తాడేపల్లి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆయన సేవలను నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్ర స్వామి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పి రెడ్డి, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిప్యూటి స్పీకర్ కోలగట్ల వీరభధ్రస్వామి మాట్లాడుతూ.. పొట్టిశ్రీరాములు జీవితం అందరికి ఆదర్శం అన్నారు. మహాత్మాగాంధీ స్వాతంత్ర పోరాట పిలుపులో భాగంగా పొట్టి శ్రీరాములు జాతీయోద్యమంలో పాల్గొన్నారన్నారు. తెలుగు మాట్లాడే వాళ్ళకు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరాహారదీక్ష చేస్తూ తన ప్రాణాలను త్యాగం చేసి అమరజీవిగా నిలిచారని కొనియాడారు. స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాకు పెట్టి ఆయన పేరు చిరస్మరణీయంగా ఉండేలా నిర్ణయం తీసుకున్నారన్నారు. తండ్రి అడుగుజాడల్లోనే సీఎం వైయస్ జగన్ నడుస్తూ.. పొట్టిశ్రీరాములు పట్ల ఎనలేని గౌరవాన్ని కనబరుస్తారన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి గాని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ కాని పొట్టిశ్రీరాములుకి ఇచ్చిన గౌరవం రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు ఇచ్చినట్లుగా తామంతా భావిస్తామన్నారు. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు వారసులుగా నేడు ఆర్యవైశ్యులు కొనసాగుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి ఆ మహానుభావులు చేసిన సేవలే కారణమని అన్నారు. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రం కోసం తన ప్రాణాలు త్యాగం చేసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములని గుర్తుచేశారు. 51 రోజుల నిరాహారదీక్ష చేసి, తన ప్రాణాలను ఫణంగా పెట్టి మన రాష్ట్రాన్ని సాధించారన్నారు. స్వాతంత్ర పోరాటంలో మహాత్మాగాంధీ చూపిన బాటలో పొట్టిశ్రీరాములు నడిచారన్నారు. వైయస్ఆర్ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాకు పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అని నామకరణం చేయడం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి జిల్లాలో అధికారికంగా చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాలు ఇచ్చారన్నారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటున్న చంద్రబాబు 2014లో రాష్ట్ర విభజన జరిగిన జూన్ 2న నవనిర్మాణదీక్షలు పెట్టడమే కాకుండా నవంబర్ 1న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా రద్దు చేశారన్నారు. ఇదే విషయాన్ని పాదయాత్రలో వైయస్ జగన్‌కి విజ్ఞాపన చేయగా...ఆనాడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అధికారంలోకి రాగానే నవంబర్ 1వ తేదీన రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తున్నారన్నారు. శాసనమండలి సభ్యులు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. పొట్టిశ్రీరాములు రాష్ట్రసాధన కోసం చేసిన త్యాగం భావితరాలకు ఆదర్శం అన్నారు. పట్టుదల, దీక్ష ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన నిరూపించారన్నారు. పొట్టిశ్రీరాములు ఆశయాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో ముందుకు తీసుకువెళ్తామని తెలియచేశారు. కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత, నవరత్నాల ప్రోగ్రామ్ వైస్ ఛైర్మన్ నారాయణమూర్తి, అప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, లిడ్ క్యాప్ ఛైర్మన్ కాకుమాను రాజశేఖర్, పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యతో పాటు పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.