మింది ప్రజలు ఏకపక్షంగా మద్దతు తెలపాలి

మింది సభలో మంత్రి గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి

కష్టకాలంలో మా కుటుంబాన్ని ఆదుకున్నది మీరు

చాలా కాలం తర్వాత గాజువాక నుంచి పోటీ చేసే అవకాశం దక్కింది

ఈ ఎన్నికలలో నా విజయానికి సహకరించండి 

విశాఖ‌: ఈ ఎన్నికలలో గాజువాక నియోజకవర్గం నుంచి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు మింది ప్రజలంతా ఏకపక్షంగా ఓటు వేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, గాజువాక నియోజకవర్గం వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. మింది గ్రామ ప్రజలతో ఆదివారం రాత్రి 68 వ వార్డు వైయ‌స్ఆర్‌సీపీ ఇన్చార్జ్ గుడివాడ లతీష్ అధ్యక్షతన మింది కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ  సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ.. ఏ సందర్భం వచ్చినా మింది ప్రజలు నా కుటుంబ సభ్యులుగా నా వెంట నిలబడి ఉంటారన్న  ధైర్యం నాకు ఎప్పుడూ ఉంటుంది అని అన్నారు. తన తండ్రి మరణం తర్వాత మా కుటుంబమంతా ఆవేదనతో ఉన్న సమయంలో మళ్లీ మా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగించేందుకు మింది ప్రజలు అందించిన సహకారాన్ని తాను ఎప్పుడూ మరువలేనని అమర్నాథ్ స్పష్టం చేశారు. 

20 సంవత్సరాలుగా తమను అవమానిస్తూ, ఇబ్బంది పెట్టినవారు ఇప్పుడు మన సహకారం కోసం ఎదురుచూస్తున్నారంటే దానికి కారణం మీరేనంటూ మింది వాసులకు అమర్నాథ్ కృతజ్ఞతలు తెలియజేశారు. గుడివాడ కుటుంబం మూడు తరాల రాజకీయ అనుభవం గురించి దేశ విదేశాలలో కూడా గొప్పగా చెప్పుకుంటున్నారని ఇందుకు తాను గర్వపడుతున్నారని అమర్నాథ్ చెప్పారు. 

ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నాకు అండగా నిలబడ్డారు, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నానంటే దీనికి ముఖ్య కారకులు మీరే" అని అమర్నాథ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. చాలా కాలం తర్వాత తను పుట్టి పెరిగిన ప్రాంతానికి సేవ చేసుకునే అవకాశం లభించిందని అమర్నాథ్ చెప్పారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి పల్లా సింహాచలం, తన తండ్రి గుడివాడ గురునాథరావు పోటీ చేశారని, ఆ ఎన్నికల్లో గురునాథరావు ఘనవిజయం సాధించారని, ఇప్పుడు వారి వారసులం ఎన్నికల బరిలో ఉన్నామని ఈసారి కూడా విజయం గుడివాడ కుటుంబానికి దక్కాలని మంత్రి అమర్నాథ్ పిలుపునిచ్చారు. 

మింది, చుట్టుపక్కల ప్రాంతాలను ఎవరు అభివృద్ధి చేశారన్న విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని, తనకు ఈ ప్రాంత ప్రజలు ఏకపక్షంగా ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా మెలుగుతున్న తనను గెలిపిస్తే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సహకారంతో ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని చెప్పారు.  మీరంతా తన వెంట ఉన్నారన్న ధైర్యంతో ముందుకు సాగుతున్నానని మీ బిడ్డలా నన్ను ఆశీర్వదించండి అని అమర్నాథ్ కోరారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు సరసన కూర్చుని అవకాశం, అలాగే విశాఖకు వచ్చిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన మంత్రులకు స్వాగతం పలికే మహత్తర అవకాశం తనకు లభించింది అంటే అందుకు కారణం మింది ప్రజల ఆశీస్సులే అని అమర్నాథ్ చెప్పారు.
 

Back to Top