మంగళగిరి: వలంటీర్లపై కామెంట్లు చేసిన పవన్ కల్యాణ్‌పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై పవన్ దగ్గరున్న లెక్కలేంటో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నోటీసులు జారీ చేశారు. పవన్ కల్యాణ్ కామెంట్లపై మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు మహిళా సంఘాలు, గ్రామ, వార్డు సచివాలయాల వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు వలంటీర్లపై కామెంట్లు చేసిన పవన్ కల్యాణ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీచేసింది. మహిళల మిస్సింగ్ వ్యాఖ్యలపై పది రోజుల్లో సమాధానం చెప్పాలని నోటీస్‌లో పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు ఆందోళన కలిగించేవిగా ఉన్నాయన్నారు. తమను సంఘ విద్రోహలుగా ముద్ర వేస్తున్నారంటూ వలంటీర్లు ఆవేదన చెందుతున్నారని, ఆధారాల్లేకుండా కామెంట్లు చేయడం పవన్ కల్యాణ్‌కు తగునా..? అని ప్రశ్నించారు. ఒంటరి మహిళలను అవమానించేలా పవన్ మాట్లాడారని మండిపడ్డారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన వివరాలను పవన్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై పవన్ దగ్గరున్న లెక్కలేంటో పది రోజుల్లో వివరించాలని నోటీసులిచ్చామన్నారు. ఏడాది కాలంగా 1400 మహిళల మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, మిస్సింగ్ కేసుల ఇన్వెస్టిగేషనుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాం, 96 శాతం మిస్సింగ్ కేసుల్లో మహిళలను తిరిగి ఇళ్లకు చేరుస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మిస్సింగ్ కేసులు లేవా..? అని పవన్‌ను ప్రశ్నించారు. పవన్ టెర్రరిజం క్రియేట్ చేస్తున్నాడని, కుట్రలో భాగంగానే పవన్ మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. ప్రేమల పేరుతో తీసే సినిమాల ప్రభావం టీనేజ్ అమ్మాయిల మిస్సింగుకు కారణం కాదా..? హ్యూమన్ ట్రాఫికింగ్‌పై సినిమా రంగానికి బాధ్యత లేదా..? దీనికి పవనేం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు. వలంటీర్లపై చేసిన ఆరోపణలపై పవన్ వివరాలివ్వాలని, లేకుంటే మహిళలకు పవన్ క్షమాపణ చెప్పాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.