అమరావతి: రాజధాని అమరావతిలో గత 5 సంవత్సరాలుగా టీడీపీ ప్రభుత్వంలో రైతులు చిత్రహింసలకు గురయ్యారని మంగళగిరి వైయస్ఆ ర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి అన్నారు. తుళ్లూరు మండలం రాయపూడిలో రాజధాని రైతుల సమావేశంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ.. రాజధానిలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామన్నారు. అవసరమైతే సీబీఐ విచారణ కూడా కోరతామని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్విస్ ఛాలెంజ్‌పై అవసరమైతే లండన్ కోర్టుకైనా వెళ్తామన్నారు. గత ప్రభుత్వంలో వేల కోట్ల అవినీతి: ఉండవల్లి శ్రీదేవి గత ప్రభుత్వ హాయాంలో రాజధాని అమరావతిలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. చదరపు అడుగుకు రూ.2 వేలు కూడా ఖర్చు కాని తాత్కాలిక సచివాలయానికి రూ.10 వేలకు పైగా ఖర్చు పెట్టి వేల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. రాజధాని ఇక్కడ ఉండదని టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబుకి రాజధాని మీద ప్రేమ ఉంటే ఇక్కడే ఇల్లు ఎందుకు కట్టుకోలేదని సూటిగా ప్రశ్నించారు. రాజధానిలో అందరికీ అండగా ఉంటామని ధీమా ఇచ్చారు. త్వరలోనే ఎమ్మెల్యే ఆర్కే, తాను కలిసి సీఆర్‌డీఏ కమిషనర్‌ను కలిసి రాజధానిలో పరిస్థితులు వివరిస్తామని చెప్పారు.