

















పోలవరాన్ని ఎవరు నిర్లక్ష్యం చేశారో ప్రజలకు తెలుసు
చంద్రబాబుపై మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మండిపాటు
2014–16 వరకు పోలవరం ప్రాజెక్టుకు బాబు చేసిన ఖర్చు రూ.265 కోట్లు మాత్రమే
2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించమంటూ 2017లో కేంద్రం స్పష్టం చేసింది
టీడీపీ మంత్రులు ఆనాడు ఎందుకు కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు
కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును ఎందుకు తీసుకున్నారు?
లక్ష మంది కుటుంబాల గురించి బాబు ఎందుకు ఆలోచంచలేదు?
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులను కచ్చితంగా ఆదుకోవాల్సిందే
ఈ విషయాలన్నింటిపై త్వరలో ప్రధానిని కలుస్తాం
తాడేపల్లి: పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందెవరో, పరుగులు పెట్టిస్తోంది ఎవరో ప్రజలకు బాగా తెలుసని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లే ఈ రోజు కేంద్రం కొర్రీలు వేస్తోందన్నారు. చంద్రబాబు చేసిన తప్పులు రాష్ట్ర ప్రజలకు శాపంగా మారాయన్నారు. ప్యాకేజీ కోసం కక్కుర్తిపడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చంద్రబాబు తీసుకున్నారన్నారు. 2014 నుంచి 2016 వరకు రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు ఖర్చు చేసింది రూ.265 కోట్లు మాత్రమేనని తెలిపారు. 2016లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని స్వాగతించి పోలవరం ప్రాజెక్టును ప్యాకేజీ పరిధిలోకి తెచ్చింది మీరు కాదా..? అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు అభ్యర్థన మేరకే కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారన్నారు. ప్యాకేజీ కోసమే చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారన్నారు. 2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించమని 2017లో కేంద్ర కేబినెట్ స్పష్టం చేసిందని, అప్పుడు కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీశారు.
తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘రాష్ట్రం విడిపోయే ముందు పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పోలవరం ప్రాజెక్టును నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటిస్తూ.. పూర్తి బాధ్యత కేంద్రం భరిస్తుందని చెప్పారు. 2014లో కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి. చంద్రబాబు ప్యాకేజీ కోసం కక్కుర్తిపడి పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారు. తప్పంతా ఆయన చేసి ఇప్పుడు మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు.
55 వేల కోట్ల రూపాయిలు అయితే మేము తగ్గించామని అంటున్నారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 2014 నుంచి 2016 వరకు కనీసం ఎంత ఖర్చు చేశారు.. ఎంత పనిచేశారని చూస్తే.. రెండు సంవత్సరాల్లో రూ.265 కోట్లతో కూడిన పని మాత్రమే చేశారు. అప్పటి వరకు మొద్దనిద్రపోయారు.
2016 సెప్టెంబర్‌లో ప్రత్యేక హోదా ఇవ్వలేం.. స్పెషల్ ప్యాకేజీ ఇస్తున్నాం అని అప్పటి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటిస్తే.. అర్థరాత్రి ప్రెస్‌మీట్లు పెట్టి చంద్రబాబు, టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. అసెంబ్లీలో స్పెషల్ ప్యాకేజీపై తీర్మానం పెట్టి పొగిడారు. ఇందుకు సంబంధించి ప్రతీది లేఖలు ఉన్నాయి.
30–09–2016లో ఆర్థికమంత్రి కార్యాలయం ఒక లేఖ విడుదల చేసింది. 2014 వరకు ఇరిగేషన్ కాంపోనెంట్ వరకు ఎంత ఖర్చు అవుతుందో అంత వరకే ఇస్తామని లేఖలో ఉంది. దాంట్లో మళ్లీ నీతి అయోగ్ వైస్ చైర్మన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది అని చెప్పారు.
ప్రాజెక్టును మేమే కట్టేస్తాం.. మాకే అప్పగించండి అని చంద్రబాబు కోరడంతో ప్రాజెక్టును 2013–14 రేట్ల ప్రకారం కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని స్పష్టంగా ఆర్థిక శాఖ నుంచి లేఖ విడుదల చేశారు. కేంద్రం విడుదల చేసిన లేఖకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందా అంటే అదీ లేదు.
అప్పటి ప్రతిపక్ష నేత, మా నాయకుడు వైయస్ జగన్ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. లేదు లేదు మాకు ప్యాకేజీ ముఖ్యం, మేమే నిర్మిస్తామని చంద్రబాబు తీసుకున్నారు. మళ్లీ ఆరు నెలల తరువాత 2017 మార్చిలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 2014 తర్వాత పెరిగిన అంచనాలను చెల్లించలేమంటూ స్పష్టం చేసింది. ఆ సమయంలో కేంద్ర కేబినెట్‌లో టీడీపీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఆనాడు ఎందుకు వారు వ్యతిరేకించలేదు.
2018లో ప్రధాని నరేంద్రమోడీకి చంద్రబాబు లేఖ రాశారు. 2014 అంచనా రేట్లను తొందరగా అప్రూవ్ చేసి మాకు ఆ డబ్బు ఇచ్చేయండి మేము ప్రాజెక్టు నిర్మించుకుంటామని రాశారు.
53 శాతం పనులు పూర్తిచేశామని ఒకపక్క అంటూనే.. దీంట్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. 8 వేల కోట్లు ఖర్చు చేసి 53 శాతం పూర్తయిందని చెబితే.. ప్రాజెక్టు వాల్యూ ఎంత అవుతుందని అనుకుంటున్నారు. 53 శాతం అంటే కేంద్ర ప్రభుత్వం చెప్పిన రూ.20 వేల కోట్లు అవుతుంది తప్ప.. మీరు చెప్పినట్లుగా రూ.50 వేల కోట్లకు మీరు ఖర్చు చేసిన రూ.8 వేల కోట్లు 53 శాతం కిందకు వస్తుందా అని నా సూటి ప్రశ్న.
ఈ రోజు ఇదే సీడబ్ల్యూసీ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్‌కు సంబంధించి హైఎస్ట్ బాడీ లెవల్ ఆఫ్ వాటర్ కమిషన్స్ ఇస్తున్న రిపోర్టు ఏంటీ..?
టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ.5 వేల కోట్లు సీడబ్ల్యూసీకి అని అడ్వయిజ్ చేసింది. రివైజ్డ్ కాస్ట్ కమిటీ రూ. 48 వేల కోట్లు చెబితే దాంట్లో రూ.29 వేల కోట్లు ఆర్ అండ్ ఆర్. లక్షల కుటుంబాలు, దాంట్లో ఎస్సీ, ఎస్టీలు 50 శాతం మంది. అట్లాంటిది రూ.20 వేల కోట్లతో ప్రాజెక్టు కట్టాలని ఆ రోజు 2016–17లో ఒప్పుకున్న మాట వాస్తవం కాదా..? గతంలో చంద్రబాబు చేసిన తప్పు వల్లే ఈ రోజు కేంద్రం కొర్రీలు వేస్తోంది.
టీడీపీ ఈ రోజు సిగ్గులేకుండా మా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. మీరు చేసిన తప్పును మాపై రుద్దుతారా..? 70 శాతం పోలవరం కంప్లీట్ చేశామని సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. రూ.50 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.17 వేల కోట్లు ఖర్చు అయితే అది ఏ విధంగా 70 శాతం పూర్త అయినట్లు. గత ఐదు సంవత్సరాల్లో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ గురించి చంద్రబాబు పట్టించుకోలేదు. రూ.20 వేల కోట్లు తొందరగా తీసుకొని లక్ష కుటుంబాలను ముంచేయాలని చూశారు.
కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు..?. ప్రతి సోమవారం పోలవరంలో చంద్రబాబు ఏం పరిశీలించారు..?. లక్ష మంది నిరాశ్రయ కుటుంబాల గురించి ఎందుకు ఆలోచించలేదు..?. ప్రాజెక్టు నిర్వాసితులను కచ్చితంగా ఆదుకోవాల్సిందే. ఈ విషయాలన్నింటిపైనా త్వరలో ప్రధాని మోదీని కూడా కలుస్తాం. ఆ మేరకు పోలవరంపై కేంద్రానికి సీఎం వైయస్ జగన్ లేఖ కూడా రాస్తారు’ అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.