విజయవాడ: గీతాంజలి మృతికి టీడీపీ, జనసేన కార్యకర్తల ట్రోల్సే కారణమని అన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని సేకరిచామని తెలిపారు. కొంతమంది వ్యక్తుల సోషల్ మీడియా అకౌంట్స్‌పై నిఘా పెట్టామని చెప్పారు. గీతాంజలి ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని..సీఎం జగన్ వల్ల తన కుటుంబానికి జరిగిన మేలు గురించే మాట్లాడిందని తెలిపారు. అలాంటి సాధారణ గృహిణి మీద కూడా ట్రోల్స్ వేసి ఆత్మహత్య చేసుకునేలా చేశారని విమర్శించారు. గీతాంజలి మృతికి కారణమైన ఎవరినీ వదిలేది లేదని అన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దోషుల సంగతి తేల్చుతామని చెప్పారు. మరో మహిళపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి రూ.20 లక్షలు పరిహారం ప్రకటించినట్లు పేర్కొన్నారు. పచ్చపార్టీలను తరిమికొట్టాలి టీడీపీ, జనసేన శ్రేణులు గీతాంజలిపై దారుణంగా మాట్లాడారని మంత్రి రోజా పేర్కొన్నారు. గీతాంజలిపై అమానుషంగా మాట్లాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఐటీడీపీ, జనసేన హద్దుల్లో ఉంటే బాగుంటుందని హితవు పలికారు. మహిళలు ఘాటుగా స్పందించి పచ్చపార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష పార్టీల తీరును ఖండిస్తున్నా గీతాంజలి మరణం చాలా బాధాకరమని బొత్స ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిని ప్రతిపక్షాలు వేధించడం దుర్మార్గ చర్చ అని మండిపడ్డారు. ఆమె మరణానికి టీడీపీ, జనసేన వేధింపులే కారణమని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. గీతాంజలి మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని కోరారు. సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. గీతాంజలి మృతి చాలా దురదృష్టకరమని అన్నారు మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ. గీతాంజలి ఘటనను ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్లినట్లు చెప్పారు. గీతాంజలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. సోషల్ మీడియా సైకోలను విడిచిపెట్టకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గీతాంజలి మృతిపై చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు స్పందించాలని డిమాండ్ చేశారు. టీడీపీ,జనసేన కార్యకర్తల వేధింపులను ప్రభుత్వం, మహిళాలోకం సీరియస్‌గా తీసుకుంటుందన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచి పొందిన మేలును చెప్పడమే గీతాంజలి చేసిన తప్పా అని అన్నారు. గీతాంజలి మృతికి ప్రధాన కారణమైన అజయ్ సజ్జాను విడిచిపెట్టకూడదని అన్నారు విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి. అజయ్ సజ్జాను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గీతాంజలిని సోషల్ మీడియాలో వేధించి చనిపోయేలా చేశారని మండిపడ్డారు. మహిళలకు మంచి జరుగుతుంటే చంద్రబాబు, టీడీపీ వాళ్లు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.