోంది అని పేర్కొన్నారు. అంటే గత బడ్జెట్ లో కేవలం రెండు పథకాల గురించి మాత్రమే పేర్కొన్నారు. ఈ రెండింటినీ అమలు చేయకుండా వదిలేశారు. గత ఏడాది అగ్రికల్చర్ బడ్జెట్ లో పీఎం కిసాన్ తో కలిపి అన్నదాత సుఖీభవ కింద రూ.4500 కోట్లు ప్రకటించిందని రాసుకున్నారు. స్థూల ఉత్పత్తి అంచనాలపైనా అబద్దాలు ఫిబ్రవరి 25న సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ఇచ్చిన ప్రజంటేషన్ లో 2023-24లో స్థూల ఉత్పత్తి 8.6 శాతం మాత్రమే పెరిగింది, 2025-26లో 12.9 పెరుగుతుందని తద్వారా రూ.62 కోట్ల స్థూల ఉత్పత్తిని సాధిస్తామని చెప్పారు. స్థూల ఉత్పత్తిని లెక్కించడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. సంపద సృష్టించాము, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్నారు. మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు ఈ సృష్టిస్తున్న సంపదను ఎందుకు కేటాయించడం లేదు? 2014-19 లో స్థూల ఉత్పత్తి 13.5 పెరిగితే, 2019-24 లో 10.3 పెరిగిందని పోలిక చెబుతున్నారు. వైయస్ఆర్ సీపీ హాయంలో కోవిడ్ తో మొత్తం ఎకానమీ దెబ్బతిన్న సమయాన్ని కూడా పోలుస్తారా? అప్పులపై తప్పుడు లెక్కలు అప్పుల గురించి మాట్లాడుతూ 2024, మార్చి 31 నాటికి అప్పు 3,75,295 కోట్లు ఉంది. ప్రభుత్వ అప్పు రూ. 4,38,278 కోట్లు, పబ్లిక్ అకౌంట్స్ లైబిలిటీస్ రూ. 80,914 కోట్లు, కార్పోరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు, సివిల్ సప్లయిస్ రూ.36,000 కోట్లు, విద్యుత్ సంస్థలు రూ.34,267 కోట్లు, రూ.1,13,000 కోట్లు కాంట్రాక్టర్ లకు , ఎంప్లాయిస్ కు రూ.21,000 కోట్లు, మొత్తం కలిపి రూ.9,74,556 కోట్లు అప్పులు ఉన్నాయని ముఖ్యమంత్రి తన ప్రజంటేషన్ లో వెల్లడించారు. అంతకు ముందు వైయస్ఆర్సీపీ రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసిందని ఎలా మాపై విషప్రచారం చేశారు? వైయస్ఆర్ సీపీ హయాంలో చేసిన అప్పు రూ.3,33,513 కోట్లు కార్పోరేషన్ అప్పులు రూ.2,48,677 కోట్లు అన్ని చంద్రబాబు చెప్పారు. కానీ కాగ్ చెప్పిన దాని ప్రకారం రూ.1,54,797 కోట్లు అని స్పష్టంగా ఉంది. అంటే కాగ్ చెప్పినది సరైనదా? లేక మీరు చెబుతున్న లెక్కలు సరైనవా? వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆర్థిక అంశాలపై ఏది చెప్పినా ప్రతి దానికీ ఆధారాన్ని చూపించేవారు, కానీ కూటమి మాత్రం తమ లెక్కలకు ఎక్కడా ఆధారాలను చూపించడం లేదు. సివిల్ సప్లయిస్ కు ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వలేకపోవడం వల్ల, పేమెంట్ చేయడానికి సివిల్ సప్లయిస్ అప్పులు చేసింది. అంటే ఈ రూ.36,000 కోట్లు కూడా కాగ్ చెప్పిన రూ. 1,54,797 కోట్ల అప్పుల్లో కలిసే ఉంది. కానీ దానిని కూటమి ప్రభుత్వం విడిగా చూపి ఎక్కువ అప్పులు ఉన్నట్లుగా చిత్రీకరించింది. డిస్కం అప్పుల గురించి రూ.34,267 కోట్లు ఉన్నట్లు చూపించారు. సడ్సీటీ కింద రైతులకు, ఎస్సీ, ఎస్టీ లకు గృహ వినియోగ సబ్సిడీని ప్రభుత్వం డిస్కం లకు కట్టకపోవడం వల్ల డిస్కంలు అప్పులు చేశాయి. ఇవి కూడా కాగ్ చెప్పిన మొత్తంలో కలిసే ఉన్నాయి. దానిని కూడా విడిగా చూపి ఎక్కువ అప్పులు చేశామని ప్రచారం చేశారు. అలాగే కాంట్రాక్టర్ లకు చెల్లించాల్సిన వాటిల్లో అప్ లోడ్ అయినవి 86,000 కోట్లు వీటిని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. మొత్తం అప్పులు చూస్తే 7,83,773 కోట్లుగా లెక్క తేలుతున్నాయి. వీటిల్లో 3,90,250 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయి, వైయస్ఆర్ సీపీ పాలనలోకి వచ్చినప్పుడు ఉన్న అప్పు. మా హయాంలో జరిగిన అప్పు రూ.3,33,513 కోట్లు మాత్రమే. కానీ కూటమి పార్టీలు మాపై తప్పుడు ప్రచారం చేశాయి. శ్రీలంక, కాంబోడియా అంటూ దుష్ర్పచారం చేశాయి. పీఐజీ చెప్పిన లేక్కలు కూడా తప్పేనంటారా? కేంద్ర అటానమస్ బాడీ పీఐజీ చెప్పిన దాని ప్రకారం వైయస్ఆర్‌సీపీ హయాంలో జరిగిన టోటల్ పబ్లిక్ డెట్ 2019-20లో రూ.33వేల కోట్లు, 2020-21లో రూ.43,700 కోట్లు, 2021-22లో రూ.39,365 కోట్లు, 2022-23లో రూ.51,415 కోట్లు, 2023-24లో రూ.59,000 కోట్లు. అంటే మొత్త అయిదేళ్ళలో చేసిన అప్పులు సుమారు రెండువేల కోట్ల రూపాయలు మాత్రమే. గత ఏడాది కూటమి ప్రభుత్వం ప్రకటించిన దాని ప్రకారం గ్యారెంటీలు రూ.1,54,000 కోట్లు. ఆఫ్ బడ్జెట్ అని మమ్మల్ని విమర్శించారు. అమరావతి కోసం వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు, జర్మన్ బ్యాంక్ నుంచి రూ.5 వేల కోట్లు తీసుకువచ్చారు. అంటే మొత్తం రూ. 31వేల కోట్లు తీసుకువచ్చారు. బడ్జెట్ ప్రసంగంలో అమరావతికి ఒక్క రూపాయి పెట్టనవసరం లేదు, సెల్ఫ్ సస్టైన్ మోడల్ అని చెబుతున్నారు. కానీ బడ్జెట్ పత్రాల్లో అమరావతికి పీపుల్స్ క్యాపిటల్ రూ.6 వేల కోట్లు అని ఎలా చెప్పారు? బడ్జెట్ బ్రీఫ్ కు, బడ్జెట్ స్పీచ్ కు పొంతన లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జూన్ 24 న రూ.6000, జూలైలో రూ.10,000 కోట్లు, ఆగస్టులో రూ.3,000 కోట్లు, సెప్టెంబర్ లో రూ.4,000 కోట్లు, అక్టోబర్ లో రూ.6,000 కోట్లు, నవంబర్ లో 4000 కోట్లు, డిసెంబర్ లో రూ.9,237 కోట్లు, ఫిబ్రవరిలో రూ.7,000 కోట్లు అప్పులు చేశారు. సంపద సృష్టించడం అంటే మైనస్ వృద్ది నమోదు చేయడమా? సంపద సృష్టి అంటూ చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. పదినెలల్లో మైనస్ 0.01 శాతం వృద్ధిలో ఉన్నారు. వైయస్ఆర్ సీపీ కి పాలన చేతకాదు అంటూ విమర్శలు చేశారు. మరి ఈ పదినెలల్లో మీరు చేసింది ఏమిటీ? స్థూల ఉత్పత్తి బాగుంటే, రెవెన్యూ రాబడిలో వృద్ది కనిపిస్తుంది. 2024లో అంటే ఏప్రిల్ నుంచి 2025 జవనరి వరకు పదినెలలు లెక్కేస్తే రెవెన్యూ రాబడి మైనస్ లోకి వచ్చింది? 2023 ఏప్రిల్ నుంచి 2024 జనవరి వరకు వైయస్ఆర్సీపీ పాలనలో సాధించిన రెవెన్యూ రూ. 72,872 కోట్లు. కూటమి పాలనలో పది నెలల్లో రూ.72,864 కోట్లు వచ్చింది. అంటే మా కన్నా ఎనిమిది కోట్లు తక్కవగా రెవెన్యూ వచ్చింది. ఇదేనా మీ సంపద సృష్టి? నీతి అయోగ్ ప్రకారం 2015-19 వరకు 12.9 శాతం రెవెన్యూ రాబడిలో సీఎజీఆర్ ఉంది. 2020-23 వరకు 14.1 శాతం పెరిగింది. దీనిని బట్టి ఎవరు సంపదను సృష్టిస్తున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇంటిపన్నులు పెంచి రెవెన్యూ పెంచుకోవాలని చూస్తున్నారు. పన్నులు పెంచడం వల్ల రాబడి పెరగకపోగా ఒకదశలో నిలిచిపోతుంది. ఫిబ్రవరి 1, 2025 నాటికి 16,997 గ్రామాలు, 9వేల వార్డుల్లో మార్కెట్ విలువను పెంచాలని ప్రతిపాదించారు. కూటమి పాలనలో స్టాంప్స్ అండ్ రెవెన్యూ ఆదాయం పడిపోవడంతో దానిని పెంచుకోవడానికి భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయించారు. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు విద్యుత్ సంస్థలు అన్నింటికి కలిపి ఉన్న అప్పు రూ.29,500 కోట్లు. 2019 నాటికి ఇది రూ. 86,215 కోట్లకు పెరిగింది. అంటే ఏటా 24 శాతం చొప్పున అప్పులు పెంచారు. మీరు చేసిన అప్పులు వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ. 1.22 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అంటే అయిదేళ్ళలో వైయస్ఆర్ సీపీ హయాంలో తెచ్చిన అప్పులు రూ. 36 వేల కోట్లు మాత్రమే. అంటే మా హయాంలో ఏటా పెరిగింది 7 శాతం మాత్రమే. మాది విధ్వంసం అంటూ విమర్శలు చేస్తున్న వారు వాస్తవాలను గమనించాలి. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర జీడీపీలో వృద్ధి సూపర్ సిక్స్ అమలుకు ఒక టైంటేబుల్ ఇస్తున్నారా అంటే బడ్జెట్ లో అది ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు ప్రజంటేషన్ లో స్థూల ఉత్పత్తితో పాటు తలసరి ఆదాయం గురించి చెప్పారు. 2018-19లో ఏపీ తలసరి ఆదాయం రూ.1,54,031 తో జాతీయ స్థాయిలో 18వ స్థానంలో ఉంది. 2022-23 నాటికి రూ.2,19,881 పెరిగి 15 వ స్థానంకు చేరుకుంది. తలసరి ఆదాయాన్ని జాతీయ స్థాయిలో దేశంతో పోల్చుకోవాలి. మీ హయాంలో జాతీయ స్థాయిలో ఏ మేరకు తలసరి ఆదాయం పెరిగింది, వైయస్ఆర్‌సీపీ హయాంలో జాతీయ స్థాయిలో తలసరి ఆదాయం ఎంత పెరిగింది అనేదానినే పోల్చాలి. కానీ చంద్రబాబు మాత్రం తనకు అనుకూలంగా కాకిలెక్కలు చెబుతున్నారు. 2014-19 దేశ స్థూల ఉత్పత్తిలో ఏపీ భాగస్వామ్యం 4.47 శాతం ఉంది. 2019-24 వరకు వైయస్ఆర్ సీపీ హయాంలో జీడీపీ 4.83 శాతం ఉంది. కోవిడ్ వంటి సంక్షోభంలోనూ ఇంత వృద్ధిని సాధించాం. అదే తెలుగుదేశం హయాంలో ఎక్కడా కోవిడ్ పరిస్థితి లేకపోయినా కూడా మా కన్నా తక్కువ వృద్ధినే సాధించారు. ఇదీ మీ పాలనా సామర్థ్యం. పథకాల కేటాయింపుల్లోనూ చిత్తశుద్ది లేదు సూపర్ సిక్స్ పథకాల అమలుకు బడ్జెట్ లో చేసిన కేటాయింపులు చూస్తే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని అర్థమవుతుంది. గత బడ్జెట్ లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ ప్రకటించినా దానిని అమలు చేయలేదు. యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు, నెలకు రూ.3వేల భృతి అన్నారు, స్కూల్ కు వెళ్లే విద్యార్థికి రూ.15వేలు, ప్రతి రైతుకు రూ.20 వేలు ఆర్థిక సాయం, అర్హులైన మహిళలకు నెలకు రూ.1500, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇలా ఏ హామీకీ సరైన కేటాయింపులు లేవు. 2025-26లో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ.20 వేలు కేటాయిస్తున్నామని చెప్పారే తప్ప ఎంత దీనికి కేటాయిస్తున్నారో ప్రకటించలేదు. తల్లికి వందనం పైన కూడా అలాగే చెప్పారు. నిజంగా వీటిని అమలు చేసే ఉద్దేశం ఉంటే దానిపైన ఎందుకు స్పష్టత ఇవ్వలేదు? తల్లికి వందనంకు బడ్జెట్ బ్రీఫ్ లో రూ.9,407 కోట్లు చూపించారు. కానీ వాస్తవంగా లెక్కలను బట్టి దాదాపు రూ.12,450 కోట్లు అవసరం. కానీ కేటాయించింది రూ.8,278 మాత్రమే. దీని ప్రకారం కేవలం 55 లక్షల పిల్లలకే తల్లికి వందనం అందుతుందని అర్థమవుతోంది. అంటే వారికి ఎగ్గొట్టేస్తున్నారు. అప్పు చూస్తే జనవరి నెలాఖరు నాటికి రూ.82,738 కోట్లు అని చూపించారు. కానీ బడ్జెట్ బుక్ లో మాత్రం అప్పు కేవలం రూ. 73,362 కోట్లు అని రాశారు. మూలధన వ్యయం రూ.24,072 కోట్లు అని గత బడ్జెట్ చెప్పి, ఖర్చు పెట్టింది ఎంతా అని చూస్తే రూ.10,850 కోట్లు మాత్రమే. అంటే ఈ రెండు నెలల్లో రూ.13000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారా? వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు తాజా బడ్జెట్ లో వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ధాన్యంకు గత ఏడాది రూ. 1740 క్వింటా రేటు ఉంటే, ఈ ఏడాది రూ.1470 నుంచి 1500 ఉంది. ఎంఎస్పీ రూ. 2300 ఉంది. ప్రొక్యూర్ మెంట్ ఎక్కడ జరుగుందో తెలియడం లేదు. వ్యవసాయదారులు దళారీలకు అమ్మకోవాల్సిన పరిస్థితి ఉంది. మిర్చి క్వింటా గత ఏడాది 21 నుంచి 23 వేలకు అమ్మితే ఈ ఏడాది రూ.8 నుంచి 11 వేలకు అమ్ముతున్నారు. పత్తి క్వింటా గత ఏడాది మా హయాంలో రూ.10 వేలు ఉంటే, ఇప్పుడు 5000 అమ్మతున్నారు. మినుమలు గత ఏడాది రూ.10 వేలు ఉంటే, ఈ ఏడాది రూ.6 వేలు, కంది క్వింటాలు గత ఏడాది 9-10వేలు అమ్మితే ఈ ఏడాది రూ.5500 లకు అమ్ముకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అన్నదాత సుఖీభవ కింద ఎక్కడా రైతులను ఆదుకోవడం లేదు. రూ.6300 కోట్లు అన్నదాత సుఖీభవ కోసం బడ్జెట్ లో రాశారు. కేంద్రం ఇచ్చే ఆరు వేలను కూడా కలుపుకునే అని మాట మార్చారు. దీని ప్రకారం చూసినా 45 లక్షల మంది రైతులకే అందుతుంది. మొత్తం 55 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇరవై వేలు రాష్ట్రప్రభుత్వమే ఇస్తే కనీసం 30 లక్షల మందికి కూడా ఈ కేటాయింపులు సరిపోవు. గత ఏడాదికే 55 లక్షల మంది రైతులు రైతుభరోసాను అందుకున్నారు. అన్నదాత సుఖీభవకు బడ్జెట్ లో కేటాయింపులు రూ.6300 కోట్లు అని చూపిస్తే, అగ్రికల్చర్ బడ్జెట్ లో వ్యవసాయ మంత్రి అన్నదాత సుఖీభవకు రూ.9400 చూపించారు. ఇందులో ఏది సరైనదో, ఎందుకు వ్యత్యాసం చూపించారో తెలియదు. వైయస్ఆర్ సీపీ హయాంలో అన్ని వర్గాలకు అండగా ఉన్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023 జూలై లో ఉద్యోగులకు చివరి డీఏ ఇచ్చాం. 2024 జనవరి, జూలై లకు సంబంధించిన డీఏ లను కూటమి ప్రభుత్వం బకాయి పెట్టింది. ఎన్నికల ముందు ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చారు. ఇప్పుడు వారిని పట్టించుకునే వారే లేరు. గ్రాట్యుటీ జూలై నుంచి ఇవ్వడం లేదు. ప్రావిడెండ్ ఫండ్ ఎన్నికలకు ముందు వరకు మేం క్లియర్ చేశాం. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఇవ్వడం లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు సరెండర్ లీవ్ ఫండ్ ఇవ్వడం లేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాలను సృష్టిస్తామని హామీ ఇచ్చారు. గత వైయస్రా్ సీపీ ప్రభుత్వం 2,13,662 పర్మినెంట్, 45,871 కాంట్రాక్ట్, 3,71,777 అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించింది. అంటే మొత్తం 6,31,310 కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్తగా ఏ ఉద్యోగాలు అయినా వచ్చాయా? ప్రైవేటు రంగంలోనూ లక్షలాధి ఉద్యోగాలు కల్పించి యువతకు అండగా నిలబడ్డాం. 44.50 లక్షల మంది తల్లులకు అమ్మ ఒడి కింద రూ.66,000 కోట్లు ఇచ్చాం. రైతుభరోసా కింద 53.50 లక్షల మందిరైతులకు ఇచ్చాం. చేయూత కింద 26.98 లక్షల మందికి లబ్ధి చేకూర్చాం. 79 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఆసరా కింద రూ.26,000 కోట్లు ఇచ్చాం. క్యాలెండర్ ప్రకారం ప్రతినెలా పథకాలను అమలు చేశాం. డీబీటీ ద్వారా లబ్ధదారుల ఖాతాలకే పథకాల సొమ్మును జమ చేశాం. ఇలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇస్తుందని ప్రజలు ఆశపడ్డారు. కానీ మొదటికే మోసం వచ్చింది.