విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై మీ వైఖరి ఏమిటో చెప్పండి

ఎన్డీఏ కూటమికి బొత్స సత్యనారాయణ సూటి ప్రశ్న

ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు

ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎందాకైనా పోరాడతాం

వీఎస్‌పీపై వైయస్సార్‌సీపీది తొలి నుంచీ ఒకే విధానం

నాడు అభ్యంతరం చెప్పడం వల్లనే ప్రైవేటీకరణ ఆగింది

:మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టీకరణ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఈ ప్రాంతానికే పరిమితం కాదు

ఇది మొత్తం రాష్ట్ర ప్రజల సెంటిమెంట్‌ వ్యవహారం

ఉద్యమాలు, 32 మంది బలిదానంతో స్టీల్‌ ప్లాంట్‌

అలాంటి ప్లాంట్‌ను అమ్మేసే చర్యలు అతి దారుణం

గుర్తు చేసిన బొత్స సత్యనారాయణ

కేంద్ర ప్రభుత్వంలో మిత్ర పక్షాలకు ప్రాధాన్యం 

కాబట్టి ప్లాంట్‌ను కాపాడుకునేందుకు కృషి చేయాలి

స్టీల్‌ ప్లాంట్‌పై సీఎం, డిప్యూటీ సీఎం నోరెత్తడం లేదు

ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యే చెరోమాట మాట్లాడుతున్నారు

ఇకనైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తమ వైఖరి చెప్పాలి 

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన బొత్స సత్యనారాయణ

విశాఖపట్నం: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కేవలం ఉత్తరాంధ్ర, విశాఖ ప్రాంతానికే కాకుండా, మొత్తం రాష్ట్రానికి సంబంధించిన అంశమని, అది రాష్ట్ర సెంటిమెంట్‌తో ముడి పడి ఉందని, 32 మంది బలిదానాలతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిందని మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తెన్నేటి విశ్వనాథం వంటి నాయకులు స్టీల్‌ ప్లాంట్‌ కోసం ఎంతో కృషి చేశారన్న ఆయన, ఆ ప్లాంట్‌ కోసం రైతులు 32 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తు చేశారు. అంత ప్రాధాన్యత ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను 2008లో వైయస్ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు, ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ ఉన్నప్పుడు సుమారు రూ.11 వేల కోట్లతో కంపెనీని విస్తరించారని బొత్స చెప్పారు. విశాఖపట్నం క్యాంప్‌ ఆఫీస్‌లో మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు.

    అలాంటి పరిశ్రమను ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రైవేటీకరణ దిశగా తీసుకుపోతున్నారన్న మండలి విపక్షనేత, ఒకరి మీద ఒకరు నిందించుకోవడానికి ఇది సందర్భం కాదని, గతంలో ఆ పరిశ్రమను ఎలా కాపాడుకున్నారో ఆలోచించాలని అన్నారు. గతంలో కూడా ఇలా ప్రైవేటీకరణ దిశలో ఆలోచించినప్పుడు, నాటి సీఎం వైయస్‌ జగన్, చాలా స్పష్టంగా చెప్పారని, ఇక్కడికి వచ్చి వీఎస్‌పీ కార్మిక సంఘాల నాయకులను కలిసి మాట్లాడారని, కేంద్రానికి లేఖ కూడా రాశారని గుర్తు చేశారు.
    ఆనాడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే, ఇక్కడ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉందన్న బొత్స సత్యనారాయణ, ఆ సమయంలో కేంద్రంలో ఎన్డీఏలో కీలకమైన బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండగా.. ఈరోజు ఆ పరిస్థితి లేదని, కేంద్రంలో మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఉందని, వాటిపై ఆధారపడి ప్రభుత్వం కొనసాగుతోందని గుర్తు చేశారు. 
    ఇప్పుడు వ్యూహాత్మకంగా స్టీల్‌ ప్లాంట్‌ను అమ్మేసే దిశలో వెళ్తున్నారని, రెండు ఫర్నేస్‌లు ఆపేశారని.. ఈ సమయంలో కూడా అధికార పార్టీ నాయకులు ఒక్కో మాట మాట్లాడుతూ.. అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని.. ఎమ్మెల్యే ఒకమాట. ఎంపీ ఒక మాట మాట్లాడుతున్నారని మండలి విపక్షనేత ఆక్షేపించారు.
    కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, వారి విధానం ఏమిటో చెప్పాలని, వీఎస్‌పీ ప్రైవేటీకరణకు వ్యతిరేకమా? కాదా? చెప్పాలని.. ఏ విషయాన్ని సీఎం, డిప్యూటీ సీఎంతో చెప్పించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్‌ చేశారు. ఇది ప్రజల మనోభావాలతో ముడి పడి ఉన్న అంశం కాబట్టి రాజకీయాలకు తావు లేదని తేల్చి చెప్పారు.
    అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇక్కడకు వచ్చిన తమ అధినేత ఒక విషయం స్పష్టంగా చెప్పారన్న మండలి విపక్షనేత.. మీరు కూటమిని గెలిపించుకుంటే, స్టీల్‌ ప్లాంట్‌ అమ్మేస్తారని చెప్పారని గుర్తు చేశారు. 
    అలాగే, నాడు ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు ఏమన్నారు? ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్‌కళ్యాణ్‌ ఏమన్నారో గుర్తు చేసుకోవాలన్న ఆయన, ఆ మాటలకే వారు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. వారి మాటలు నమ్మి ప్రజలు గెలిపించారు కాబట్టి, ఆనవాయితీ ప్రకారం మోసం చేయకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.
    దేశంలో చాలా చోట్ల పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాటాలు జరిగితే, ఇక్కడ అందుకు భిన్నంగా జరిగిందని, పరిశ్రమ కోసం ఉద్యమించారని, 32 మంది అమరులయ్యారని గుర్తు చేసిన బొత్స, అందుకే స్టీల్‌ ప్లాంట్‌పై వారి విధానం ఏమిటి అన్నది ప్రకటించాలని కోరారు. కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించానని డిప్యూటీ సీఎం చెప్పారని ప్రస్తావించిన మండలి విపక్షనేత, ఇప్పుడు స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం మళ్లీ ఆ పని చేయాలని కోరారు.
    ‘ఒక్కటే అడుగుతున్నాం. స్టీల్‌ ప్లాంట్‌ను ఇలాగే కొనసాగిస్తారా? లేక ప్రైవేటీకరిస్తారా? ప్రధానిగారు కూడా సమాధానం చెప్పాలి. విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి, ప్రధానిగారిని అడిగి ఏ విషయం చెబుతామని చెప్పారు. కాబట్టి, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై మీ విధానం ఏమిటన్నది చెప్పాలని ప్రధానిగారిని కూడా కోరుతున్నాం’.
    ‘ఇది మా ఆత్మగౌరవానికి, ఇక్కడి ప్రజలకు సంబంధించిన అంశం.
విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుందా? లేదా?
వెంటనే అడ్డుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడాలని స్పష్టంగా కోరుతున్నాం’ అని మండలి విపక్షనేత స్పష్టం చేశారు.
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడతామన్న బొత్స సత్యనారాయణ, తమకు రాజకీయ పార్టీలు ముఖ్యం కాదని, ప్రజాబలంతో పోరాడతామని చెప్పారు.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
    ‘అమరావతిలో రాజధాని కోసం రైతులు 35 వేలకు పైగా ఎకరాల భూమి ఇచ్చారని గొప్పగా చెబుతున్నారు కదా.. ఇక్కడి రైతులు కూడా 32 వేల ఎకరాలు ఇచ్చారు. ఆ విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నారు?. ప్రధానిగారు ఇప్పటికైనా తమ విధానం ఏమిటో చెప్పాలి? పీఎం, సీఎం స్పందించాలి’ అని మండలి విపక్షనేత స్పష్టం చేశారు.
    విజయవాడ వరదల బాధితులకు తమ పార్టీ నుంచి కోటి రూపాయల విలువైన సాయం చేశామన్న బొత్స సత్యనారాయణ, ఇప్పటికే లక్ష పాల ప్యాకెట్లు, రెండు లక్షల వాటర్‌ బాటిళ్లు ఇచ్చామని, ఒకటి, రెండు రోజుల్లో  50 వేల కుటుంబాలకు గ్రోసరీ అందజేయనున్నామని చెప్పారు.

Back to Top