న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుపై తలెత్తిన వివాదం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. రాజధానిపై నిర్ణయిం తీసుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే ఉంటుందని గతంలో కేంద్ర ప్రభుత్వం విస్పష్టంగా ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ హై కోర్టు కొట్టివేస్తూ ఇచ్చిన తీర్పు నేపథ్యంలో దీనిపై కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటి అని వైయస్ఆర్‌సీపీ సభ్యులు బుధవారం రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ అంశం ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని సెక్షన్ 5, 6కు అనుగుణంగా నూతన రాజధాని ఏర్పాటుకు ఉన్న ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదికను తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు అమరావతిని రాష్ట్ర రాజధాని నగరంగా ప్రకటిస్తూ 2015 ఏప్రిల్ 23న రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. తదనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీసీఆర్‌డీఏ చట్టం, 2020ని రద్దు చేసింది. శాసన రాజధానిగా అమరావతి, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు నగరాలను ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సంఘటిత అభివృద్ధి చట్టం, 2020 (ఏపీడీఐడీఏఆర్)ని తీసుకువచ్చిందని మంత్రి వివరించారు. ఈ చట్టం చేసే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని అన్నారు. తదుపరి రాష్ట్ర ప్రభుత్వం 2021లో ఈ చట్టాన్ని రద్దు చేసింది. మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్ హై కోర్టు తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ అప్పీల్ (సివిల్)ను దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ అంశం విచారణలో ఉందని మంత్రి చెప్పారు. హైవే నిర్మాణాల్లో వేస్ట్ మెటీరియల్ వినియోగం జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, ఇనుము, స్టీల్, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను విరివిగా వినియోగిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2019 నుండి ఈఏడాది జనవరి వరకు ఆంధ్రప్రదేశ్లో 209 కిలోమీటర్ల మేర జాతీయ రహదార్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు వినియోగించినట్లు తెలిపారు. అలాగే హైవేల నిర్మాణంలో 359 లక్షల మెట్రిక్ టన్నుల పైబడి ఫ్లై యాష్ (థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద), 7.28 లక్షల టన్నులు నిర్మాణ, కూల్చివేత వ్యర్ధాలు వినియోగించినట్లు, 68 కిలోమీటర్లు మేర రహదారి నిర్మాణంలో ఇనుము, స్టీల్ స్లాగ్ వ్యర్దాలు వినియోగించినట్లు తెలిపారు. దేశంలోని అన్ని జాతీయ రహదారుల నిర్మాణంలో ప్లాస్టిక్, ఇనుము, నిర్మాణ రంగ వ్యర్దాలు, ఇతర వ్యర్థాలు, ఫ్లై యాష్ వినియోగించే విధంగా రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ విధాన పరమైన మార్గదర్శకాలు జారీ చేయడంతోపాటు, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ మాన్యువల్స్ కూడా ప్రచురించినట్టు మంత్రి తెలిపారు.