శ్రీకాకుళం: గ్రామాల్లో ఉన్న వారెవరయినా తాము అందిస్తున్న సంక్షేమ పథకాలు వద్దనుకుంటే రాసి ఇవ్వమని చెప్పండి.. అంతేకానీ అర్థరహిత విమర్శలు చేయవద్దు అని టీడీపీని ఉద్దేశించి మంత్రి ధర్మాన ఘాటు వ్యాఖ్యలు చేశారు. పథకాలు అమలు అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దీనిని ఎవ్వరూ కాలరాయలేరని, తాము పార్టీలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నామ ని, ఎవ్వరైనా సరే ! వీటిని వద్దనుకుంటే లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాకే విమర్శలు చేయాలని, ఇందులో మధ్యవర్తులకు చోటే లేదని అన్నారు. అదేవిధంగా నాడు అమలులో ఉన్న జన్మభూమి లాంటి కమిటీలకూ, సంబంధిత ప్రలోభాలకూ తావేలేదని స్పష్టం చేశారు. ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, వాస్తవాలు తెలుసుకుని అప్పుడు విమర్శలు చేయాలి అని విపక్షానికి హితవు చెప్పారు. తాము అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఒక్కసారి పరిశీలించాలి అని, రెండు కళ్లతో చూసి , వాస్తవాలు బేరీజు వేసుకుని అటుపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాట్లాడాలని సూచించారు. అంపోలులో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గడిచిన మూడేళ్లుగా తాము అవినీతి లేని పాలన అందిస్తున్నామని, లంచాలు లేని పాలన అందిస్తున్నామని, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే సంక్షేమ పథకాలకు సంబంధించిన మొత్తాలను అర్హతను అనుసరించి అందిస్తున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం, అంపోలు గ్రామంలో సచివాలయం - 1 పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రజా తీర్పు వెలువడి నేటి (మే 24)తో మూడేళ్లు కావస్తోందని, ఆ నాడు విపక్ష నేత హోదాలో పాదయాత్ర చేపట్టి రాష్ట్రం అంతా తిరిగి స్థానిక, బాధిత వర్గాల సమస్యలు తెలుసుకుని, వాటికి పరిష్కారం ఇచ్చే విధంగా నేడు జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని అన్నారు. "ఒకప్పుడు సాధారణ కుటుంబాల వారు తమ సమస్యలు చెప్పుకునేందుకు వెనుకడుగు వేసే వారు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తద్వారా స్థానిక స్వపరిపాలన మరింత చేరువగా గ్రామ సచివాలయాల పేరిట అందుబాటులోకి రావడంతో..పాలన రూపు మారిపోయింది. అర్హత ఉంటే చాలు లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇందులో ఎటువంటి అపోహలకు తావులేదు. ఈ తరుణాన పథకాల అమలుకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితం. ఇదే సమయాన చాలా మంది అభివృద్ధి లేదంటున్నారు. ఇది కూడా సబబు కాదు. అంపోలు గ్రామంలో రూ.40 లక్షల వెచ్చించి సచివాలయ శాశ్వత భవనం నిర్మించాం. ఈ గ్రామం పరిధిలో ఉన్న మూడు సచివాలయాల నిర్మాణానికి సంబంధించి కోటీ ఇరవై లక్షల రూపాయలు మంజూరు చేశాం. అదేవిధంగా ఈ గ్రామంలో రైతు భరోసా కేంద్రం నిర్మించాం. బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ కు నిధులు ఇచ్చాం. గ్రామ పరిధిలో 1020 మీటర్ల మేర రోడ్డు నిర్మాణం పనులు, 1900 మీటర్ల మేర కాలువ నిర్మాణం పనులు చేపట్టాం. అదేవిధంగా 60 లక్షల రూపాయలకు పైగా వెచ్చించి జెడ్పీ స్కూలుకు ఆధునిక హంగులు అందించాం. అదేవిధంగా ఎంపీపీ స్కూలుకు 30 లక్షలు ఇచ్చాం. అదేవిధంగా అర్హులయిన వారికి 200 ఇళ్లు మంజూరు చేశాం. వీటిలో చాలా వరకూ నిర్మాణం పూర్తి కావస్తున్నాయి కూడా ! వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మీరు మళ్లీ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు.