విజయనగరం: రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరం జిల్లాలో నిర్వహించిన ద్విశత శంకుస్థాపనల మహోత్సవంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అక్టోబర్‌లో వంద పనులకు రూ. 11 కోట్లతో శంకుస్థాపనలు చేశామని, ప్రస్తుతం రూ. 22 కోట్లతో రెండు వందల పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. త్వరలో రూ. 25 కోట్లతో అభివృద్ధి పనులు జరగుతాయని చెప్పారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధిని అనే మాట వినిపించలేదని, ప్రజాధనం మొత్తం దోచుకుతిన్నారన్నారు. అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపించారన్నారు. ఉగాదికి పట్టణంలో అర్హులందరికీ ఇళ్లు ఇచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదన్నారు. నిపుణుల కమిటీ సలహాలతో రాష్ట్ర అభివృద్ధికి ముందడుగులు వేస్తున్నామని, కానీ చంద్రబాబు, అశోక్ గజపతిరాజు లాంటివారు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయని, వాటిని అభివృద్ధి చేయాలన్నది ముఖ్యమంత్రి వైయస్ జగన్ లక్ష్యమని వివరించారు. ఇప్పటికైనా టీడీపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని, ప్రజలు ఎందుకు పక్కన పెట్టారో ఆలోచించుకోవాలని సూచించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ బాధ్యతని ఆయన తెలిపారు. 2014కి ముందు విజయనగరంలో కర్ఫ్యూ రావడానికి ఎవరు బాధ్యులు అని ఆయన ప్రశ్నించారు. రోశయ్య సీఎంగా అఖిలపక్షం సమావేశంలో టీడీపీ విభజనకి మద్దతు తెలిపిందా లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.