అసెంబ్లీ: దేశ చరిత్రలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని గృహ నిర్మాణ వాఖ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో పేదల కష్టాలు కళ్లారా చూశారు.. నిలువనీడ లేని పేదలందరికీ గూడు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నవరత్నాలలో పేదలందరికీ ఇళ్లు పథకం తీసుకువచ్చారన్నారు. ఇచ్చిన మాట కంటే మిన్నగా సుమారు 30 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి.. ఇళ్లు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్ భూమి, పట్టణ ప్రాంతంలో సెంట్ భూమి లబ్ధిదారులకు అందజేయనున్నాం. 30.60 లక్షల మంది లబ్ధిదారులకు రూ.23,500 కోట్లు విలువైన 68 ఎకరాలను కేటాయించాం. ప్రైవేట్ భూమి కొనుగోలు కోసం సుమారు రూ. 8,800 వేల కోట్లు కేటాయించామని వివరించారు. అసెంబ్లీలో మంత్రి శ్రీరంగనాథరాజు మాట్లాడుతూ.. ‘పీఎంఏవై అర్బన్ పథకం ద్వారా దేశంలో మొట్టమొదటి సారిగా 1.08 లక్షల ఇళ్లు కేటాయించగా.. గత ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేవలం 2.98 లక్షల ఇళ్లు మాత్రమే వచ్చాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవతో 14 లక్షల ఇళ్లను కేంద్రం నుంచి రాబట్టాం. మన ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం చేపట్టిన భూసేకరణను కేంద్రమంత్రి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు. వైయస్‌ఆర్ జగనన్న కాలనీల పేరుతో లేఅవుట్లను చేస్తూ సుమారు 17,500 కాలనీలను నిర్మించనున్నాం. ఈ కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీ, కరెంట్, వాటర్ వంటి మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం. గత ప్రభుత్వంలో స్థలాలు ఇచ్చి వదిలేసేవారు.. మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో గత 30 సంవత్సరాలుగా నిరుపయోగంగా పడిఉన్నాయి. సుమారు 17,500 వైయస్‌ఆర్ కాలనీల నిర్మాణానికి అవసరమైన నీటి కోసం రూ. 920 కోట్ల ఖర్చుకు ఆమోదం తెలిపారు. శాశ్వత నీటి వసతి, విద్యుత్ కోసం సుమారు రూ.6800 కోట్లు కేటాయించారు. పేదవాడికి ఉచితంగా ఇచ్చి.. ఇంటి నిర్మాణం, అన్నీ కలుపుకొని సుమారు రూ.10 నుంచి 15 లక్షల వరకు అవుతుంది. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి 24 లక్షల మందికి స్థలాలు ఇచ్చి.. ఇళ్లను కట్టించారు. ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్ ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తూ.. ఇళ్లు కట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసి పేదవాడికి సెంట్ స్థలం ఇవ్వని వ్యక్తి చంద్రబాబు ఒక్కరే. గడిచిన ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క ఇళ్లు కూడా పూర్తి చేయలేదు. 6 లక్షల ఇళ్లను నిర్మాణం చేస్తున్నామని చెప్పి కాంట్రాక్టర్లకు రూ.1432 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. టీడీపీ పెట్టిన రూ.1432 కోట్లు చెల్లిస్తున్నాం. మొదటి దశలో 15 లక్షల పైచిలుకు ఇళ్ల నిర్మాణం చేయడానికి రూ.28 వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. ఆ ఇంటిపై లబ్ధిదారుడికి పూర్తిహక్కును కలిస్తూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నూతన డాక్యుమెంట్ రూపొందించారు. దానిపై కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తాం. వంద శాతం క్వాలిటీ లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇళ్ల నిర్మాణం కోసం మెటీరియల్‌కు రివర్స్‌టెండరింగ్ నిర్వహిస్తున్నాం. పేదల ఇళ్లకు ఉచితంగా అందిస్తున్నాం’ అని చెప్పారు.