ముస్లిం సోదరులకు రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపిన వైయ‌స్‌ జగన్‌

తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని వైఎస్‌ జగన్‌ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అల్లా చ‌ల్ల‌ని దీవెన‌లు అంద‌రికీ ఉండాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు

రంజాన్‌ పండుగ సందర్బంగా వైయ‌స్‌ జగన్‌..‘ముస్లింలకు రంజాన్‌ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్‌ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్‌ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్‌ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్‌ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌’ అని అన్నారు.

Back to Top