చంద్రబాబూ.. మీ అనుభవం ఏమైంది?

మీడియా స‌మావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని సూటి ప్ర‌శ్న‌

కాలక్షేపం కోసమే శ్వేతపత్రాలు! 

విద్యుత్‌ ఛార్జీలు తగ్గిద్దామని పవన్‌ కల్యాణ్‌ కూడా చెప్పారు

చెత్త పన్ను కొనసాగిస్తున్న మిమ్మల్ని ఏమనాలి?

తాడేప‌ల్లి: రాష్ట్రంలో కూటమి పాలన 35 రోజులు పూర్తయ్యింది, తన అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, అస‌లు ఆయ‌న అనుభ‌వం ఏమైంద‌ని మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్ర‌శ్నించారు. నాలుగు అసత్యాలు.. పది అబద్ధాలతో చంద్రబాబు శ్వేత పత్రాలు ఉన్నాయ‌ని, నెల రోజులుగా కాల‌క్షేపం చేస్తూ వైయ‌స్ జ‌గ‌న్‌ను దూషించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌ని మండిప‌డ్డారు. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు.

పేర్ని నాని ఏమ‌న్నారంటే..

 అదేగా మీ భయం?:
    ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తిస్థాయి బడ్జెట్‌ కూడా ప్రవేశపెట్టలేని దుస్థితిలో చంద్రబాబు అనుభవం ఉందని, ఆ పని చేస్తే.. రాష్ట్ర అప్పులపై తమ విష ప్రచారం నిగ్గు తేలుతుందన్న భయం ప్రభుత్వంలో నెలకొందని.. అందుకే ఆ దిశలో ఆలోచించడం లేదని మాజీ మంత్రి  పేర్ని నాని స్పష్టం చేశారు.
    ఆనాడు 2019లో తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర ఖజానాలో కేవలం రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయని, అయినప్పటికీ పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడిన తరవాత ఆ ఏడాది జూలై 12న అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టామని ఆయన వెల్లడించారు. 
    ఎన్నికల ముందు లెక్కకు మించి హామీలు గుప్పించిన చంద్రబాబు, అందుకు నిధుల గురించి ప్రస్తావిస్తే.. సంపద సృష్టిస్తామంటూ ప్రగల్భాలు పలికారని.. కానీ, ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవంటూ ప్రజలందరికీ చెప్పాలని ఆయన సూచిస్తున్నారన్న శ్రీ పేర్ని నాని.. ఇది పచ్చి మోసం కాదా? అని నిలదీశారు.

కేంద్రం నుంచి నిధులు:
    గత నెలలో తమ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఖజానాలో పెద్ద మొత్తంలో నిధులు ఉన్నాయని మాజీ మంత్రి శ్రీ పేర్ని నాని తెలిపారు. జూన్‌ 12న, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయగా, అంతకు రెండు రోజుల ముందే కేంద్రం నుంచి రూ.5,655.72 కోట్ల నిధులు వచ్చాయని ఆయన తెలిపారు. డబుల్‌ డెవల్యూషన్‌ ద్వారా ఆ నిధులు వచ్చిన మాట వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు.

అవి మా వల్లే వచ్చాయి
    నిజానికి ఆ నిధుల రాకకు తమ ప్రభుత్వమే కారణమని పేర్ని నాని చెప్పారు. తమ హయాంలో రెవెన్యూ వసూళ్లు కేంద్రం వద్ద జమ అయితే, రాష్ట్ర జనాభా దామాషా ప్రకారం, కేంద్రం ఆ నిధులు తిరిగి పంపించిందని తెలిపారు.

సూపర్‌సిక్స్‌ అమలు చేయలేక..:
    ఎన్నికల ముందు అట్టహాసంగా ప్రకటించిన సూపర్‌సిక్స్‌ను అమలు చేయలేక, వాటికి తగిన నిధులు కేటాయించలేకనే.. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు లేదనిపిస్తోందని శ్రీ పేర్ని నాని అభిప్రాయపడ్డారు.
    ఎన్నికల హామీల విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే.. మీ సూపర్‌సిక్స్, పవన్‌కళ్యాణ్‌ షణ్ముఖ వ్యూహం.. ఈ రెండింటికీ ఎంత బడ్జెట్‌ కేటాయిస్తారు? అలా మొత్తం ఎంత ఖర్చు చేయబోతున్నారో.. చెప్పాలని శ్రీ పేర్ని నాని డిమాండ్‌ చేశారు. ఆ ధైర్యం లేకనే.. ఆర్డినెన్స్‌ లేదా ఓటాన్‌ అకౌంట్‌కు మొగ్గు చూపుతున్నారని అన్నారు. అలా అయితేనే గుట్టు చప్పుడు కాకుండా బిల్స్‌ పాస్‌ చేసేయొచ్చని, వాటిలో అప్పులు, పథకాలకు కేటాయింపులు, శాఖలకు డిమాండ్లు కూడా చూపించాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

ఇలాంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?:
    పూర్తి మెజారిటీతో ఏర్పడిన ప్రభుత్వం, పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టకపోవడం దేశంలో ఎక్కడైనా ఉందా? అని శ్రీ పేర్ని నాని ప్రశ్నించారు. నాడు అప్పులపై పూర్తి అసత్యాలు ప్రచారం చేసిన టీడీపీ, కూటమి నేతలు.. ఇప్పుడు అప్పటి ప్రభుత్వం కంటే, ఎక్కువ అప్పు చేస్తున్నారని, ఈ నెల రోజుల్లోనే పరిమితికి మించి అప్పు చేశారని.. ఆర్‌బీఐ నుంచి రూ.10 వేల కోట్లు తీసుకున్నారని పేర్కొన్నారు.
    ఇప్పటికే ఉచిత ఇసుక కార్యక్రమం కొండెక్కగా.. తల్లికి వందనం కోత పెట్టే ప్రయత్నం చేస్తూ.. పథకం అమలు కోసం మల్లగుల్లాలు పడుతున్నారని శ్రీ పేర్ని నాని అన్నారు. 

అబద్ధాల శ్వేతపత్రాలు:
    ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేని దుస్థితిలో.. వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే.. పర్యటనలు, శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు నెట్టుకొస్తున్నారని శ్రీ పేర్ని నాని వ్యాఖ్యానించారు.
    ‘రాష్ట్రంలో ఏం మారింది? అపార అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, తన అనుభవంతో ఏం అడుగులు ముందుకు వేయించారు?. ఈ 35 రోజుల్లో ఏం సంపదకు మొగ్గలు వచ్చాయి’?. వీటన్నింటికీ సమాధానం చెప్పాలని శ్రీ పేర్ని నాని డిమాండ్‌ చేశారు.
    అప్పు చేసి పెంచిన పెన్షన్‌ ఇవ్వడం తప్ప, ఈ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని ఆయన ఆక్షేపించారు. పచ్చి అబద్ధాలు, అసత్యాలతో శ్వేతపత్రాలు విడుదల చేయడం, గత ప్రభుత్వంపైనా, జగన్‌గారిపైనా నిందలు వేయడంతోనే.. సీఎం చంద్రబాబు ఈ 35 రోజులు గడిపారని దుయ్యబట్టారు. జగన్‌గారిని తీవ్రస్థాయిలు దుర్భాషలాడడం, వ్యక్తిత్వ హననం చేస్తూ దూషించడమే చంద్రబాబుగారి పనిగా మారిందని అన్నారు.

ఒక్కదానికైనా ఆధారాలు చూపారా?:
    ఇప్పటి వరకు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో గత మా ప్రభుత్వంపైనా, మాపైనా అనేక నిందారోపణలు చేశారు. జగన్‌గారిని వ్యక్తిగతంగా దూషించారు. కానీ, ఏ ఒక్క దానిలో అయినా, ఏ ఒక్క విషయంలో అయినా, ఆరోపణల్లో అయినా, ఒక్కటంటే ఒక్క ఆధారం చూపగలిగారా? అని శ్రీ పేర్ని నాని గట్టిగా నిలదీశారు.
    ‘నిజానికి శ్వేతపత్రాలన్నీ కాలక్షేప బఠాణీలు మాత్రమే, రోజులు హరించడానికి, కాలక్షేపానికి తప్పితే.. వాటి వల్ల రాష్ట్రానికి ఉపయోగపడేది ఒక్కటైనా ఉందా?’ అని ప్రశ్నించారు.

వాటికి సమాధానం లేదు:
    శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు.. కేవలం ఆరోపణలు చేస్తున్నారు. మరి వాటిపై చర్య తీసుకుంటారా? అని అడిగితే సూటిగా సమాధానం చెప్పడం లేదని శ్రీ పేర్ని నాని గుర్తు చేస్తూ.. ప్రజలు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఏదేదో మాట్లాడుతున్నారని చెప్పారు.
    చివరకు పోలవరం మీరే 72 శాతం పూర్తి చేశామని చెబుతున్నారు కదా!. మిగతా 28 శాతం ఎప్పుడు పూర్తి చేస్తారని పోలవరం శ్వేతపత్రం విడుదల సందర్భంగా అడిగిన ప్రశ్నకు కూడా చంద్రబాబు సమాధానం చెప్లేకపోయారని గుర్తు చేశారు. అలాగే అమరావతి నిర్మాణాలు, వాటి వ్యయంపైనా ఆయన సమాధానం చెప్పలేదని, విద్యుత్‌ సరఫరాలో ట్రూఅప్‌ ఛార్జీల రద్దుపై అడిగిన ప్రశ్నకు కూడా సూటిగా సమాధానం చెప్పలేదని తెలిపారు.

ఎవరు చెత్త ముఖ్యమంత్రి?
    చెత్త ఎత్తినందుకు రోజుకు రూ.3 వసూలు చేయాలని పవన్‌ కల్యాణ్‌ చెప్పినట్లుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లలో వచ్చిందన్న శ్రీ పేర్ని నాని.. మరి తమ ప్రభుత్వ హయాంలో కూడా అదే జరిగింది కదా? అని గుర్తు చేశారు. నిజానికి హయాంలో ఇంకా తక్కువ.. నెలకు రూ.30 నుంచి రూ.60 వరకు మాత్రమే వసూలు చేశామని తెలిపారు.
     ఆ పన్ను వసూలుకే నాడు జగన్‌గారిని చెత్త సీఎం అంటూ.. తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ, విమర్శలు గుప్పించారన్న శ్రీ పేర్ని నాని.. మరి ఇప్పుడు ఎవరు చెత్త సీఎం? అని నిలదీశారు.

అప్పులపై విష ప్రచారం:
    తమ ప్రభుత్వ హయాంలో పరిమితికి మించి అప్పులు చేస్తున్నామంటూ.. టీడీపీ కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేశారని, మరోవైపు ఎల్లో మీడియాలో రోజూ కథనాలతో విషం చిమ్మారని శ్రీ పేర్ని నాని గుర్తు చేశారు. చివరకు ఇప్పుడు రాష్ట్ర అప్పులు, వాస్తవం కంటే చాలా ఎక్కువ ఉన్నట్లు చూపాలని సీఎం చంద్రబాబు, అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆయన అన్నారు.
    తాము రూ.15 లక్షల కోట్ల అప్పులు చేశామంటూ.. ఎన్నికల ముందు వరకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, బీజేపీ పురందేశ్వరి కలిసి అదే పనిగా విష ప్రచారం చేశారని ప్రస్తావించారు. నిజానికి అప్పుడు రాష్ట్ర అప్పులు రూ.4 లక్షల కోట్ల చిల్లర మాత్రమే అని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా చెప్పారని ఆయన గుర్తు చేశారు.

దమ్ముంటే భూ కబ్జాలు నిరూపించాలి
    తమ పార్టీ నేతలు ఎక్కడికక్కడ అసైన్డ్‌ భూములు కబ్జా చేశారని నిస్సిగ్గుగా సీఎం చంద్రబాబు, ఆరోపణలు చేశారని శ్రీ పేర్ని నాని ఆక్షేపించారు. నిన్న (15వ తేదీ) శ్వేతపత్రం విడుదల చేస్తూ, చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారని, నిరాధార ఆరోపణలు చేశారని ఆయన స్పష్టం చేశారు. నిజంగా ఆయనకు దమ్ముంటే తమ భూకబ్జాలు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. 
    వాస్తవానికి తమ ప్రభుత్వం రైతులు, నిరుపేదలకు మేలు చేస్తూ.. అనేక భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించిందని, అనేక చోట్ల రైతులు, పేదలకు భూములపై హక్కులు కల్పించిందని శ్రీ పేర్ని నాని గుర్తు చేశారు.
    ‘అధికారం మీ చేతిలో ఉంది. కాబట్టి, ఎవరి పేరు మీద నుంచి ఎవరి పేరు మీదకు ఫ్రీ హోల్డ్‌ ల్యాండ్‌ బదిలీ అయ్యిందో నిరూపించాలని’ ..  పేర్ని నాని సీఎంకు సవాల్‌ చేశారు. తమ ప్రభుత్వంలో ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి దళితుల భూములను బదలాయించుకున్నాడో నిరూపించాలని ఆయన కోరారు.

అసెంబ్లీకి హాజరవుతాం:
    తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని పేర్ని నాని వెల్లడించారు. వైయ‌స్ జగన్‌గారితో సహా, మొత్తం 11 మంది ఎమ్మెల్యేలూ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా, కేవలం బూతులు తిట్టడానికే మంత్రులకు అవకాశం ఇచ్చిన రోజుల్లో.. తాము సభను బాయికట్‌ చేశామని పేర్ని నాని వివరించారు.

మీడియా ముసుగులో..:
    మీడియా ముసుగులో కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మండిపడ్డారు. విజయసాయిరెడ్డి గానీ, చంద్రబాబు గానీ, పేర్ని నాని గానీ.. ఎవరైనా సరే.. ప్రజా జీవితంలో ఉన్న వారి మీద ఎవరైనా విమర్శలు చేసినప్పుడు ఆ విమర్శ ఆధారాలు లేనిదై™ó... హుందాగా ప్రచురించక పోవడం, ప్రసారం చేయకపోవడం మీడియాలో జరగడం లేదని ఆయన ఆక్షేపించారు. 
    ఇటీవలి కాలంలో మీడియా అంతా రాజకీయ రంగులు పులుముకుని ఉందని, అందుకే.. ఒక వార్తను ప్రచురించినా లేక ప్రసారం చేసినా.. ఫలానా వ్యక్తి ఆరోపించారు అని చెప్పాలి.. కానీ అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.

గతి తప్పిన మీడియా:
    విజయసాయిరెడ్డిగారి గురించి ఒక వ్యక్తి ఆరోపణలు చేస్తే.. వాటిపై కనీసం ఆయన వివరణ కూడా తీసుకోకుండా, మాట్లాడే ప్రయత్నం కూడా చేయకుండా.. ఏకంగా ఒక ఛానల్‌ సీఈఓ.. ఆ ఆరోపణలపై డిబేట్‌ పెట్టడం, అందులో నీచంగా మాట్లాడడం అత్యంత దారుణమని, అది పూర్తిగా దిగజారి పోవడమే అని పేర్ని నాని స్పష్టం చేశారు. ఛానల్‌ను హుందాగా నడపాల్సింది పోయి నిరాధారంగా వ్యక్తిత్వ హననం చేస్తూ.. మనిషిని మానసికంగా చంపే ప్రయత్నం చేయడం అత్యంత హేయమని ఆయన అభివర్ణించారు.

అది సరికాదు:
    అటు రాజకీయంగా చంపటానికి దుష్ప్రచారాలు, ఇటు మనిషిని మానసికంగా కూడా పతనం చేయడం కోసం ఈరకమైన పైశాచికం ప్రదర్శించడం, డిబేట్‌ పెట్టడం ఏ మాత్రం సరికాదని శ్రీ పేర్ని నాని తేల్చి చెప్పారు. ఇంకా దానికి కొనసాగింపుగా పార్టీ మహిళా కార్యకర్తలతో అదేపనిగా టీవీలో తిట్టించడం అత్యంత హేయమన్న ఆయన, ఇది దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. 
    మీడియా పేరుతో, మీడియా ముసుగులో ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్న వారిని.. వారి వదిలేస్తున్నామని పేర్ని నాని పేర్కొన్నారు.

Back to Top