గుంటూరు: నిరుపేద విద్యార్థులకు కూడా వైద్య విద్యను అందుబాటులోకి తేవడానికి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి గత ప్రభుత్వ హయాంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల పనులు మొదలుపెట్టారని, వాటన్నింటినీ ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రేవేటీకరణ చేయాలనుకోవడం దుర్మార్గపు ఆలోచన అని మాజీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఇది పెద్ద స్కామ్ అన్న ఆమె.. దీని వెనక భారీ అవినీతి, కుట్ర ఉందని ఆరోపించారు. గుంటూరులోని తన నివాసంలో మాజీ మంత్రి విడదల రజని మీడియాతో మాట్లాడారు. వైద్య విద్యను మరింత అందుబాటులోకి తేవడంతో పాటు, రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలందేలా దాదాపు రూ.8 500 కోట్ల వ్యయంతో గత ప్రభుత్వంలో సీఎం శ్రీ వైయస్ జగన్, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారని మాజీ మంత్రి తెలిపారు. ఇప్పుడు వాటిని ‘4పీ’ పేరుతో అప్పనంగా ప్రైవేటుపరం చేయడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని చెప్పారు. ఇది ఒక పెద్ద స్కామ్ అని ఆమె అభివర్ణించారు. స్వాతంత్య్రానికి పూర్వం రాష్ట్రంలో 1923లో తొలి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయగా, ఆ తర్వాత 100 ఏళ్ల వరకు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే అని, ఆ పరిస్థితుల్లో జగన్‌గారు ఒకేసారి 17 కాలేజీల పనులు మొదలుపెట్టి, గత విద్యా సంవత్సరం (2023–24)లో అయిదు కాలేజీలు ప్రారంభించారని, మళ్లీ ఆయనే సీఎం అయి ఉంటే ఈ ఏడాది (2024–25)లో మరో 5 కాలేజీలు, వచ్చే ఏడాది (2025–26) మిగిలిన 7 మెడికల్ కాలేజీలు ప్రారంభమై ఉండేవని వెల్లడించారు. గత ఏడాది ప్రారంభమైన మెడికల్ కాలేజీల ద్వారా కొత్తగా 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రాగా, ఈ ఏడాది ఒక్క పాడేరు కాలేజీలో మాత్రమే 50 సీట్లు వచ్చాయని విడదల రజని తెలిపారు. పులివెందుల కాలేజీకి 50 సీట్లు ఇస్తామని జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) ప్రకటిస్తే.. వద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడం దుర్మార్గమని ఆగ్రహించారు. పులివెందుల అంటే ఎందుకంత ద్వేషం? అన్న ఆమె, కేవలం రాజకీయ కక్షతో ఇలా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయని ఆవేదన చెందారు. జగన్‌గారికి మంచి పేరు వస్తుందన్న దురాలోచన, దుగ్దతో కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే, మెడికల్ సీట్లన్నీ కన్వీనర్ కోటాలోనే భర్తీ చేస్తామని, మెడికల్ సీట్ల భర్తీపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓను 100 రోజుల్లో రద్దు చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించిన టీడీపీ కూటమి పెద్దలు, ఇప్పుడు ఎందుకు నోరు మెదపడం లేదని మాజీ మంత్రి సూటిగా ప్రశ్నించారు. పేద విద్యార్థుల ఆశలను బలి చేయవద్దన్న విడదల రజని, కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.