విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతరకరం

ట్రిపుల్‌ తలాక్‌ చట్టం వివక్షపూరితంగా ఉంది

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి 

న్యూడిల్లీ: విడాకులు ఇచ్చిన కారణంగా జైలు శిక్ష అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని.. విడాకుల కేసుకు మూడేళ్ల జైలు శిక్ష అభ్యంతరకరమని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ట్రిపుల్‌ తలాక్‌ చట్టం ముస్లిం పురుషుల పట్ల వివక్షపూరితంగా ఉందని అన్నారు. చట్టం అనేది అందరికీ సమానంగా ఉండాలని పేర్కొన్నారు. గురువారం లోక్‌సభలో ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...వివాహమనేది సివిల్‌ కాంట్రాక్ట్‌ అయినపుడు, దాని పరిణామాలు కూడా సివిల్‌గానే పరిగణించాలని అభిప్రాయపడ్డారు. 
ఈ చట్టం కారణంగా భర్త జైలులో ఉంటే భార్యకు రావాల్సిన ఆర్థిక సహాయం ఎలా అందుతుందని ప్రశ్నించారు. ఒక మతాన్ని దృష్టిలో పెట్టుకుని చట్టం చేయకూడదని సూచించారు. అభద్రత వల్ల ఉగ్రవాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బిల్లుపై చర్చ సందర్భంగా మహిళా సాధికారికతకు, వివిధ రంగాల్లో వారి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని మిథున్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Back to Top