మా ఓట్లు ఏమయ్యాయి? 

టీడీపీ ఓడిపోతుందనుకున్న చోట భారీ మెజారిటీలా..?

వైయ‌స్ఆర్‌సీపీకి బాగా పట్టున్న గ్రామాల్లోనూ టీడీపీకి మెజారిటీ ఎలా? 

రాష్ట్రంలో కూటమి గెలుపుపై ప్రజల్లో అనేక సందేహాలు 

వైయ‌స్ఆర్‌సీపీ ఇంతలా ఓడించేంత వ్యతిరేకత లేదని స్పష్టీకరణ.. ఈవీఎంల సాంకేతికత, హ్యాకింగ్‌పై అనుమానాలు 

ఏ ఇద్దరు మాట్లాడుకున్నా దీనిపైనే చర్చ

ఈ ఫలితాలపై ఎన్నో అనుమానాలు 

ఈ ఫలితాలపై ఎవ్వరికీ నమ్మకం కలగడం లేదు. మా గ్రామంలో అత్యధిక శాతం మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓట్లు వేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత చూస్తే తారుమారైనట్లు కనిపించింది. సంక్షేమ పథకాలు అందుకున్న అనేక కుటుంబాలు  వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశాయి. కానీ ప్రతిరౌండులోనూ మెజార్టీ ఓట్లు ఏకపక్షంగా టీడీపీకి వచ్చాయి. జగన్‌ను అధికంగా అభిమానించే గ్రామాల్లోనే ఇలా టీడీపీకి ఓట్లు పడటం చూస్తుంటే ఎన్నో అనుమానాలున్నాయి.  
– దుంపల ఉమ (రైతు), కమలనాభపురం, కోటబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా

 

 ‘‘మేం జగన్‌కే ఓటేశాం.. మా ఓట్లన్నీ ఏమైపోయాయి.. ఏదో జరిగింది.. లేకపోతే అధికార పార్టీకి ఇంత దారుణంగా సీట్లు రావడమేంటి? బంపర్‌ మెజారిటీతో గెలుపొందుతాం అనుకున్న చోట టీడీపీకి మెజారిటీ రావడం ఏమిటి? వైఎస్సార్‌సీపీ ఓట్లు పక్కాగా 90 శాతంపైగా ఉన్న ఒక బూత్‌ పరిధిలో టీడీపీకి మెజారిటీ రావడాన్ని ఏమనుకోవాలి? ఏదో జరిగింది.. ఆ ఓటింగ్‌ మిషన్లను ఏదో చేశారు.. లేకపోతే ఇంత దారుణంగా ఫలితాలెలా వస్తాయి?’’ అని రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ చర్చే నడుస్తోంది. ఇంతలా ఫలితాలను తాము కలలో కూడా ఊహించలేదని టీడీపీ నేతలే ఆశ్చర్యపోతున్నారంటే ఏం జరిగి ఉంటుందనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. 

కూటమి గెలిచిందనే ఆనందం కంటే వైయ‌స్ జగన్‌ ఓడిపోయారనే బాధ అత్యధికుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ‘మా గ్రామంలో 3 వేల ఓట్లు ఉంటే అందులో కనీసం 2100 ఓట్లు వైఎస్సార్‌సీపీకే పడ్డాయి.. ఇలా ఒక నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ జరిగితే జగన్‌ ఓడిపోవడమేంటి’ అంటూ అనేక గ్రామాల్లో ప్రజలు లెక్కలు వేస్తున్నారు. పలువురు రైతులు పల్లెల్లో ఒక చోట చేరి ‘మనకు ఎంతో మేలు చేసిన జగన్‌కే కదా మనం ఓటేశాం. ఇలా అన్ని ఊళ్లలోనూ జరిగింది.. మరి మనందరి ఓట్లు ఏమైపోయాయి?’ అని ఆవేదన పంచుకుంటున్నారు. 

జగనన్నకే మేమూ ఓటేశాం అన్నకు మరీ ఇంత తక్కువ సీట్లు రావడమేంటంటూ అక్కచెల్లెమ్మలు కన్నీరు మున్నీరవుతున్నారు. బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఫోన్లు చేసి ఏం జరిగి ఉంటుందంటూ ఆరా తీస్తున్నారు. ఉద్యోగులు సైతం ఈ ఫలితాల పట్ల విస్మయం చెందుతున్నారు. సచివాలయాల ఉద్యోగులు, కొన్ని సామాజిక వర్గాల ఉద్యోగులు, వలంటీర్లు వైయ‌స్ఆర్‌సీపీకి ఓటేశారని, వీరందరి ఓట్ల వల్ల అనేక సీట్లు వచ్చే అవకాశం ఉందని వారు చర్చించుకుంటున్నారు.  

Back to Top