అన్నదాత ఆశలపై నీళ్లు

పీఎం కిసాన్‌ సాయం రూ.10 వేలకి పెంచాలన్న డిమాండ్‌ను పట్టించుకోని కేంద్రం

ఆక్వా, మత్స్య రంగాలకు కేటాయింపులు లేకపోవడంపై ఆందోళన

ఫీడ్‌పై ఇంపోర్ట్‌ డ్యూటీ రద్దు చేయాలన్న విజ్ఞప్తినీ పట్టించుకోని కేంద్రం

అమరావతి: వ్యవసాయ, అనుబంధ రంగా­లకు కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులపై మిశ్రమ స్పంద­న లభిస్తోంది. వ్యవసాయ రంగంలో పలు మిష­న్ల ఏర్పాటు చేయడం ఒకింత మేలు చేస్తుందంటున్న నిపుణులు.. పీఎం కిసాన్‌ యోజన వంటి కొన్ని పథకాల సాయాన్ని పెంచకపోవడం రైతుల ఆశలపై నీళ్లు చల్లడమేనని చెబుతున్నారు. పీఏం కిసాన్‌ యోజన సాయం పెంచుతారని రైతులు ఎంత­గానో ఎదురు చూశారు.

ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో రూ.6 వేల చొప్పున అందించే పెట్టుబడి సాయాన్ని కనీసం రూ.10 వేలకి పెంచా­లన్న డిమాండ్‌ను కేంద్రం ఆమోది­స్తుందని ఆశించారు. అయితే ఈ డిమాండ్‌ను కేంద్రం పట్టించు­కో­కపోవడం పట్ల రైతు సంఘాలు మండిపడుతు­న్నా­యి. 

ప్రకృతి వ్యవసా­యాన్ని ప్రోత్సహించేందుకు ఏటా ఇచ్చినట్టే ఈ ఏడాది కూడా బడ్జెట్‌లో రూ.­186 కోట్లు కేటాయించారు. ఆక్వా, మత్స్య రంగా­లకు ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం పట్ల ఆ రంగాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తు­న్నారు. రొయ్యలు, చేపల ఫీడ్‌పై ఇంపోర్ట్‌ డ్యూటీని రద్దు చేయాలన్న విజ్ఞప్తిని కేంద్రం ఏమాత్రం పరిగణనలోకి తీసుకపోవడం పట్ల జాతీయ రొయ్య రైతుల సమాఖ్య నిరసన తెలిపింది.

మిషన్లతో కొంత మేలు
బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేకపోయినప్పటికీ కేంద్రం ప్రకటించిన పలు మిషన్ల ద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కొత్త వంగడాలు, పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మిషన్‌లను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, డాక్టర్‌ వైఎస్సార్‌  ఉద్యాన విశ్వవిద్యాలయాల నుంచి ఏటా పదుల సంఖ్యలో కొత్త వంగడాలు విడుదలవుతున్నాయి.

కొత్తగా ఏర్పాటు చేసిన హైబ్రిడ్‌ విత్తన మిషన్‌ రాష్ట్రంలో పరిశోధనలకు మరింత ఊతమిస్తుందని, మరిన్ని కొత్త వంగడాల అభివృద్ధికి నిధులు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఏటా 15 నుంచి 16 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. 18.78 లక్షల టన్నుల దిగుబడులొస్తాయి. సాధారణంగా బోర్ల కింద 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది మాత్రం 7 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. 

గడిచిన ఐదేళ్లలో క్వింటా రూ.10వేలకు పైగా పలికిన పత్తి ప్రస్తుతం ఐదారు వేలకు మించి పలకక రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఏర్పాటు చేస్తున్న పత్తి మిషన్‌ రాష్ట్రంలో పత్తి సాగు విస్తరణకు, ఉత్పాదకత పెంచేందుకు దోహదపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పప్పు దినుసుల కోసం ప్రత్యేక మిషన్‌ ఏర్పాటు చేయడం రాష్ట్రంలో అపరాల సాగుకు కొంత మేర ప్రోత్సాహకరంగా ఉంటుందని చెబుతున్నారు. 

రాష్ట్రంలో ఖరీఫ్‌లో 7.50 లక్షల ఎకరాల్లో, రబీలో 23 లక్షల ఎకరాల్లో అపరాలు సాగవుతుంటాయి. రెండు సీజన్లకు కలిపి 62 లక్షల టన్నుల దిగుబడులొస్తాయి. ప్రత్యేక మిషన్‌ ద్వారా సాగు విస్తీర్ణం, ఉత్పాదకత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

రుణ పరపతి పెంపుతో 55 లక్షల మందికి లబ్ధి
కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా వడ్డీ రాయితీ రుణ పరపతిని రూ.5 లక్షలకు పెంచడం ద్వారా రాష్ట్రంలో రైతులతో పాటు ఆక్వా, పాడి రైతులకు కూడా మేలు జరగనుంది. సుమారు 55 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగుతుందని అంచనా వేస్తున్నారు. స్వల్ప కాలిక వ్యవసాయ రుణాలకు  కూడా ఈ వడ్డీ రాయితీ వర్తిస్తుంది.

సాధారణంగా ఇలా పొందిన రుణాలకు రూ.లక్ష వరకు సున్నా వడ్డీ రాయితీ ఇస్తుండగా, రూ. 3 లక్షల వరకు ఇంట్రస్ట్‌ సబ్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద 3 శాతం వడ్డీ రాయితీ పొందే అవకాశం ఉండేది. ఇక నుంచి రూ.5 లక్షల వరకు ఈ రాయితీ పొందే వెసులుబాటు కల్పించారు. 

Back to Top